South Korea : దక్షిణ కొరియా పదవీచ్యుత అధ్యక్షుడిపై అరెస్టు వారెంట్.. ఎందుకు ?
దక్షిణ కొరియా(South Korea) అధికార పార్టీతో కానీ.. ప్రభుత్వంతో కానీ.. పార్లమెంటుతో కానీ సంప్రదించకుండానే యూన్ ఎందుకు ఎమర్జెన్సీని విధించారు ?
- By Pasha Published Date - 09:39 AM, Tue - 31 December 24

South Korea : ఇటీవలే పార్లమెంటు అభిశంసనతో దక్షిణ కొరియా అధ్యక్ష పదవిని కోల్పోయిన యూన్ సుక్ యోల్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. దేశంలో ఎమర్జెన్సీని విధిస్తూ ఏకపక్షంగా ఆదేశాలు జారీ చేసిన వ్యవహారంలో ఆయనను న్యాయపరమైన చిక్కులు వెంటాడుతున్నాయి. ఈ అంశంపై విచారణ కోసం తమ ఎదుట హాజరు కావాలంటూ దక్షిణ కొరియా జాతీయ దర్యాప్తు విభాగం మూడుసార్లు యూన్‌కు సమన్లు పంపింది. అయితే ఆయన స్పందించలేదు. దీంతో యూన్‌ను అరెస్టు చేసి విచారించేందుకు అనుమతించాలంటూ కోర్టులో దక్షిణ కొరియా ప్రభుత్వ దర్యాప్తు విభాగం పిటిషన్ వేసింది. దాన్ని విచారించిన కోర్టు.. అందుకు అంగీకారం తెలిపింది. యూన్ అరెస్టుకు సియోల్ వెస్ట్రన్ డిస్ట్రిక్ట్ కోర్టు వారెంట్‌ను జారీ చేసింది. నేడో, రేపో యూన్ సుక్ యోల్‌ను అరెస్టు చేస్తారని తెలుస్తోంది.
Also Read :US Treasury Hacked : ఏకంగా అమెరికా ట్రెజరీపై చైనా సైబర్ ఎటాక్ !
దక్షిణ కొరియా(South Korea) అధికార పార్టీతో కానీ.. ప్రభుత్వంతో కానీ.. పార్లమెంటుతో కానీ సంప్రదించకుండానే యూన్ ఎందుకు ఎమర్జెన్సీని విధించారు ? కారణం ఏమిటి ? అనేది తెలుసుకునే దిశగా దర్యాప్తు విభాగం ఫోకస్ చేయనుంది. ఈ అంశాలపైనే యూన్‌ను ప్రశ్నించే ఛాన్స్ ఉంది. యూన్‌ను ప్రశ్నించనున్న టీమ్‌లో న్యాయ నిపుణులతో పాటు పోలీసు, రక్షణ శాఖ, అవినీతి నిరోధక శాఖల ఉన్నతాధికారులు ఉంటారని సమాచారం. పార్లమెంటు అభిశంసనతో యూన్ దేశ అధ్యక్ష పదవిని కోల్పోయారు. ప్రస్తుతం ఈ అంశం దేశ రాజ్యాంగ న్యాయస్థానం పరిధిలో ఉంది. ఆ కోర్టు ఇచ్చే తీర్పుపైనే యూన్ భవితవ్యం ఆధారపడి ఉంది. తీర్పు ఎలా ఉన్నా.. మళ్లీ దేశ అధ్యక్ష పదవిని చేపట్టకూడదని యూన్ నిర్ణయించుకున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మొత్తం మీద దక్షిణ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. అధికార, విపక్షాలు ఏకతాటిపై ఉన్నట్టు స్పష్టమవుతోంది. పార్లమెంటులో అభిశంసన తీర్మానాలు పాస్ కావడంలో విపక్ష ఎంపీలతో పాటు అధికార పార్టీ ఎంపీలు కూడా కీలక పాత్ర పోషించారు.