Toll Fee : టూవీలర్లకు టోల్ ఫీజుపై కేంద్రం స్పష్టత
దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలపై టూవీలర్ల నుంచి ఎటువంటి యూజర్ ఛార్జీలు వసూలు చేయడం లేదు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను ప్రజలు నమ్మకండీ అని ఆ ప్రకటనలో పేర్కొంది. అలాగే, ప్రస్తుతం అమలులో ఉన్న టోల్ వసూళ్ల నిబంధనలు నేషనల్ హైవేస్ ఫీజు (డెటర్మినేషన్ ఆఫ్ రేట్స్ అండ్ కలెక్షన్), రూల్స్-2008 ప్రకారంగా కొనసాగుతున్నాయని, వీటిలో ఎలాంటి మార్పు ప్రతిపాదన ప్రస్తుతం లేదని పేర్కొంది.
- By Latha Suma Published Date - 03:19 PM, Thu - 21 August 25

Toll Fee : జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలపై ద్విచక్ర వాహనాలపై టోల్ ఫీజు వసూలు చేస్తున్నామని సోషల్ మీడియాలో వదంతులు హల్చల్ చేస్తున్న నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం గురువారం స్పష్టతనిచ్చింది. ద్విచక్ర వాహనాలపై ఎలాంటి టోల్ వసూలు చేయడం లేదని స్పష్టం చేస్తూ, సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఖండించింది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఓ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలపై టూవీలర్ల నుంచి ఎటువంటి యూజర్ ఛార్జీలు వసూలు చేయడం లేదు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను ప్రజలు నమ్మకండీ అని ఆ ప్రకటనలో పేర్కొంది. అలాగే, ప్రస్తుతం అమలులో ఉన్న టోల్ వసూళ్ల నిబంధనలు నేషనల్ హైవేస్ ఫీజు (డెటర్మినేషన్ ఆఫ్ రేట్స్ అండ్ కలెక్షన్), రూల్స్-2008 ప్రకారంగా కొనసాగుతున్నాయని, వీటిలో ఎలాంటి మార్పు ప్రతిపాదన ప్రస్తుతం లేదని పేర్కొంది. ఇందులో ప్రకారం, నాలుగు లేదా అంతకంటే ఎక్కువ చక్రాల వాహనాలకు మాత్రమే టోల్ ఫీజు వర్తిస్తుంది.
టోల్ వర్తించే వాహనాల జాబితా
ప్రస్తుతం టోల్ వసూలు జరుగుతున్న వాహనాల్లో కారు, జీప్, వ్యాన్, తేలికపాటి వాణిజ్య వాహనాలు, బస్సులు, ట్రక్కులు, మల్టీ యాక్సిల్ వాహనాలు, భారీ నిర్మాణ యంత్రాలు ఉన్నాయని స్పష్టం చేసింది. ద్విచక్ర వాహనాలు (టూవీలర్లు) ఈ జాబితాలో లేవని మరోసారి పునరుద్ఘాటించింది.
ఫాస్టాగ్ పాసుల విక్రయాల్లో రికార్డు స్థాయి ఆదాయం
మరోవైపు, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) తాజా గణాంకాలను విడుదల చేసింది. కేవలం నాలుగు రోజుల్లోనే 5 లక్షలకు పైగా వార్షిక టోల్ పాసులు అమ్ముడైనట్లు తెలిపింది. ఈ ఫాస్టాగ్ ఆధారిత పాసుల విక్రయాల ద్వారా రూ. 150 కోట్ల ఆదాయం వచ్చినట్లు వెల్లడించింది. ఈ వార్షిక టోల్ పాసు ప్రైవేట్ వాహనదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. ఒక్కో పాసు ధరను రూ. 3,000గా నిర్ణయించారు. ఇది కొనుగోలు చేసిన తేదీ నుంచి సంవత్సరం పాటు లేదా 200 టోల్ ప్రయాణాల వరకు చెల్లుబాటు అవుతుంది — ఏది ముందైతే అదే అమలులోకి వస్తుంది.
పాసుల అమ్మకాల్లో తమిళనాడు మొదటి స్థానంలో
ఫాస్టాగ్ వార్షిక పాసుల విక్రయాల్లో అత్యధిక స్పందన లభించిన రాష్ట్రంగా తమిళనాడు నిలిచింది. తర్వాత కర్ణాటక, హర్యానా రాష్ట్రాలు వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఇక ఈ పాసుల ఆధారంగా టోల్ లావాదేవీల పరంగా చూస్తే తమిళనాడు, కర్ణాటక తర్వాత ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉందని ఎన్‌హెచ్‌ఏఐ తెలిపింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పేర్కొన్న ప్రకారం, ద్విచక్ర వాహనాలపై టోల్ ఫీజు వసూలు చేసే ప్రసక్తే లేదని తేలిపోయింది. ఎన్‌హెచ్‌ఏఐ తరఫున కూడా అలాంటి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేస్తూ, సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు సమాచారం నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది.