By-election : పంజాబ్, యూపీ, కేరళలో ఉప ఎన్నికల తేదీ మార్పు..
By-election : నవంబర్ 13వ తేదీన పలు సామాజిక, సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలు ఉన్నందున ఆరోజు ఎన్నికలు నిర్వహించడం వల్ల ఓటింగ్ శాతం తగ్గే అవకాశం ఉందని, తేదీని మార్చాలని బీజేపీ, కాంగ్రెస్, బీఎస్‌పీ, ఆర్ఎల్‌డీ సహా పలు రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థల ప్రతినిధుల నుంచి విజ్ఞప్తులు వచ్చినట్టు ఈసీఐ తెలిపింది.
- By Latha Suma Published Date - 04:41 PM, Mon - 4 November 24

Election Commission of India : భారత ఎన్నికల సంఘం సోమవారంనాడు కీలక ప్రకటన చేసింది. పంజాబ్, యూపీ, కేరళలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల పోలింగ్ తేదీలో మార్పులు చేసింది. ఈ మేరకు నవంబర్ 13న జరగాల్సిన పోలింగ్, నవంబర్ 20న జరుగుతుందని తెలిపింది. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరగనుందని ప్రకటించింది. నవంబర్ 13 -15 మధ్య పలు పర్వదినాలను ఉటంకిస్తూ పలు రాజకీయ పార్టీలు పోలింగ్ తేదీని మార్చాల్సిందిగా అభ్యర్థించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఈ పండుగలు రాష్ట్రాల్లో ఓటింగ్ శాతంపై ప్రభావం చూపుతాయని పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు పేర్కొన్నాయి. యుపిలో 9, పంజాబ్‌లో నాలుగు, కేరళలోని ఒక అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు 15 రాష్ట్రాల్లోని మొత్తం 48 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఈ ఉప ఎన్నికల్లో ఓటింగ్ జరగనుంది.
కాగా, నవంబర్ 13వ తేదీన పలు సామాజిక, సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలు ఉన్నందున ఆరోజు ఎన్నికలు నిర్వహించడం వల్ల ఓటింగ్ శాతం తగ్గే అవకాశం ఉందని, తేదీని మార్చాలని బీజేపీ, కాంగ్రెస్, బీఎస్‌పీ, ఆర్ఎల్‌డీ సహా పలు రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థల ప్రతినిధుల నుంచి విజ్ఞప్తులు వచ్చినట్టు ఈసీఐ తెలిపింది. వారి విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉపఎన్నికల పోలింగ్ తేదీని నవంబర్ 20వ తేదీకి మార్చినట్టు ప్రకటించింది.
తాజా మార్పులతో 14 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికలు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, జార్ఖాండ్ రెండో విడత ఎన్నికలతో కలిసి జరుగనున్నాయి. 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీకి ఒకే విడతలో నవంబర్ 20న పోలింగ్ జరుగనుంది. జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికలు రెండు విడతలుగా నవంబర్ 13, నవంబర్ 30న జరుగనున్నాయి. మహారాష్ట్ర, జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఉపఎన్నికల ఫలితాలు నవంబర్ 23న వెలువడతాయి.