Mamata Banerjee : బంగ్లాదేశ్ చొరబాట్లకు కేంద్ర బలగాలు అనుమతి : మమతా బెనర్జీ
కేంద్ర ప్రభుత్వానిది "నీచమైన బ్లూప్రింట్" అని మండిపడ్డారు. అలాగే ఓటు బ్యాంకు కోసం బంగ్లాదేశీయులకు సంబంధిత పత్రాలను టీఎంసీ అందజేస్తున్నదని, వారి చొరబాట్లకు సహకరిస్తున్నదని బీజేపీ విమర్శించింది.
- By Latha Suma Published Date - 05:41 PM, Thu - 2 January 25

Mamata Banerjee : పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గురువారం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె కేంద్రప్రభుత్వం పై కీలక వ్యాఖ్యలు చేశారు. తమ రాష్ట్రంలోకి చొరబాట్లకు కేంద్ర ప్రభుత్వం ముఖ్య పాత్ర పోషిస్తున్నదని విమర్శించారు. అందుకే బంగ్లాదేశీయుల చొరబాట్లను బీఎస్ఎఫ్ అనుమతిస్తున్నదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వానిది “నీచమైన బ్లూప్రింట్” అని మండిపడ్డారు. అలాగే ఓటు బ్యాంకు కోసం బంగ్లాదేశీయులకు సంబంధిత పత్రాలను టీఎంసీ అందజేస్తున్నదని, వారి చొరబాట్లకు సహకరిస్తున్నదని బీజేపీ విమర్శించింది.
మహిళలను చిత్రహింసలకు గురిచేస్తోంది. సరిహద్దులను టీఎంసీ కాపాడటం లేదు. సరిహద్దు మా చేతుల్లో లేదు. కాబట్టి చొరబాట్లను టీఎంసీ అనుమతించిందని ఎవరైనా ఆరోపిస్తే, అది బీఎస్‌ఎఫ్ బాధ్యత అని నేను ఎత్తి చూపుతా అని అన్నారు. అలాగే చొరబాట్లను బీఎస్‌ఎఫ్ అనుమతించే ప్రాంతాలను గుర్తించి దర్యాప్తు చేయాలని డీజీపీని ఆదేశిస్తానని స్పష్టం చేశారు. సరిహద్దులో చొరబాట్ల గురించి రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్రం వద్ద కూడా సమాచారం ఉందని మమతా బెనర్జీ తెలిపారు. డీజీపీ రాజీవ్ కుమార్‌తోపాటు స్థానిక వర్గాల నుంచి తనకు సమాచారం అందిందని చెప్పారు. దీని గురించి కేంద్రానికి ఘాటుగా లేఖ రాస్తానని అన్నారు.
బెంగాల్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు ఆజ్యం పోసే ప్రయత్నం ఎవరైనా చేస్తే నిరసనలు తప్పవంటూ కేంద్రాన్ని హెచ్చరించారు. ఇందులో కేంద్రం పాత్ర కూడా ఉంది అని అన్నారు. పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌లో శాంతి నెలకొనాలని ఆశిస్తున్నట్లు మమతా బెనర్జీ తెలిపారు. మాకు శత్రుత్వం లేదు. కానీ గూండాలను ఇక్కడకు అనుమతిస్తున్నారు. వారు నేరాలకు పాల్పడి సరిహద్దు దాటి తిరిగి వస్తున్నారు. ఈ చొరబాట్లను బీఎస్‌ఎఫ్ అనుమతిస్తుందని మమతా బెనర్జీ అన్నారు. కాగా, బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లు బెంగాల్‌లో శాంతికి విఘాతం కలిగిస్తోందని ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు.