Viral News : దున్నపోతు కోసం కొట్టుకున్న రెండు గ్రామాలు.. చివరికి ఏమైందంటే..!
Viral News : కర్ణాటకలోని బొమ్మనహాల్ గ్రామానికి, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా మేడేహాల్ గ్రామానికి మధ్య ఈ వివాదం తలెత్తింది. చివరకు ఈ వివాదం చినికి చినికి గాలి వానగా మారి మోకా పోలీస్‌స్టేషన్ వరకు చేరింది..
- By Kavya Krishna Published Date - 05:10 PM, Thu - 2 January 25

Viral News : ఒక దున్నపోతు వివాదం ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాల రెండు గ్రామాల ప్రజలను పరస్పర విరోధానికి దారి తీసింది. కర్ణాటకలోని బొమ్మన్‌హళ్ గ్రామం, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా మేడేహాల్ గ్రామం మధ్య ఈ వివాదం చర్చనీయాంశంగా మారింది. దున్నపోతు తమదని ఇరువర్గాలు గొడవ చేయడంతో, చివరికి ఈ వివాదం పోలీస్‌స్టేషన్ వరకు చేరింది.
దున్నపోతు తల్లిని గుర్తించేందుకు DNA పరీక్ష డిమాండ్
బొమ్మన్‌హళ్ గ్రామస్తులు ఆ దున్నపోతు తమదని వాదిస్తున్నారు. వారి మాట ప్రకారం, జనవరిలో జరిగే దేవి సక్కమాదేవి జాతరకు బలి ఇవ్వడానికి ఉద్దేశించిన ఐదేళ్ల దున్నపోతు మేత కోసం వెళ్లి దారితప్పి, 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న మేడేహాల్ గ్రామానికి చేరుకుంది. అయితే, మేడేహాల్ గ్రామస్తులు ఆ దున్నపోతు తమదని గొడవ చేస్తూ దానిని ఇవ్వడానికి నిరాకరించారు.
దీంతో ఇరు గ్రామాల ప్రజల మధ్య వాగ్వాదం ముదిరి, చివరికి ఘర్షణకు దారి తీసింది. ఈ ఘర్షణలో కొందరు గాయపడ్డారు. ఇరువర్గాలూ తమ వాదనను నమ్మించే ప్రయత్నంలో దున్నపోతు తల్లిని గుర్తించేందుకు DNA పరీక్ష చేయాలని డిమాండ్ చేశాయి.
ఘర్షణపై పోలీసులు స్పందన
బొమ్మన్‌హళ్ గ్రామస్తులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తూ, తమ గ్రామంలో ప్రతి ఐదేళ్లకోసారి జరిగే సక్కమాదేవి జాతర సందర్భంగా ఒక దున్నపోతును బలి ఇస్తారని, ఆ ఉద్దేశంతో ఉంచిన దున్నపోతు మేడేహాల్ గ్రామంలో ఉందని ఫిర్యాదు చేశారు. మేడేహాల్ గ్రామస్తులు మాత్రం తమ వాదనను వదలకుండా, తమ గ్రామంలో ప్రతి మూడేళ్లకోసారి జరిగే పండుగకు సంబంధించినదే ఆ దున్నపోతు అని గొడవ చేస్తున్నారు.
మోకా పోలీస్‌స్టేషన్ చర్చలకు వేదిక
ఇరు గ్రామాల ప్రజలు మోకా పోలీస్‌స్టేషన్‌లో తమ వాదనలపై చర్చలు జరిపారు. ఈ వివాదంపై పోలీసులు శాంతియుత పరిష్కారాన్ని సూచించే ప్రయత్నం చేస్తున్నా, DNA పరీక్షలు నిర్వహించాలన్న డిమాండ్ ఇంకా కొనసాగుతోంది. ఈ దున్నపోతు వివాదం కేవలం రెండు గ్రామాల మధ్య ఘర్షణగా మిగలకపోయి, రెండు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇరువర్గాలూ తమ వాదనను నమ్మించే ప్రయత్నంలో ఉండగా, ఈ వివాదానికి ఎలా ముగింపు లభిస్తుందో అన్నదే కుతూహలంగా మారింది.
Big Shock To BJP : బీఆర్ఎస్‌లో చేరిన మహేశ్ రెడ్డి