Pahalgam attacker : పహల్గాం ఉగ్రదాడి వెనుక పాక్ ఉగ్రవాదులే.. వెలుగులోకి మరో ఆధారం
మృతదేహం అందుబాటులో లేనప్పుడు నిర్వహించే ‘జనాజా-ఎ-గైబ్’ విధానంలో ఆయన అంత్యక్రియలు జరపడం గమనార్హం. ఈ కార్యక్రమం రావల్‌కోట్‌లోని ఖైగాలా ప్రాంతంలో జరిగింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లోని ఈ గ్రామంలో పలువురు పెద్దలు పాల్గొన్న ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఓ టెలిగ్రామ్ ఛానల్‌లో వెలువడ్డాయి.
- By Latha Suma Published Date - 12:44 PM, Sun - 3 August 25

Pahalgam attacker : పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్నవారు పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులేననే అంశానికి మరో తిరుగులేని ఆధారం బయటపడింది. ఇటీవల ‘ఆపరేషన్ మహాదేవ్’లో హతమైన ముగ్గురు ఉగ్రవాదుల్లో ఒకడైన తాహీర్ హబీబ్‌కు పీవోకేలో ప్రత్యేక పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించడం ఇది స్పష్టంగా చాటుతోంది. మృతదేహం అందుబాటులో లేనప్పుడు నిర్వహించే ‘జనాజా-ఎ-గైబ్’ విధానంలో ఆయన అంత్యక్రియలు జరపడం గమనార్హం. ఈ కార్యక్రమం రావల్‌కోట్‌లోని ఖైగాలా ప్రాంతంలో జరిగింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లోని ఈ గ్రామంలో పలువురు పెద్దలు పాల్గొన్న ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఓ టెలిగ్రామ్ ఛానల్‌లో వెలువడ్డాయి. ఈ వేడుకలో లష్కరే తోయిబా కమాండర్ రిజ్వాన్ హనీఫ్ కూడా పాల్గొనడానికి ప్రయత్నించాడు. కానీ తాహీర్ కుటుంబ సభ్యులు అతడిని అడ్డుకోవడంతో ఘర్షణ తలెత్తింది. ఈ క్రమంలో హనీఫ్ తన అనుచరులతో కలిసి ఆయుధాలను ప్రదర్శించి స్థానికులను భయబ్రాంతులకు గురిచేశాడు. ఈ ఉదంతం అక్కడ ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించింది.
Read Also: TTD : తిరుమలలో పవిత్రోత్సవాలు..ఆర్జితసేవలు రద్దు: టీటీడీ
తాహీర్ హబీబ్ గతంలో ఇస్లామిక్ జమాత్ తలాబా, స్టూడెంట్ లిబరేషన్ ఫ్రంట్ వంటి సంస్థలతో అనుబంధం కలిగి ఉన్నాడు. అతడికి “అఫ్గాని” అనే నిక్‌నేమ్ కూడా ఉంది. ఇది ఇండియన్ ఇంటెలిజెన్స్ రికార్డుల్లో నమోదు చేయబడి ఉంది. పాక్ సైన్యంతో అతనికి గాఢమైన సంబంధాలున్నట్లు తెలుస్తోంది. అదే అతడి ఉగ్ర మార్గాన్ని పెంచినట్లు సమాచారం. పహల్గాం దాడికి సంబంధించి మరింత కీలక సమాచారం వెలుగు చూసింది. ఉగ్రవాదులు శ్రీనగర్‌కు సమీపంలోని మహాదేవ్ పర్వత శ్రేణుల్లో తలదాచుకున్నట్లు గుర్తించారు. ఈ ప్రాంతం 13,000 అడుగుల ఎత్తులో ఉండి, ఏడాది పొడవునా మంచుతో కప్పి ఉంటుంది. గత ఆదివారం అర్ధరాత్రి తర్వాత, చైనాలో తయారైన ‘టీ82’ అనే ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ సెట్ పనిచేసినట్లు భద్రతా దళాలు గుర్తించాయి. ఈ సెట్ వినియోగించబడిన ప్రదేశం డాచిగామ్ నేషనల్ పార్క్ పరిధిలోని పహల్గాం ప్రాంతంగా తేలింది.
ఈ సమాచారంతో అప్రమత్తమైన సైన్యం, సీఆర్పీఎఫ్, జమ్మూ కశ్మీర్ పోలీస్‌లు కలిసి ఓ భారీ ఆపరేషన్‌ను ప్రారంభించాయి. ఉదయం 11 గంటల ప్రాంతంలో ముగ్గురు ఉగ్రవాదులను గుర్తించి ఎదురు కాల్పుల్లో మట్టుబెట్టారు. వీరిలో తాహీర్ హబీబ్‌తో పాటు మరొకరు పీవోకేకు చెందిన వారేనని ఇంటెలిజెన్స్ వర్గాలు ధ్రువీకరించాయి. ఈ దాడిలో ఉగ్రవాదులు అత్యాధునిక కమ్యూనికేషన్ పరికరాలను, హై ఆల్టిట్యూడ్ శిక్షణను వినియోగించిన తీరు పాక్ మద్దతును మరింత బలంగా సూచిస్తోంది. ఇందుకు తాహీర్ కుటుంబం నిర్వహించిన గైబ్ జనాజా కీలక ఆధారంగా మారుతోంది. పాకిస్తాన్ ప్రభుత్వ, సైనిక మద్దతుతో ఉగ్రవాదులు భారత్‌లో విధ్వంసం సృష్టించేందుకు చేస్తున్న యత్నాలు కొనసాగుతున్నాయని తాజా పరిణామాలు మరోసారి రుజువు చేస్తున్నాయి.