Chhattisgarh : నక్సలిజం నిర్మూలనపై కసరత్తు..ఛత్తీస్‌గఢ్‌లో అమిత్ షా పర్యటన
నక్సల్స్ సమస్యను పరిష్కరించి ప్రాంతానికి కొత్త భవిష్యత్తును అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
- By Latha Suma Published Date - 12:50 PM, Thu - 12 December 24

Chhattisgarh : కేంద్రప్రభుత్వం నక్సలిజం నిర్మూలన పై కసరత్తులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా (డిసెంబర్ 13 నుండి 15 వరకు) మూడు రోజులు ఛత్తీస్‌గఢ్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా అమిత్ షా ఉన్నత స్థాయి భద్రతా సమీక్ష సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. ఆగస్టులో జరిగిన నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలపై జరిగిన ఉన్నత స్థాయి సమావేశం తర్వాత ఇది మొదటి పర్యటన.
ఈ పర్యటనలో అమిత్ షా నక్సల్స్ నియంత్రణ నుంచి బయటపడిన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల పనులను సమీక్షించనున్నారు. ప్రజలు హింసను విడిచిపెట్టి సాధారణ జీవన విధానంలో కలవాలని సూచించారు. నక్సల్స్ సమస్యను పరిష్కరించి ప్రాంతానికి కొత్త భవిష్యత్తును అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం బస్తర్‌లో ఎలాంటి సేఫ్ జోన్‌లు లేవని, భవిష్యత్‌లో మరింత శాంతిని నెలకొల్పే దిశగా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.
ఇక, అమిత్ షా నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలపై మునుపటి సమావేశంలో మావోయిస్టులను హెచ్చరించారు. వారు “లొంగిపోవాలి లేదా భయంకరమైన పరిణామాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి” అమిత్ షా అని అన్నారు. గతేడాది డిసెంబర్‌లో ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నక్సలిజం నిర్మూలనలో గణనీయమైన పురోగతి సాధించామని ఆయన తెలిపారు. కాగా, ఈ యడాదిలో కాలంలో 90 మంది మావోయిస్టులు మృతి చెందగా, 123 మంది అరెస్ట్ అయ్యారని, మరో 250 మంది లొంగిపోయారని గతంలో అమిత్ షా పేర్కొన్నారు.