Delhi : కేజ్రీవాల్ ఇంటికి ఏసీబీ అధికారులు..
ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణు మిట్టల్ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయానికి చేసిన విజ్ఞప్తి మేరకు ఎల్‌జీ విచారణకు ఆదేశించినట్లు పేర్కొన్నారు.
- By Latha Suma Published Date - 06:43 PM, Fri - 7 February 25

Delhi: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్, బీజేపీ మధ్య సాగిన హోరాహోరీ పోరు పోలింగ్ తర్వాత కూడా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఆమ్ ఆద్మీ పార్టీని చీల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని.. ఒక్కో ఎమ్మెల్యే అభ్యర్థికి రూ.15 కోట్ల చొప్పున ఆఫర్ చేశారంటూ ఆ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఇప్పటిదాకా ఏడుగుర్ని సంప్రదించారని చెప్పారు. అయితే ఈ ఆరోపణలపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ జెట్ స్పీడ్‌లో రియాక్ట్ అయ్యారు. ఆప్ ఆరోపణలపై ఏసీబీ విచారణకు ఆదేశించారు. దీంతో అరవింద్ కేజ్రీవాల్ సహా మరికొందరు ఆప్ నేతల ఇళ్లకు ఏసీబీ అధికారుల బృందాలు బయలుదేరాయి.
కాగా, ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణు మిట్టల్ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయానికి చేసిన విజ్ఞప్తి మేరకు ఎల్‌జీ విచారణకు ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఆప్ నాయకుల ఆరోపణలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని.. ఢిల్లీలో భయాందోళనలు, అశాంతి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని.. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ క్రమంలో ఎల్‌జీ ఆదేశాల మేరకు ఏసీబీ అధికారులు కేజ్రీవాల్ ఇంటికి చేరుకున్నారు. ఇక, ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇదే నెల 8న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. బీజేపీ అధికారం కైవసం చేసుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మరి ఢిల్లీ పీఠం ఎవరికి దక్కుతుందో చూడాలి.
మరోవైపు ఆమ్‌ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు పార్టీ కన్వీనర్ కేజ్రీవాల్ నివాసానికి చేరుకున్నారు. పార్టీకి చెందిన 70 మంది అభ్యర్థులు, ముఖ్యమంత్రి ఆతిశీ, సీనియర్ నేతలు మనీష్ సిసోదియా, సంజయ్ సింగ్, ఇమ్రాన్ హుస్సేన్ కేజ్రీవాల్‌తో సమావేశమయ్యారు.
Read Also: BCCI Meeting: బీసీసీఐ మరో కీలక సమావేశం.. ఈసారి ఆ పోస్టు కోసం!