జొన్నల పోషక విలువలు..ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..?
జొవార్ అని కూడా పిలిచే జొన్నలను ప్రపంచవ్యాప్తంగా ఐదు వేల సంవత్సరాలకుపైగా సాగు చేస్తున్నారు. ఒకప్పుడు మన పూర్వీకుల ప్రధాన ఆహారంగా ఉన్న జొన్నలు కాలక్రమేణా పక్కన పడిపోయాయి. అయితే ఇప్పుడు వాటి పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలపై అవగాహన పెరగడంతో మళ్లీ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
- Author : Latha Suma
Date : 20-01-2026 - 6:15 IST
Published By : Hashtagu Telugu Desk
. జొన్నల ప్రత్యేకతలు, సాగు ప్రాధాన్యత
. జొన్నల పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలు
. ఆధునిక ఆహారంలో జొన్నల వినియోగం
Sorghum : తృణ ధాన్యాలు మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయన్న విషయం తెలిసిందే. వాటిలో ముఖ్యమైనది జొన్నలు. జొవార్ అని కూడా పిలిచే జొన్నలను ప్రపంచవ్యాప్తంగా ఐదు వేల సంవత్సరాలకుపైగా సాగు చేస్తున్నారు. ఒకప్పుడు మన పూర్వీకుల ప్రధాన ఆహారంగా ఉన్న జొన్నలు కాలక్రమేణా పక్కన పడిపోయాయి. అయితే ఇప్పుడు వాటి పోషక విలువలు ఆరోగ్య ప్రయోజనాలపై అవగాహన పెరగడంతో మళ్లీ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అద్భుతమైన పోషకాలు బహుళ ఆరోగ్య లాభాలు ఉండటంతో జొన్నలను “సూపర్ ఫుడ్”గా కూడా అభివర్ణిస్తున్నారు. ఆధునిక వంటకాలలోనూ జొన్నలు ప్రత్యేక స్థానం సంపాదించుకుంటున్నాయి.
జొన్నలు కరువును తట్టుకునే శక్తి ఎక్కువగా కలిగిన పంట. ఇతర ధాన్యాలతో పోలిస్తే దాదాపు 30 శాతం తక్కువ నీటితోనే పంట ఇస్తాయి. ఈ కారణంగా వర్షాభావ ప్రాంతాలకు జొన్నలు ఎంతో అనుకూలమైనవి. పర్యావరణానికి మిత్రమైన పంటగా కూడా వీటిని చెప్పవచ్చు. అంతేకాదు తక్కువ ఖర్చుతో సాగు చేయవచ్చు కాబట్టి రైతులకు కూడా లాభదాయకంగా ఉంటాయి. పోషక విలువలు అధికంగా ఉండటంతో పాటు, భవిష్యత్తు ఆహార భద్రతలో జొన్నల పాత్ర ఎంతో కీలకమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
జొన్నల్లో ఐరన్ అధికంగా ఉంటుంది. ఉడికించిన జొన్నల్లో 100 గ్రాములకు 2.25 నుంచి 4.4 మిల్లీగ్రాముల వరకు ఐరన్ లభిస్తుంది. దీనివల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. అలాగే జొన్నల్లో ఫినోలిక్ సమ్మేళనాలు ఎక్కువగా ఉండటంతో పాటు లుటియోలినిడిన్, అపిజెనినిడిన్ వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి శరీరంలో వాపు, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. జొన్నలు తీసుకోవడం వల్ల స్థిరమైన శక్తి లభిస్తుంది. జీవక్రియ మెరుగుపడుతుంది రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సహజంగా గ్లూటెన్ రహితమైన ఈ ధాన్యం రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. డయాబెటిస్ ఉన్నవారికి జొన్నలు మంచి ఆహార ఎంపిక.
జొన్నల్లో ఫైబర్ అధికంగా ఉండటంతో మలబద్ధకం సమస్య తగ్గి పేగుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా జొన్నలు ఎంతో ఉపయోగకరం. ఇవి ఎక్కువసేపు తృప్తినిచ్చి అధికంగా తినే అలవాటును తగ్గిస్తాయి. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడతాయి. అంతేకాదు చర్మం, జుట్టు ఆరోగ్యానికి కూడా జొన్నలు మేలు చేస్తాయి. ప్రస్తుతం జొన్న రొట్టెలు, జొన్న అన్నం, జొన్న ఉప్మా, జొన్న ఇడ్లీ వంటి ఎన్నో రకాల వంటకాలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. రోజువారీ ఆహారంలో జొన్నలను చేర్చుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని పోషకాహార నిపుణులు వైద్యులు సూచిస్తున్నారు.