Brahmotsavam: ఈ నెల 17న శ్రీవారి అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు (Brahmotsavam) ఈనెల 17న అంకురార్పణతో ప్రారంభం కానున్నాయి. ఈనెల 18వ తేదీ నుంచి 26 వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి.
- Author : Gopichand
Date : 13-09-2023 - 9:27 IST
Published By : Hashtagu Telugu Desk
Brahmotsavam: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు (Brahmotsavam) ఈనెల 17న అంకురార్పణతో ప్రారంభం కానున్నాయి. ఈనెల 18వ తేదీ నుంచి 26 వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం(ఆలయ శుద్ధి) నిర్వహించారు. రోజూ వాహనసేవలు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు జరుగుతాయి. అలాగే అక్టోబరు 15 నుంచి 23వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి.
ఈ నెల 18న బంగారు తిరుచ్చి, ధ్వజారోహణం, పెద్దశేష వాహన సేవలు, 19న చినశేషవాహనం, స్నపనతిరుమంజనం, హంసవాహనం, 20న సింహవాహనం, స్నపన తిరుమంజనం, ముత్యపు పందిరి వాహనం, 21న కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం, 22న మోహినీ అవతారం, గరుడసేవ, 23న హనుమంత వాహనం, సువర్ణ రథం, గజవాహనం, 24న సూర్యప్రభ వాహనం, స్నపన తిరుమంజనం, చంద్రప్రభ వాహనం, 25న రథోత్సవం, అశ్వవాహనం, 26న పల్లకీ ఉత్సవం, తిరుచ్చి ఉత్సవం స్నపన తిరుమంజనం, చక్రస్నానం, ధ్వజావరోహణం నిర్వహించనున్నట్టు టీటీడీ వెల్లడించింది.
Also Read: Udhayanidhi Stalin: ఉదయనిధి స్టాలిన్‌పై ముంబైలో కేసు నమోదు
మరోవైపు తిరుమలలో నేడు (బుధవారం) భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి దర్శనం కోసం 22 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉండాల్సి వస్తుంది. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. మంగళవారం స్వామివారిని 70,055 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.32 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.