Lakshmi Nivasam: లక్ష్మీ నివాసం ఇలా ఉంటుందా..?
- Author : Vamsi Chowdary Korata
Date : 03-07-2026 - 6:10 IST
Published By : Hashtagu Telugu Desk
లక్ష్మీదేవి ఒకసారి ఒక వ్యక్తిపై అలిగి, “నేను వెళ్లిపోతున్నాను. మీ ఇంటికి ఇక దరిద్ర దేవత రాబోతున్నది. కాకపోతే నీకో వరం ఇవ్వదలచుకొన్నాను. అడుగు!” అని అంటుంది. అప్పుడు ఆ వ్యక్తి లక్ష్మీదేవితో ఇలా అంటాడు… “అమ్మా, నీవు వెళ్తుంటే ఆపే శక్తి నాకు లేదు. అలాగే దరిద్ర దేవత వస్తుంటే ఆపే శక్తి అంతకన్నా లేదు. మీలో ఒకరు ఉన్నచోట ఒకరు ఉండరు. కాబట్టి దరిద్ర దేవత వచ్చిన వేళ మా ఇంటిలో ఒకరిపట్ల ఒకరికి ఉన్న ప్రేమాభిమానాలు అలాగే ఉండేటట్లు వరం ఇవ్వండి” అని అంటాడు. లక్ష్మీదేవి ‘తథాస్తు!’ అని వెళ్లిపోతుంది. కొన్ని రోజుల తర్వాత ఇంటిలో వంట చేస్తున్న ఆ వ్యక్తి భార్య, కూరలో ఉప్పు, కారం సమపాళ్ళలో వేయమని కోడళ్లకు చెప్పి గుడికి వెళ్తుంది. కొంతసేపటికి చిన్న కోడలు ఉప్పు, కారం కూరలో వేసి ఏదో పనిలో నిమగ్నమైపోతుంది.
ఇంకొంతసేపటికి పెద్ద కోడలు వచ్చి, కూరలో ఉప్పు వేయారో లేదో అని అనుమానంతో తను కూడా ఆ కూరకు తగినంత ఉప్పు వేసి వేరే పనిలో పడిపోతుంది. ఇంతలో అత్తగారు వచ్చి, కోడళ్లు ఇద్దరు తమ పనిలో పడి ఉప్పు వేయారో లేదో అని తను కూడా కొంత వేస్తుంది. మధ్యాహ్నం భోజన సమయంలో ఆ వ్యక్తి తాను తినే కూరలో ఉప్పు ఎక్కువైందని గ్రహించి, దరిద్ర దేవత ఇంటిలోకి ప్రవేశించిందని తెలుసుకుంటాడు. ఏమీ అనకుండా తిని లేస్తాడు. కొంతసేపటికి ఆ వ్యక్తి పెద్ద కొడుకు కూడా భోజన సమయంలో ఉప్పు ఎక్కువైందని గ్రహించి, ‘నాన్నగారు తిన్నారా?’ అని భార్యను అడుగుతాడు. ’తిన్నారు!’ అని చెబుతుంది. దానితో ‘నాన్న ఏమీ అనకుండా తిన్నాడు, నేనెందుకు అనాలి?’ అని ఏమీ మాట్లాడకుండా తిని లేస్తాడు. ఇలా ఇంటి వాళ్లంతా తిని వంట గురించి మాటలాడకుండా ఉంటారు.
ఆరోజు సాయంత్రం దరిద్ర దేవత ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి, ‘నేను వెళ్లిపోతున్నాను. ఉప్పు కసిరిన వంట తిని కూడా మీ మధ్య ఏ స్పర్థలు రాలేదు. మీరు ప్రేమగా, ఐక్యమత్యంగా ఉన్నారు. ఇటు వంటి చోట నేనుండను!’ అని వెళ్లిపోతుంది. దరిద్ర దేవత వెళ్లిపోవడంతో ఆ ఇంట్లో మళ్లీ లక్ష్మీదేవి నివాసం ఏర్పడుతుంది. ఏ ఇంట్లో ‘ప్రేమ, అప్యాయతలు మరియు శాంతి’ ఉంటాయో ఆ ఇల్లు ‘లక్ష్మీ నివాసం’ అవుతుంది. ఈ కథ చదివిన వారి ఇంట లక్ష్మీదేవి కొలువై ఉండాలని కోరుకుంటున్నాను. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు, లోకా సమస్తా సుఖినోభవంతు! రేపటి తరానికి బతుకు, భద్రతలతోపాటు భారతీయత కూడా నేర్పండి.