Rashmika Mandanna: రష్మిక టాటూ వెనుక ఉన్న అర్ధం అదేనా..?
- Author : Vamsi Chowdary Korata
Date : 18-05-2026 - 12:23 IST
Published By : Hashtagu Telugu Desk
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న నటనతోనే, తన వ్యక్తిగత విషయాలతోనూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. ముఖ్యంగా ఆమె కుడిచేతి మణికట్టుపై ఉన్న ‘ఇర్రీప్లేసబుల్’ అనే టాటూ గురించి సోషల్ మీడియాలో నిరంతరం రకరకాల పుకార్లు షికారు చేస్తూనే ఉన్నాయి. ఈ టాటూను ఆమె హీరో విజయ్ దేవరకొండ కోసమే ప్రత్యేకంగా వేయించుకుందంటూ నెటిజన్లు రకరకాల కథనాలను ప్రచారం చేస్తున్నారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో స్పందించిన రష్మిక, ఈ టాటూ వెనుక ఉన్న అసలైన నిజాన్ని, దానికి దారితీసిన ఆసక్తికరమైన నేపథ్యాన్ని బయటపెట్టి ఆ పుకార్లకు పూర్తిగా చెక్ పెట్టారు.
నిజానికి తనకు మొదట్లో శరీరంపై ఎలాంటి టాటూ వేయించుకోవాలనే ఆలోచనే లేదని రష్మిక స్పష్టం చేశారు. కానీ ఆమె కాలేజీ చదువుతున్న రోజుల్లో జరిగిన ఒక చిన్న సంఘటన ఆమె మనసును బలంగా తాకింది. ఒకరోజు కాలేజీలో ఒక అబ్బాయి రష్మిక దగ్గరకు వచ్చి, ఆడపిల్లలు అస్సలు నొప్పిని భరించలేరని… వారికి సూదులు, ఇంజెక్షన్లు అంటే చాలా భయమని కాస్త ఎగతాళిగా మాట్లాడాడు. ఆ మాటలను ఒక ఛాలెంజ్‌గా తీసుకున్న రష్మిక… ఆడవాళ్లు ఎంతటి నొప్పినైనా ఓర్చుకోగలరని నిరూపించడానికి, ఆ అబ్బాయి గర్వాన్ని అణచడానికే ఎలాగైనా టాటూ వేయించుకోవాలని అప్పుడే నిర్ణయించుకున్నారట.
తీరా టాటూ వేయించుకోవాలని ఫిక్స్ అయిన తర్వాత, చేతిపై ఎలాంటి పదాన్ని రాయించుకోవాలా? అని చాలా సమయం ఆలోచించానని రష్మిక వెల్లడించింది. తన జీవితంలో ఎప్పుడూ చాలా సహజంగా, రియల్‌గా ఉండాలని కోరుకునే రష్మికకు ఒక బలమైన ఆలోచన వచ్చింది. ఈ ప్రపంచంలో ఏ ఒక్క మనిషిని మరొకరు ఎప్పటికీ భర్తీ చేయలేరని, ప్రతి ఒక్కరూ తమదైన శైలిలో ప్రత్యేకమైనవారని ఆమె బలంగా నమ్ముతారు. ఆ విషయాన్ని ప్రతిరోజూ తనకు తాను గుర్తుచేసుకోవడానికి, అలాగే తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో ఒక మంచి లక్ష్యంగా ఉంచుకోవడానికి ‘ఇర్రీప్లేసబుల్’ అనే పదాన్ని టాటూగా ఎంచుకున్నట్లు రష్మిక క్లారిటీ ఇచ్చారు.