CM Chandrababu Naidu: దేశ భవిష్యత్తు కోసం చంద్రబాబు భారీ వ్యూహం…!!
- Author : Vamsi Chowdary Korata
Date : 18-05-2026 - 1:29 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర వేదికగా జనాభా విధానంపై సంచలన ప్రకటన చేశారు. ఒకప్పుడు జనాభా నియంత్రణకు బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచిన చంద్రబాబు.. మారిన పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు పిల్లలు భారం కాదు..భవిష్యత్తు సంపద అంటూ సరికొత్త వ్యూహానికి తెరలేపారు.
రాష్ట్రంలో పనిచేసే వయసు గల జనాభా అంటే 15-64 ఏళ్ల మధ్య జనాభా ఎక్కువగా ఉండటాన్ని డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటారు. అయితే, ఏపీలో సంతానోత్పత్తి రేటు గడిచిన 30 ఏళ్లలో 3.0 నుంచి 1.5 కి పడిపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. జనాభా స్థిరంగా ఉండాలంటే ఈ రేటు కనీసం 2.1 ఉండాలి. ప్రస్తుతం ఏపీ సగటు వయస్సు 32.5 ఏళ్లకు చేరుకుంది. ఇది జాతీయ సగటు – 28.4 ఏళ్లు కంటే చాలా ఎక్కువ. అంటే ఇండియాలోని ఇతర రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ వేగంగా వృద్ధాప్యం వైపు అడుగులు వేస్తోందని, దీనివల్ల 2040 నాటికి పనిచేసే చేతులు తగ్గిపోయి, వృద్ధుల భారం పెరిగే ప్రమాదం ఉందని ఆరోగ్య శాఖ గణాంకాలు హెచ్చరిస్తున్నాయి.
గతంలో మూడో సంతానం ఉంటే స్థానిక ఎన్నికల్లో పోటీకి అనర్హులనే నిబంధనను రద్దు చేసిన కూటమి ప్రభుత్వం, ఇప్పుడు జనాభాను పెంచేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంది. నరసన్నపేట సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. కుటుంబంలో మూడవ బిడ్డ జన్మిస్తే ₹30,000, నాల్గవ బిడ్డ జన్మిస్తే ₹40,000 తక్షణ నగదు ప్రోత్సాహకం అందిస్తామని ప్రకటించారు. గతంలో రెండో బిడ్డకు సైతం ₹25,000 ఇస్తామని ప్రతిపాదించిన విషయాన్ని గుర్తు చేస్తూ, త్వరలోనే పూర్తిస్థాయి పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీని అమలు చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. ఫ్రాన్స్, హంగేరి లాంటి ఐరోపా దేశాల నమూనాలను అధ్యయనం చేసి ఈ సరికొత్త వ్యూహాన్ని ఏపీలో ప్రవేశపెడుతున్నారు.
కేవలం నగదు ఇవ్వడమే కాకుండా, పిల్లల సంరక్షణకు ప్రభుత్వం పూర్తి భరోసా కల్పించనుంది. ఇందులో భాగంగా మూడో బిడ్డకు ఐదేళ్ల పాటు నెలకు ₹1,000 పోషకాహార భత్యం, 18 ఏళ్ల వరకు ఉచిత విద్య, ఉద్యోగుల కోసం 12 నెలల ప్రసూతి సెలవులతో పాటు 2 నెలల పితృత్వ సెలవులను కూడా ప్రతిపాదిస్తున్నారు. అంతేకాకుండా, సంతానలేమితో బాధపడే దంపతుల కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో PPP మోడ్‌లో ఉచిత IVF సేవలను అందించేందుకు మెటర్నిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయనున్నారు.
ఈ జనాభా పెంపు వెనుక కేవలం ఆర్థిక కారణాలే కాదు.. బలమైన రాజకీయ వ్యూహం కూడా ఉందంటున్నారు విశ్లేషకులు. 2026 తర్వాత దేశంలో జరగబోయే నియోజకవర్గాల పునర్విభజన పూర్తిగా జనాభా ప్రాతిపదికన జరిగితే, జనాభాను నియంత్రించిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాలు పార్లమెంట్‌లో తమ సీట్లను, ప్రాతినిధ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. ఉత్తరాది రాష్ట్రాలలో TFR ఇంకా 2.5 కంటే ఎక్కువగా ఉండటంతో వాటికి సీట్లు పెరుగుతాయి. ఈ రాజకీయ అసమతుల్యతను అడ్డుకోవాలంటే దక్షిణాదిలో జనాభా సమతుల్యత సాధించడం అనివార్యమని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు.
2047 నాటికి స్వర్ణాంధ్ర సాకారమై, రాష్ట్రాన్ని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనేది చంద్రబాబు టార్గెట్. అమరావతి క్వాంటమ్ హబ్, వైజాగ్ డేటా సెంటర్, రాయలసీమ సెమీకండక్టర్ ప్లాంట్స్ లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు రాబోయే రోజుల్లో భారీగా సాంకేతిక నిపుణులు, శ్రామిక శక్తి అవసరం అవుతుంది. జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు యువత లేక ఆర్థికంగా నష్టపోతున్న తరుణంలో, ఏపీ ఆ స్థితికి చేరకూడదనే దూరదృష్టితోనే సీఎం చంద్రబాబు ఈ పాపులేషన్ సస్టైనబిలిటీ విధానాన్ని ముందుకు తెచ్చారు. ఇది జనాభా నియంత్రణ నుంచి జనాభాను ఒక ఆస్తిగా మార్చే సరికొత్త ప్రయోగమన్న మాట!