ED : బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసు..29 మంది సెలబ్రిటీలపై కేసు నమోదు చేసిన ఈడీ
సైబరాబాద్ పోలీసుల ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ ఈ చర్యలకు దిగింది. ఈ కేసులో ప్రముఖ సినీ నటులు విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, మంచు లక్ష్మి, ప్రకాశ్ రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల తో పాటు పలువురు యాంకర్లు, బుల్లితెర నటులు, సోషల్ మీడియా ప్రముఖులు ఉన్నారు.
- By Latha Suma Published Date - 01:21 PM, Thu - 10 July 25

ED : నిషేధిత ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రచారం చేసిన వ్యవహారం ఇప్పుడు సినీ పరిశ్రమను కుదిపేస్తోంది. బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్లకు సంబంధించి 29 మంది సినీ ప్రముఖులు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసులు నమోదు చేసింది. సైబరాబాద్ పోలీసుల ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ ఈ చర్యలకు దిగింది. ఈ కేసులో ప్రముఖ సినీ నటులు విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, మంచు లక్ష్మి, ప్రకాశ్ రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల తో పాటు పలువురు యాంకర్లు, బుల్లితెర నటులు, సోషల్ మీడియా ప్రముఖులు ఉన్నారు. వారు చట్ట విరుద్ధమైన బెట్టింగ్ యాప్‌లను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రకటనలు చేశారని, ఆ యాప్‌లను డౌన్‌లోడ్ చేయమంటూ ప్రచారం చేశారని పోలీసుల ఆరోపణలు. ఈ వ్యవహారంలో పీఎంఎల్‌ఏ (ప్రివెంచన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్) కింద ఈడీ విచారణ చేపట్టనుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర పోలీసులు మొత్తం 29 మంది పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు.
29 మంది సెలబ్రిటీల పేర్లు..
రానా దగ్గుబాటి, ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, ప్రణీత, వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల, శ్రీముఖి, వర్షిణి సౌందరరాజన్, సిరి హనుమంతు, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృతా చౌదరి, నయని పావని, నేహా పఠాన్, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్ష సాయి, భయ్యా సన్నీ యాదవ్, టేస్టీ తేజ, రీతూ చౌదరి, బండారు సుప్రీత తదితరులు.
ఈ కేసు క్రిమినల్ న్యాయ వ్యవస్థలో భారతీయ శిక్షా సంహిత (BNS) సెక్షన్ 318(4), 112, 49, తెలంగాణ గేమింగ్ యాక్ట్ సెక్షన్లు 3, 3(ఎ), 4, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 66డి (2000, 2008) క్రింద నమోదైంది. ఇది కేవలం సామాన్య నేరంగా కాకుండా, ఆర్థిక నేరంగా పరిగణించబడుతోంది. ఈడీ విచారణలో ప్రధాన దృష్టి, ఈ ప్రచారాల ద్వారా సెలబ్రిటీలు ఎంత మొత్తంలో పారితోషికం తీసుకున్నారు, ఆ మొత్తాలు ఏ రూపంలో చెలామణి అయ్యాయి అనే విషయాలపైనే. ఒకవైపు బడా బ్రాండ్లను ప్రమోట్ చేస్తున్నట్లు కనపడిన ఈ ప్రకటనల వెనుక, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు మద్దతుగా నిలిచారని ఆరోపణలు వచ్చాయి.
ఈ యాప్‌ల దెబ్బకు అనేక మంది ఆర్థికంగా నష్టపోయినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. చాలామంది అప్పుల పాలై ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారని, కొన్ని కుటుంబాలు తీవ్ర ఆర్థిక సంక్షోభానికి గురయ్యాయని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఇప్పటికే పోలీసులకు పలు ఫిర్యాదులు అందాయి. తాము యాప్‌లలో డబ్బు పెట్టి నష్టపోయామని, ఆ యాప్‌లను ప్రమోట్ చేసిన సెలబ్రిటీల కారణంగానే తాము నమ్మి డబ్బు పెట్టామని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ కేసు మరింత వివాదాస్పదంగా మారే అవకాశముంది. ఎందుకంటే, ఇందులో పేర్లు వచ్చిన వారిలో పలువురు ప్రభుత్వానికే మద్దతుగా నిలిచే ప్రముఖులు కూడా ఉన్నారు. ఇక ఈ వ్యవహారంపై సినీ పరిశ్రమ స్పందన ఎలా ఉంటుందో, ఈడీ దర్యాప్తు ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాల్సివుంది.
Read Also: Nimisha Priya : యెమెన్‌లో కేరళ నర్సుకు ఉరిశిక్ష పై కీలక మలుపు..విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం