Ola Showroom On Fire : ఓలా స్కూటర్ పనిచేయడం లేదని.. ఓలా షోరూంకు నిప్పుపెట్టిన యువకుడు
మహ్మద్ నదీం ఒక మెకానిక్. అతడు కలబురగిలో ఉన్న ఓలా ఎలక్ట్రిక్ షోరూం(Ola Showroom On Fire) నుంచి ఒక స్కూటర్ కొన్నాడు.
- By Pasha Published Date - 03:00 PM, Wed - 11 September 24

Ola Showroom On Fire : ఒక ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కస్టమర్ ఆగ్రహంతో ఊగిపోయాడు. ఏకంగా కర్ణాటకలోని కలబురగిలో ఉన్న ఓలా ఎలక్ట్రిక్ షోరూంకు నిప్పు పెట్టాడు. ఇంతకీ ఎందుకు అనుకుంటున్నారా ? మహ్మద్ నదీం అనే 26 ఏళ్ల యువకుడు ఇటీవలే సదరు షోరూం నుంచి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొన్నాడు. అయితే అది సరిగ్గా పనిచేయలేదు. దీనిపై అతడు ఓలా కస్టమర్ కేర్‌కు ఫిర్యాదు చేశాడు. అయితే కస్టమర్ కేర్ వైపు నుంచి సరైన స్పందన, సమాధానం రాలేదు. దీంతో నదీం తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. మంగళవారం రోజు ఓలా షోరూం వద్దకు చేరుకొని.. లోపలికి వెళ్లి పెట్రోలు చల్లి నిప్పు పెట్టాడు. ఈ ఘటనలో షోరూంలోని ఆరు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఒక కంప్యూటర్ కాలి బూడిదయ్యాయి.
Also Read :Tremors In Delhi: పాక్‌లో భూకంపం.. భారత్‌లోని ఆరు రాష్ట్రాల్లో ప్రకంపనలు
మహ్మద్ నదీం ఒక మెకానిక్. అతడు కలబురగిలో ఉన్న ఓలా ఎలక్ట్రిక్ షోరూం(Ola Showroom On Fire) నుంచి ఒక స్కూటర్ కొన్నాడు. దాని కోసం రూ.1.40 లక్షలు ఖర్చు చేశాడు. ఆ స్కూటరును కొన్న రెండు రోజుల తర్వాత.. అందులో సాంకేతిక సమస్యలు బయటపడ్డాయి. స్వతహాగా మెకానిక్ అయిన నదీం.. ఆ స్కూటరులోని బ్యాటరీ, సౌండ్ సిస్టమ్ సరిగ్గా పనిచేయడం లేదని గుర్తించాడు. దీనిపై అతడు చాలాసార్లు షోరూంకు వెళ్లి ఫిర్యాదు ఇచ్చాడు. తన స్కూటరుకు రిపేర్ చేసి ఇవ్వాలని అక్కడున్న వారిని కోరాడు. అయితే వాళ్లు స్పందించలేదు. ఈ కారణం వల్లే నదీం అంతగా కోపోద్రిక్తుడై షోరూంకు నిప్పు పెట్టినట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. అతడు నిప్పంటించడం వల్ల షోరూంలో దాదాపు రూ.8.50 లక్షల ఆస్తినష్టం వాటిల్లిందని అంచనా వేశారు. అతడిపై పోలీసులు కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. ఈ ఘటనపై ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ నుంచి వివరణను తీసుకునే ప్రయత్నంలో ప్రస్తుతం పోలీసు వర్గాలు ఉన్నాయి.