Tata Motors : ఒక్కరోజే 40 శాతం తగ్గిన టాటా మోటార్స్ షేర్ ధర!
- By Vamsi Chowdary Korata Published Date - 12:26 PM, Tue - 14 October 25

దేశీయ స్టాక్ మార్కెట్లలో మళ్లీ పతనం కొనసాగుతోంది. ఈ వారం మాత్రం మళ్లీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. కిందటి సెషన్లో ఇప్పటికే నష్టపోగా.. మంగళవారం కూడా అదే కంటిన్యూ చేస్తోంది. సెషన్ ఆరంభంలో బాగానే రాణించినప్పటికీ.. ఇప్పుడు మాత్రం వెనక్కి తగ్గాయి. ఈ వార్త రాసే సమయంలో ఉదయం 11.30 గంటలకు సెన్సెక్స్ ఏకంగా 300 పాయింట్లకుపైగా తగ్గి 82 వేల దిగువకు చేరింది. ఇదే సమయంలో నిఫ్టీ చూస్తే దాదాపు 100 పాయింట్ల పతనంతో 25,130 స్థాయిలో ట్రేడవుతోంది. మార్కెట్లు పడిపోయేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చైనాపై దిగుమతి సుంకాల్ని అదనంగా 100 శాతం పెంచడం కారణంగా తెలుస్తోంది. టాటా మోటార్స్ షేర్ ధర కిందటి సెషన్‌లో రూ. 660.75 వద్ద ముగియగా.. ఇవాళ నేరుగా దాదాపు 40 శాతం పతనంతో రూ. 400 వద్ద ఓపెన్ అయింది. దీంతో ఇన్వెస్టర్లు ఆందోళన చెందారు. ఇంకా తగ్గి ఇంట్రాడేలో రూ. 376.30 వద్ద ప్రారంభమైంది. మళ్లీ పుంజుకొని ఇంట్రాడేలో రూ. 421.55 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. ప్రస్తుతం కిందటి సెషన్‌తో పోలిస్తే 38 శాతానికిపైగా తగ్గి రూ. 407 స్థాయిలో ఉంది.
అయితే ఇక్కడ నిజంగా షేర్ ఇంత తగ్గినట్లు కాదని తెలుసుకోవాలి. టాటా మోటార్స్.. ఇటీవల ప్యాసింజర్ వెహికిల్స్, కమర్షియల్ వెహికిల్స్ అని రెండు వేర్వేరు కంపెనీలుగా విడిపోయిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 1 నుంచే ఇది అమల్లోకి వచ్చినప్పటికీ.. షేర్ల విభజన రికార్డు డేట్ అక్టోబర్ 14గా నిర్ణయించింది. దీంతో ఇవాళ షేర్ల విభజన జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే టాటా మోటార్స్ షేర్ ధర తగ్గింది. ఇక్కడ ఇన్వెస్టర్లు నష్టపోరని చెప్పొచ్చు. కారణం.. టాటా మోటార్స్ షేర్లు ఉన్న వారికి ఇప్పుడు టాటా మోటార్స్ కమర్షియల్ వెహికిల్స్ లిమిటెడ్ (TMLCV) షేర్లు అదనంగా లభిస్తాయని చెప్పొచ్చు. ఇవి స్టాక్ మార్కెట్లో వచ్చే నెల లిస్టయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక టాటా మోటార్స్ ప్రస్తుతం ఉన్నది టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ లిమిటెడ్‌గా మారుతుంది. ఇందులోనే ఈవీ, జాగ్వార్ ల్యాండ్ రోవర్ బిజినెస్‌లు కూడా ఉంటాయని చెప్పొచ్చు.