పీఎం కిసాన్ 22వ విడత అప్డేట్.. ఫిబ్రవరిలో విడుదల చేసే అవకాశం!
పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు ఏడాదికి 6,000 రూపాయలను మూడు విడతల్లో నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తుంది.
- Author : Gopichand
Date : 04-01-2026 - 3:15 IST
Published By : Hashtagu Telugu Desk
PM Kisan Yojana: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 22వ విడత కోసం రైతులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 22వ విడతకు సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ రాబోయే బడ్జెట్‌లో ఈ పథకం గురించి ప్రభుత్వం ఏదైనా పెద్ద ప్రకటన చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.
బడ్జెట్ 2026పై ఆశలు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026 ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి సంబంధించి పలు కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది. కొత్త పథకాలు ప్రకటించడంతో పాటు ప్రస్తుతం ఉన్న పథకాలకు బడ్జెట్ కేటాయింపులను పెంచవచ్చు. ఒకవేళ పీఎం కిసాన్ పథకం బడ్జెట్‌ను పెంచితే, అది నేరుగా రైతులకు లబ్ధి చేకూరుస్తుంది. 2025-2026 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ పథకం కోసం రూ. 63,500 కోట్లు కేటాయించారు. ఈ మొత్తాన్ని పెంచినట్లయితే రైతులకు అందే ఆర్థిక సాయం కూడా పెరిగే అవకాశం ఉంది.
Also Read: సభలో అబద్ధాలు చెప్పిన సీఎం రేవంత్ రాజీనామా చేయాల్సిందే – హరీష్ రావు డిమాండ్
22వ విడత ఎప్పుడు విడుదల కావచ్చు?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2025 నవంబర్ 19న తమిళనాడులోని కోయంబత్తూరు నుండి పీఎం కిసాన్ 21వ విడతను విడుదల చేశారు. అప్పటి నుండి రైతులు 22వ విడత కోసం వేచి చూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ప్రభుత్వం ఈ విడతను ఫిబ్రవరిలో విడుదల చేసే అవకాశం ఉంది. ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత నెలాఖరులో అంటే ఫిబ్రవరి 28 ప్రాంతంలో ఈ నిధులను విడుదల చేయవచ్చని అంచనా వేస్తున్నారు.
ఏటా రైతులకు రూ. 6,000 సాయం
పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు ఏడాదికి 6,000 రూపాయలను మూడు విడతల్లో నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తుంది. ఈ పథకం కోసం కేటాయించే మొత్తాన్ని ప్రతి సంవత్సరం బడ్జెట్‌లో నిర్ణయిస్తారు. ఆ ఆర్థిక సంవత్సరంలో రైతులకు ఎంత మేర ఆర్థిక సాయం అందుతుందనేది బడ్జెట్ కేటాయింపుల ద్వారా స్పష్టమవుతుంది.