2025లో అత్యధికంగా అమ్ముడైన కారు ఏదో తెలుసా?
మారుతీ సుజుకీ డిజైర్ ఈ ఏడాది (జనవరి–నవంబర్) దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచి, ఆటో రంగంలో కొత్త చరిత్రను సృష్టించింది. ఎస్‌యూవీలు ఆధిపత్యం చెలాయిస్తున్న కాలంలో సెడాన్ అగ్రస్థానానికి చేరుకోవడం నిజంగా విశేషంగా మారింది.
- Author : Latha Suma
Date : 26-12-2025 - 5:30 IST
Published By : Hashtagu Telugu Desk
. ఎస్‌యూవీల ఆధిపత్యానికి మధ్య డిజైర్ విజయం
. టాప్-10 బెస్ట్ సెల్లింగ్ కార్లలో మారుతీ ఆధిపత్యం
. అమ్మకాలు పెరగడానికి కారణమైన అంశాలు
Maruti Suzuki Dzire : భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ఎస్‌యూవీలకు డిమాండ్ నిరంతరం పెరుగుతున్న వేళ, 2025లో అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఒక సెడాన్ మోడల్ టాప్ స్థానాన్ని కైవసం చేసుకుంది. మారుతీ సుజుకీ డిజైర్ ఈ ఏడాది (జనవరి–నవంబర్) దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచి, ఆటో రంగంలో కొత్త చరిత్రను సృష్టించింది. ఎస్‌యూవీలు ఆధిపత్యం చెలాయిస్తున్న కాలంలో సెడాన్ అగ్రస్థానానికి చేరుకోవడం నిజంగా విశేషంగా మారింది. ఇటీవలి సంవత్సరాల్లో భారతీయ వినియోగదారుల అభిరుచులు స్పష్టంగా ఎస్‌యూవీల వైపే మొగ్గు చూపుతున్నాయి. ప్రస్తుతం దేశీయ ప్యాసింజర్ వాహనాల మార్కెట్‌లో ఎస్‌యూవీల వాటా సుమారు 55 శాతం వరకు ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మారుతీ డిజైర్ తన స్థిరమైన డిమాండ్‌తో ఎస్‌యూవీ మోడళ్లైన హ్యుందాయ్ క్రెటా, టాటా నెక్సాన్‌లను వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని దక్కించుకోవడం విశ్లేషకులను కూడా ఆశ్చర్యపరిచింది.
2025లో ఇప్పటివరకు మారుతీ డిజైర్ మొత్తం 1,95,416 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత 41 ఏళ్లలో ఒక సెడాన్ మోడల్ అమ్మకాల పట్టికలో అగ్రస్థానంలో నిలవడం ఇది రెండోసారి మాత్రమే కావడం గమనార్హం. ఇది భారత మార్కెట్‌లో సెడాన్ కార్లకు ఇంకా అవకాశాలు ఉన్నాయని స్పష్టంగా సూచిస్తోంది. ఈ ఏడాది టాప్-10 బెస్ట్ సెల్లింగ్ కార్ల జాబితాలో మారుతీ సుజుకీకి చెందిన ఆరు మోడళ్లు చోటు దక్కించుకున్నాయి. డిజైర్‌తో పాటు వ్యాగన్ ఆర్ (1,79,663 యూనిట్లు), ఎర్టిగా (1,75,404), స్విఫ్ట్ (1,70,494), ఫ్రాంక్స్ (1,59,188), బ్రెజ్జా (1,57,606) వంటి మోడళ్లు ఈ జాబితాలో ఉన్నాయి. హ్యుందాయ్ క్రెటా 1,87,968 యూనిట్ల అమ్మకాలతో రెండో స్థానంలో, టాటా నెక్సాన్ 1,81,186 యూనిట్లతో మూడో స్థానంలో నిలిచాయి. టాటా మోటార్స్ నుంచి పంచ్ (1,57,522) కూడా టాప్-10లో చోటు దక్కించుకోగా, మహీంద్రా స్కార్పియో (1,61,103) ఈ జాబితాలో ఒకే ఒక్క మోడల్‌గా ఉంది.
మొత్తంగా చూస్తే టాప్-10లో 6 ఎస్‌యూవీలు, 2 హ్యాచ్‌బ్యాక్‌లు, ఒక ఎంపీవీ, ఒకే ఒక సెడాన్ మాత్రమే ఉండటం మార్కెట్ ట్రెండ్‌ను ప్రతిబింబిస్తోంది. 2025లో కార్ల అమ్మకాలు పెరగడానికి పలు అనుకూల అంశాలు కలిసి వచ్చాయి. ఇటీవల జీఎస్టీ తగ్గింపు, పండుగ సీజన్ ఆఫర్లు, ఇయర్ ఎండ్ డిస్కౌంట్లు వాహనాల ధరలను కొంత మేర తగ్గించాయి. దీంతో వినియోగదారులు కొత్త కార్ల కొనుగోలుపై ఆసక్తి చూపారు. అదనంగా, మారుతీ డిజైర్ తక్కువ నిర్వహణ ఖర్చులు, మంచి మైలేజ్, విశ్వసనీయత వంటి అంశాలు మధ్యతరగతి వినియోగదారులను ఆకట్టుకున్నాయి. ఎస్‌యూవీల క్రేజ్ కొనసాగుతున్నప్పటికీ, డిజైర్ సాధించిన విజయం భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో సెడాన్‌లకు ఇంకా బలమైన స్థానం ఉందని నిరూపిస్తోంది.