Diwali Break: దీపావళికి ఉద్యోగులకు 9 రోజుల సెలవు.. ఎక్కడంటే?
ఈ సెలవు ప్రకటన గురించి ఎలైట్ మార్క్ హ్యూమన్ రిసోర్స్ (HR) విభాగం కూడా ముందస్తు సమాచారం లేకుండానే తెలుసుకుంది. ఆ తర్వాత కంపెనీకి చెందిన ఒక హెచ్ఆర్ ఉద్యోగి ఈ శుభవార్తను లింక్డ్‌ఇన్‌లో పంచుకున్నారు.
- By Gopichand Published Date - 02:58 PM, Mon - 13 October 25

Diwali Break: పండుగ సందర్భంగా ఉద్యోగుల పట్ల ఆయా కంపెనీలు తమ ఉదారతను చాటుకుంటున్నాయి. ఈ కోవలోనే ఢిల్లీకి చెందిన ప్రముఖ పబ్లిక్ రిలేషన్స్ (PR) సంస్థ ఎలైట్ మార్క్ (Elite Mark) తన ఉద్యోగులకు ఊహించని శుభవార్త అందించింది. ఈ దీపావళి (Diwali Break) సందర్భంగా ఏకంగా తొమ్మిది రోజుల సుదీర్ఘ సెలవును ప్రకటిస్తూ తమ సిబ్బందిని ఆనందంలో ముంచెత్తింది.
కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ అయిన రజత్ గ్రోవర్ వ్యక్తిగతంగా ఈ సెలవును ప్రకటించారు. ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులతో పండుగను ఆనందంగా జరుపుకోవడానికి, పని ఒత్తిడి నుంచి పూర్తిగా విముక్తి పొంది, విశ్రాంతి తీసుకుని, నూతన ఉత్సాహంతో తిరిగి విధుల్లో చేరేందుకు ఈ సెలవులు ఎంతగానో దోహదపడతాయని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఉద్యోగుల మానసిక ఆరోగ్యం, శ్రేయస్సుకు తాము అత్యంత ప్రాధాన్యత ఇస్తామని యాజమాన్యం స్పష్టం చేసింది.
Also Read: Amaravati : CRDA ఆఫీస్ ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు..ఈ బిల్డింగ్ ప్రత్యేకతలు మాములుగా లేవు !!
హెచ్ఆర్ టీమ్ సంతోషం, లింక్డ్‌ఇన్‌లో పోస్ట్
ఈ సెలవు ప్రకటన గురించి ఎలైట్ మార్క్ హ్యూమన్ రిసోర్స్ (HR) విభాగం కూడా ముందస్తు సమాచారం లేకుండానే తెలుసుకుంది. ఆ తర్వాత కంపెనీకి చెందిన ఒక హెచ్ఆర్ ఉద్యోగి ఈ శుభవార్తను లింక్డ్‌ఇన్‌లో పంచుకున్నారు. “ఉద్యోగుల శ్రేయస్సు, అవసరాలకు యజమాని ఎప్పుడూ ప్రాధాన్యత ఇవ్వడమే నిజమైన పని సంస్కృతి. సంతోషంగా, సంతృప్తిగా ఉండే టీమే కంపెనీ విజయానికి పునాది” అని పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ ఉదార నిర్ణయం పట్ల ఉద్యోగులందరూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
సీఈఓ సరదా ఈ-మెయిల్ సందేశం
సీఈఓ రజత్ గ్రోవర్ ఈ సెలవుల ప్రకటనను ఉద్యోగులకు ఈ-మెయిల్ ద్వారా తెలియజేస్తూ దాన్ని చాలా సరదాగా, వ్యక్తిగత స్పర్శతో కూడిన సందేశంగా మార్చారు. సెలవుల్లో ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులతో పూర్తిగా గడపాలని, ఇంట్లో శుభ్రం చేయడంలో సహాయం చేయడం, నోరూరించే స్వీట్లు తినడం వంటి పండుగ కార్యకలాపాలను ఆస్వాదించాలని ఆయన ప్రోత్సహించారు. అంతేకాకుండా బంధువుల నుంచి తరచుగా ఎదురయ్యే “ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు?” వంటి సాంప్రదాయ ప్రశ్నలను ధైర్యంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సరదాగా పేర్కొన్నారు.
సీఈఓ తన ఈ-మెయిల్‌ను ముగిస్తూ ఈ దీపావళి సెలవుల తర్వాత ఉద్యోగులు “2 కిలోల ఎక్కువ బరువుతో, 10 రెట్లు ఎక్కువ సంతోషంగా, కొత్త సవాళ్లకు ఉత్సాహంగా, ఉల్లాసంగా” తిరిగి రావాలని ఆకాంక్షించారు. ఉద్యోగుల సంక్షేమం పట్ల కంపెనీకి ఉన్న నిబద్ధతను ఈ నిర్ణయం మరోసారి చాటింది.