Amaravati : CRDA ఆఫీస్ ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు..ఈ బిల్డింగ్ ప్రత్యేకతలు మాములుగా లేవు !!
Amaravati : రాజధాని అమరావతిలో పరిపాలనా కార్యకలాపాలు మళ్లీ చైతన్యం సంతరించుకున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం ఉదయం CRDA (Capital Region Development Authority) కార్యాలయాన్ని అధికారికంగా ప్రారంభించారు
- By Sudheer Published Date - 01:00 PM, Mon - 13 October 25

రాజధాని అమరావతిలో పరిపాలనా కార్యకలాపాలు మళ్లీ చైతన్యం సంతరించుకున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం ఉదయం CRDA (Capital Region Development Authority) కార్యాలయాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఇది అమరావతి నుంచే జరిగే తొలి పాలనా చర్య కావడం విశేషం. ఢిల్లీ పర్యటన కారణంగా సీఎం బహిరంగ సభలు నిర్వహించకపోయినా, ఈ ప్రారంభోత్సవం రాజధాని పునర్నిర్మాణ దిశలో కీలక అడుగుగా భావిస్తున్నారు. గ్రాఫిక్స్ రూపంలో ఉన్న డిజైన్లు ఇప్పుడు సాక్షాత్కారమవుతున్నాయి. భవనం వెలుపల ఉన్న “A” అక్షర రూప ఎలివేషన్ — అమరావతిని ప్రతిబింబించే ప్రతీకగా మారింది.
Silver Rate Today: రూ.2లక్షలకు చేరువలో కిలో వెండి
ఈ ఆధునిక భవనం 4.32 ఎకరాల్లో, G+7 (జీ ప్లస్ 7) అంతస్తులుగా నిర్మించబడింది. మొత్తం 3 లక్షల 7 వేల 326 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భవనంలో ప్రతీ అంతస్తు ప్రత్యేక ఉద్దేశ్యానికి అనుగుణంగా రూపొందించబడింది. గ్రౌండ్ ఫ్లోర్‌లో రిసెప్షన్, పబ్లిక్ ఎక్స్‌పీరియెన్స్ సెంటర్, బ్యాంక్, AI కమాండ్ సెంటర్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. పై అంతస్తుల్లో CRDA, ADCL, మున్సిపల్ శాఖ డైరెక్టర్ ఆఫీస్, పురపాలక శాఖ మంత్రివర్యుల ఛాంబర్ లాంటి విభాగాలు ఏర్పాటు చేశారు. టెర్రస్‌లో PEB డైనింగ్ ఏరియా ఉండగా, లిఫ్ట్‌లు, విస్తృత పార్కింగ్ సౌకర్యం (170 ఫోర్ వీలర్లు, 170 టూ వీలర్లు) వంటి ఆధునిక సదుపాయాలు కలవు. అంతర్గత మరియు బాహ్య బ్లాకులు కలిపి మొత్తం నిర్మాణం 3 లక్షల చదరపు అడుగులకుపైగా ఉండటం, నిర్మాణ శైలిలోని ఆధునికతకు నిదర్శనం.
ఇదే ప్రాంగణంలో మరో 8 ఎకరాల విస్తీర్ణంలో నాలుగు అనుబంధ భవనాలు కూడా నిర్మించారు. వీటిలో టిడ్కో, APUFIDC, స్వచ్చాంధ్ర కార్పొరేషన్, రెరా, టౌన్ ప్లానింగ్ (DTCP), గ్రీనింగ్ కార్పొరేషన్, మెప్మా కార్యాలయాలు ఉన్నాయి. ఒక్కొక్క భవనం సుమారు 41,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబడింది. మొత్తం మీద ఈ నిర్మాణ సముదాయం అమరావతి రాజధానిగా తీసుకున్న రూపకల్పనకు సాక్ష్యం. దీని ద్వారా అమరావతి అభివృద్ధి పునఃప్రారంభానికి స్పష్టమైన సంకేతం అందింది. చంద్రబాబు పాలనలో ఒకప్పుడు ఊహగా ఉన్న రాజధాని నగరం, ఇప్పుడు వాస్తవ రూపం దాల్చే దిశగా అడుగులు వేస్తోంది.