China VS Gold : భారీగా గోల్డ్ కొనేస్తున్న చైనా.. గోల్డ్ రేట్లు అందుకే పెరుగుతున్నాయా ?
చైనా ఇప్పుడు గోల్డ్ మంత్రాన్ని జపిస్తోంది. భారీగా గోల్డ్‌ను కొనేస్తోంది.
- By Pasha Published Date - 09:14 AM, Wed - 15 May 24

China VS Gold : చైనా ఇప్పుడు గోల్డ్ మంత్రాన్ని జపిస్తోంది. భారీగా గోల్డ్‌ను కొనేస్తోంది. ఈ ఏడాది మొదటి 3 నెలల్లోనే 27 టన్నుల బంగారాన్ని చైనా కొనేసింది. ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో చైనా బంగారం దిగుమతులు 6 శాతం పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా గోల్డ్ రేట్లు పెరగడానికి ఈ పరిణామం కూడా ఓ కారణమని పరిశీలకులు అంటున్నారు. ప్రస్తుతం చైనా దగ్గర 2,262 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. గోల్డ్ నిల్వలను సాధ్యమైనంత మేర పెంచుకొని తన కరెన్సీ యువాన్‌ను అమెరికా డాలర్‌కు పోటీ ఇచ్చేలా తయారు చేయాలని చైనా స్కెచ్ గీస్తోంది. ప్రస్తుతం అగ్రరాజ్యం అమెరికా వద్ద 8133 టన్నుల (81 లక్షల కిలోల) బంగారం ఉంది. గోల్డ్ నిల్వల విషయంలో మన దేశం ర్యాంకు 9. భారత్ వద్ద ఇప్పుడు 822 టన్నుల బంగారం ఉంది. దీన్ని కిలోల్లోకి మారిస్తే 8 లక్షల కిలోలు అవుతుంది.
We’re now on WhatsApp. Click to Join
ఇక బంగారం నిల్వల విషయంలో ప్రపంచంలో నంబర్ 2 ప్లేసులో జర్మనీ ఉంది. దాని దగ్గర 3,366 టన్నుల గోల్డ్, ఇటలీ దగ్గర 2,451 టన్నుల గోల్డ్, రష్యా దగ్గర 2,227 టన్నుల గోల్డ్ నిల్వలు ఉన్నాయి. ప్రపంచంలో గోల్డ్ నిల్వలు ఎక్కువగా ఉన్న దేశాల కరెన్సీదే ఆధిపత్యం సాగుతోంది. దీనికి సాక్ష్యం అమెరికా. అందుకే తాను కూడా బంగారం నిల్వలను పెంచుకొని యువాన్‌ను బలోపేతం చేయాలని డ్రాగన్ భావిస్తోంది. ప్రస్తుతం ఇండియా కరెన్సీలో ఒక చైనీస్ యువాన్ రేటు రూ.12. ఒక అమెరికా డాలర్ రేటు మన కరెన్సీలో రూ.84. అంటే చైనా కరెన్సీ కంటే అమెరికా డాలర్ విలువ 7 రెట్లు ఎక్కువ. ఈ లోటును పూడ్చాలనే ప్లాన్‌తో చైనా అడుగులు వేస్తోంది. అందుకే గోల్డ్ నిల్వలను పెంచే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే చాలా పేద దేశాలకు చైనా భారీగా అప్పులు ఇచ్చి, వాటిని తన కబంధ హస్తాల్లోకి తీసుకుంది. పలు ప్రముఖ అంతర్జాతీయ బ్యాంకుల్లోనూ చైనాకు పెద్దమొత్తంలో వాటాలు ఉన్నాయి. అమెరికాను సైనికంగా మాత్రమే కాకుండా.. కరెన్సీపరంగా కూడా బలంగా ఎదుర్కొనేందుకు చైనా సన్నద్దమవుతోంది.
Also Read :PM Modi : ప్రధాని మోడీకి ఎన్ని ఆస్తులు ఉన్నాయో తెలుసా ?
ప్రస్తుతం కీలకమైన పశ్చిమాసియా దేశాలను యుద్ద మేఘాలు ఆవరించాయి. ఈ అనిశ్చిత పరిస్థితుల్లో బంగారం ధర ఔన్సుకు 2,400 డాలర్ల కంటే ఎక్కువ రికార్డు స్థాయికి చేరుకుంది. స్థిరమైన పెట్టుబడి మార్గంగా బంగారానికి పేరు ఉండటంతో చైనా సహా చాలా దేశాల్లోని ప్రజలు దాని కొనుగోలుకు మొగ్గుచూపుతున్నారు. ప్రపంచ దేశాల ప్రభుత్వాల పోకడ కూడా ఇలాగే ఉంది. భారత రిజర్వ్ బ్యాంకు కూడా ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో దాదాపు 19 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసిందని సమాచారం. చైనాలో రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్లపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లడంతో బంగారంలో పెట్టుబడుల వైపు జనం మొగ్గు చూపుతున్నారు. భారీ జనాభా ఉండటంతో అక్కడ గోల్డ్ డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. దీంతో చైనా దేశం బంగారాన్ని పెద్ద మొత్తంలో ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది.