Amazon Tez : వస్తోంది అమెజాన్ ‘తేజ్’.. క్విక్ కామర్స్‌లో జెప్టో, బ్లింకిట్‌లతో ఢీ
ప్రస్తుతం అమెజాన్ కంపెనీ తన ‘తేజ్’(Amazon Tez) క్విక్ కామర్స్ సర్వీసుకు అవసరమైన డార్క్ స్టోర్ల ఏర్పాటు పనుల్లో నిమగ్నమై ఉన్నట్లు తెలుస్తోంది.
- By Pasha Published Date - 05:17 PM, Mon - 25 November 24

Amazon Tez : ఈ-కామర్స్ దిగ్గజం ‘అమెజాన్’ వస్తోంది. త్వరలోనే క్విక్ కామర్స్ సేవలను ఆ కంపెనీ లాంచ్ చేయబోతోంది. జెప్టో, స్విగ్గీ ఇన్‌స్టా మార్ట్, జొమాటోకు చెందిన బ్లింకిట్‌లతో పోటీ పడేందుకు ‘తేజ్’ పేరుతో క్విక్ కామర్స్ సర్వీసును అమెజాన్ షురూ చేయబోతోంది. వచ్చే సంవత్సరం ఆరంభంలోనే ఈ సేవలను మొదలుపెట్టే ఛాన్స్ ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అదే జరిగితే.. క్విక్ కామర్స్ కంపెనీల మధ్య పోటీ మరింత పెరగనుంది.
Also Read :CM Revanth: ‘అదానీ రూ.100 కోట్లు అక్కర్లేదు.. మాకు వద్దని లేఖ రాశాం’ : సీఎం రేవంత్
ప్రస్తుతం అమెజాన్ కంపెనీ తన ‘తేజ్’(Amazon Tez) క్విక్ కామర్స్ సర్వీసుకు అవసరమైన డార్క్ స్టోర్ల ఏర్పాటు పనుల్లో నిమగ్నమై ఉన్నట్లు తెలుస్తోంది. దానితో ముడిపడిన లాజిస్టిక్, స్టాక్ కీపింగ్ యూనిట్ల ఏర్పాటును వేగవంతంగా చేస్తోందని సమాచారం. వచ్చే (డిసెంబర్) 9, 10 తేదీల్లో ‘సంభవ్’ పేరుతో అమెజాన్ వార్షిక సమావేశాలు జరగనున్నాయి. ఆ కార్యక్రమాలు వేదికగా ‘తేజ్’ లాంచింగ్‌పై ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి. తేజ్ టీమ్ కోసం రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ఇప్పటికే షురూ అయింది.
త్వరలోనే రిలయన్స్ రిటైల్, టాటా గ్రూపు కూడా క్విక్ కామర్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టబోతున్నాయి. ఈ బడా కంపెనీల జోరు నడుమ దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న కిరాణా దుకాణాలు మూతపడుతున్నాయి. తక్కువ పెట్టుబడితో నడుస్తూ వచ్చిన కిరాణా స్టోర్లు.. ఇప్పుడు బంద్ అవుతున్నాయి. గిరాకీ తగ్గిపోవడంతో వాటిని నిర్వాహకులు బంద్ చేసి.. ఏవైనా ఇతర ఉద్యోగాలను వెతుక్కుంటున్నారు. కొందరు వేరే వ్యాపారాల వైపు మళ్లుతున్నారు. మొత్తం మీద క్విక్ కామర్స్ అనేది మన దేశంలో బలంగా వేళ్లూనుకొని పోయిన కిరణా దుకాణాల వ్యవస్థను దెబ్బతీసింది. క్విక్ కామర్స్ వల్ల ఇప్పుడు కస్టమర్లకు బాగానే ప్రయోజనం, సౌకర్యం ఉంటాయి. అయితే రానున్న రోజుల్లో ఈ కంపెనీలు తమ సర్వీసు ఛార్జీలను పెంచే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. అదే జరిగితే వినియోగదారులు మళ్లీ కిరాణా దుకాణాలకు నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తుంది.