జనవరి నుండి జీతాలు భారీగా పెరగనున్నాయా?!
కొత్త సంవత్సరం (జనవరి 2026) నుండి నెలవారీ జీతంలో వెంటనే ఎలాంటి పెరుగుదల ఉండదు. ఎందుకంటే 8వ వేతన సంఘం తన సిఫార్సులను ఇంకా ప్రకటించలేదు.
- Author : Gopichand
Date : 31-12-2025 - 7:28 IST
Published By : Hashtagu Telugu Desk
8th Pay Commission: కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘానికి ఇప్పటికే ఆమోదం తెలిపింది. సెంట్రల్ పే కమిషన్ సభ్యుల పేర్లను కూడా అధికారికంగా ప్రకటించింది. జస్టిస్ (రిటైర్డ్) రంజన ప్రకాష్ దేశాయ్‌తో పాటు, ఐఏఎస్ అధికారి పంకజ్ జైన్‌ను సభ్య-కార్యదర్శిగా నియమించింది. ఐఐఎం బెంగళూరు ప్రొఫెసర్ పులక్ ఘోష్ పార్ట్ టైమ్ సభ్యుడిగా చేరారు. 7వ వేతన సంఘం కాలపరిమితి డిసెంబర్ 31తో ముగియడంతో, లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు 2026 జనవరి 1 నుండి తమ జీతాలు పెరుగుతాయని ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కీలక సమాచారం ఇక్కడ ఉంది.
Also Read: ఈరోజు మద్యం సేవించి వాహనం నడిపితే జరిగితే ఈ శిక్షలు తప్పవు!
జీతం ఎప్పటి నుండి పెరుగుతుంది?
వెంటనే పెరుగుదల ఉండదు: కొత్త సంవత్సరం (జనవరి 2026) నుండి నెలవారీ జీతంలో వెంటనే ఎలాంటి పెరుగుదల ఉండదు. ఎందుకంటే 8వ వేతన సంఘం తన సిఫార్సులను ఇంకా ప్రకటించలేదు.
అమలు తేదీ: సాధారణంగా వేతన సంఘం సిఫార్సులు ప్రతి పదేళ్లకు ఒకసారి అమలులోకి వస్తాయి. ఆ ప్రకారం చూస్తే 8వ వేతన సంఘం ప్రభావం 01.01.2026 నుండి ఉండాలి.
బకాయిలు: 1 జనవరి 2026 నుండి జీతం పెరగకపోయినా నిబంధనల ప్రకారం పెరగాల్సిన మొత్తం బకాయిల రూపంలో జమ అవుతూనే ఉంటుంది. ప్రభుత్వం ఎప్పుడైతే కొత్త జీతాల పెంపును ప్రకటిస్తుందో అప్పటి నుండి జనవరి 1, 2026 నుండి లెక్కగట్టిన బకాయిలను ఉద్యోగులు, పెన్షనర్లు అందుకుంటారు.
అక్టోబర్‌లో వెలువడిన నోటిఫికేషన్ ప్రకారం.. ప్రభుత్వం టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్‌ను ఇప్పటికే ప్రకటించింది. కమిషన్ తన నివేదికను సమర్పించడానికి, ప్రభుత్వం దానిని పరిశీలించి నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం పట్టవచ్చు. కానీ లబ్ధిదారులకు మాత్రం జనవరి 1, 2026 నుండే ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది.