టైర్లపై ఉన్న నంబర్ల అర్థం తెలుసా? ఇది మీ భద్రతకు చాలా ముఖ్యం!
టైర్‌లో ఎప్పుడూ సరైన గాలి ఉండాలి. సాధారణంగా బైక్ లేదా కార్లకు 28-36 PSI మధ్య ప్రెజర్ మెయింటైన్ చేయాలి. సరైన గాలి ఉంటే వర్షంలో లేదా జారుడు రోడ్లపై ప్రయాణం సురక్షితంగా ఉంటుంది.
- Author : Gopichand
Date : 18-02-2026 - 5:56 IST
Published By : Hashtagu Telugu Desk
Tyres: మీరు ఎప్పుడైనా మీ బైక్ లేదా కారు టైర్‌ను నిశితంగా గమనించారా? టైర్ పక్కభాగంలో రాసి ఉన్న నంబర్లు, ఇంగ్లీష్ అక్షరాలు కేవలం అలంకారం కోసం కాదు. వాటిలో టైర్ బలం, వేగం, భద్రతకు సంబంధించిన కీలక సమాచారం దాగి ఉంటుంది. వీటి అర్థం తెలుసుకుంటే సరైన టైర్‌ను ఎంచుకోవడం సులభం అవడమే కాకుండా హై-స్పీడ్ ప్రయాణాల్లో మీ భద్రత కూడా పెరుగుతుంది.
స్పీడ్ రేటింగ్ అంటే ఏమిటి? ఇది ఎందుకు ముఖ్యం?
టైర్‌పై P, J, V వంటి అక్షరాలు ఉంటాయి. వీటిని ‘స్పీడ్ రేటింగ్’ అంటారు. ఒక టైర్ గరిష్టంగా ఎంత వేగంతో ప్రయాణించగలదో ఇది తెలియజేస్తుంది.
ఉదాహరణకు: P రేటింగ్ ఉన్న టైర్ 150 కిమీ/గం వరకు, J రేటింగ్ ఉన్న టైర్ 100 కిమీ/గం వేగం వరకు సురక్షితం.
పరిమితికి మించిన వేగంతో నడిపితే టైర్ వేడెక్కి రబ్బరు మెత్తబడి, టైర్ పేలిపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా గుంతలు ఎక్కువగా ఉండే భారతీయ రోడ్లపై బైక్ నడిపేవారు దీనిపై జాగ్రత్తగా ఉండాలి.
Also Read: ఇజ్రాయెల్ ప్రధానికి క్యాన్సర్.. నిజమేనా?!
టైర్ సైజు నంబర్ల అర్థం
టైర్‌పై తరచుగా 205/55 R16 వంటి నంబర్లు కనిపిస్తాయి. దీని అర్థం ఏంటంటే
205: ఇది టైర్ వెడల్పు (మిల్లీమీటర్లలో). వెడల్పు ఎక్కువగా ఉంటే రోడ్డుపై పట్టు బాగుంటుంది. కానీ మైలేజ్ కొంచెం తగ్గుతుంది.
55: దీనిని ‘ఆస్పెక్ట్ రేషియో’ అంటారు. అంటే టైర్ ఎత్తు, దాని వెడల్పులో ఎంత శాతం ఉందో ఇది చెబుతుంది. తక్కువ రేషియో ఉంటే వాహనంపై నియంత్రణ బాగుంటుంది.
R- రిమ్ సైజు
R: అంటే ఇది ‘రేడియల్ టైర్’ అని అర్థం. ప్రస్తుతం దాదాపు అన్ని వాహనాల్లో వీటినే వాడుతున్నారు.
16: ఇది రిమ్ సైజును సూచిస్తుంది. అంటే ఈ టైర్ 16 ఇంచుల రిమ్‌కు సరిపోతుందని అర్థం. కంపెనీ సూచించిన సైజు రిమ్‌నే వాడటం శ్రేయస్కరం.
లోడ్ ఇండెక్స్- స్పీడ్ లెటర్
టైర్‌పై 91V అని ఉంటే
91: ఇది ‘లోడ్ ఇండెక్స్’. అంటే ఆ టైర్ గరిష్టంగా ఎంత బరువును మోయగలదో చెబుతుంది.
V: ఇది పైన చెప్పుకున్నట్లు స్పీడ్ రేటింగ్. తక్కువ లోడ్ సామర్థ్యం ఉన్న టైర్‌ను వాడటం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
DOT డేట్: టైర్ వయస్సును గమనించండి
టైర్ కొనేటప్పుడు దాని తయారీ తేదీని (DOT కోడ్) తప్పక చూడాలి. టైర్ గ్రిప్ బాగున్నట్లు కనిపించినా 5-6 ఏళ్లు దాటిన తర్వాత దానిని మార్చడం మంచిది. కాలక్రమేణా రబ్బరు గట్టిపడి, ప్రయాణంలో టైర్ విఫలమయ్యే ప్రమాదం ఉంటుంది.
సరైన గాలి ఒత్తిడి ప్రాముఖ్యత
టైర్‌లో ఎప్పుడూ సరైన గాలి ఉండాలి. సాధారణంగా బైక్ లేదా కార్లకు 28-36 PSI మధ్య ప్రెజర్ మెయింటైన్ చేయాలి. సరైన గాలి ఉంటే వర్షంలో లేదా జారుడు రోడ్లపై ప్రయాణం సురక్షితంగా ఉంటుంది.