Maruti: మారుతి సుజుకి 35 ఏళ్ల రికార్డు బ్రేక్.. భారీగా అమ్మకాలు!
అదే రోజు హ్యుందాయ్ మోటార్స్ కూడా 11,000 డీలర్ బిల్లింగ్‌లను నమోదు చేసింది. ఇది గత ఐదేళ్లలో వారి అతిపెద్ద ఒక్కరోజు రికార్డు.
- By Gopichand Published Date - 06:57 PM, Tue - 23 September 25

Maruti: నవరాత్రి మొదటి రోజున GST 2.0 అమల్లోకి రావడంతో కారు కొనుగోలుదారులు షోరూమ్‌లకు పోటెత్తారు. మారుతి సుజుకి గత 35 ఏళ్లలో అతిపెద్ద అమ్మకాల రికార్డును నెలకొల్పింది. సోమవారం ఒక్క రోజే కంపెనీకి 80,000 కస్టమర్ ఎంక్వైరీస్, 30,000 డెలివరీలు లభించాయి. కొత్త కారు ధరల ప్రకటన తర్వాత మారుతి (Maruti) సుజుకి రోజువారీగా దాదాపు 15,000 బుకింగ్‌లను నమోదు చేస్తోంది. ఇది సాధారణ బుకింగ్‌ల కంటే 50% ఎక్కువ.
మారుతి సుజుకి సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) పార్థో బెనర్జీ మాట్లాడుతూ.. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది స్పందన చాలా బలంగా ఉందని అన్నారు. ముఖ్యంగా చిన్న కార్ల డిమాండ్‌లో దాదాపు 50% పెరుగుదల కనిపించిందని, కొన్ని మోడళ్లు త్వరలోనే స్టాక్ అయిపోవచ్చని ఆయన తెలిపారు.
హ్యుందాయ్ కూడా అమ్మకాలలో అదరగొట్టింది
అదే రోజు హ్యుందాయ్ మోటార్స్ కూడా 11,000 డీలర్ బిల్లింగ్‌లను నమోదు చేసింది. ఇది గత ఐదేళ్లలో వారి అతిపెద్ద ఒక్కరోజు రికార్డు. హ్యుందాయ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ తరుణ్ గార్గ్ మాట్లాడుతూ.. “ఇది బలమైన పండుగ వాతావరణానికి, కస్టమర్ల విశ్వాసానికి స్పష్టమైన నిదర్శనం. రాబోయే రోజుల్లో కూడా డిమాండ్ నిరంతరంగా ఉంటుందని మేము ఆశిస్తున్నాము” అని అన్నారు.
Also Read: Paracetamol: గర్భిణీలు పారాసెటమాల్ వాడకూడదా? డబ్ల్యూహెచ్‌వో ఏం చెప్పిందంటే?
GST తగ్గింపుతో కార్ల లభ్యత పెరిగింది
సెప్టెంబర్ 4, 2025న ప్రభుత్వం అనేక వస్తువులపై GST రేట్లను తగ్గించింది. ఈ కొత్త GST 2.0 కింద పన్ను శ్లాబ్‌లు రెండు స్థాయిలకు (5%, 18%) తగ్గాయి.
- అవసరమైన వస్తువులు (సబ్బులు వంటివి) ఇప్పుడు 5% GSTలో ఉన్నాయి.
- డిస్క్రిషనరీ వస్తువులు (చిన్న కార్లు వంటివి) ఇప్పుడు 18% GSTలో ఉన్నాయి.
- సిన్ గూడ్స్ కోసం కొత్తగా 40% పన్ను శ్లాబ్ అమలులోకి వచ్చింది.
- ఈ మార్పుల వల్ల చిన్న కార్ల మోడళ్లు (4 మీటర్ల కంటే తక్కువ పొడవు, 1,200 సీసీ పెట్రోల్ లేదా 1,500 సీసీ డీజిల్ ఇంజిన్ కలిగినవి) ఇప్పుడు 28% కాకుండా కేవలం 18% GSTతో లభిస్తున్నాయి. పెద్ద మోడళ్లపై 40% GST ఉంది. ఇది పాత 28% + కాంపెన్సేషన్ సెస్ కంటే ఇప్పటికీ తక్కువే.
పండుగ, అమ్మకాల ప్రభావం
నవరాత్రి వంటి పండుగలు, GST తగ్గింపుల కలయిక కార్ల కొనుగోలుదారులను ఉత్సాహపరిచినట్లు స్పష్టమైంది. మారుతి, హ్యుందాయ్ వంటి పాత, నమ్మకమైన బ్రాండ్లు కస్టమర్లు చిన్న, విశ్వసనీయ కార్ల వైపు వేగంగా మొగ్గు చూపుతున్నట్లు గమనించాయి. చిన్న కార్లపై తక్కువ పన్నులు, మెరుగైన ధరల వల్ల కస్టమర్లకు వాటిని కొనుగోలు చేయడం సులభమైంది. ఈ సీజన్‌లో కారు కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయం అని చెప్పవచ్చు.