Luxury Cars: సెప్టెంబర్ 22 తర్వాత ఎలాంటి కార్లు కొనాలి?
ఈ నిర్ణయంపై మర్సిడెస్-బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో సంతోష్ అయ్యర్ స్పందిస్తూ ఇది ఒక పురోగమన నిర్ణయం అని అభివర్ణించారు. దీనివల్ల వినియోగం పెరిగి, పరిశ్రమకు ప్రోత్సాహం లభిస్తుందని ఆయన అన్నారు.
- By Gopichand Published Date - 09:58 PM, Fri - 5 September 25

Luxury Cars: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ఆటోమొబైల్ పరిశ్రమ కోసం కొత్త పన్ను విధానాన్ని ప్రకటించారు. ఈ మార్పులు లగ్జరీ కార్ల (Luxury Cars) ధరలను గణనీయంగా తగ్గించనున్నాయి. కొత్త పన్ను విధానం ప్రకారం.. పెద్ద, లగ్జరీ కార్లపై జీఎస్టీ (GST) 28% నుంచి 40%కి పెరిగినప్పటికీ వాటిపై అదనంగా విధించే సెస్ (Cess) పూర్తిగా తొలగించారు. ఈ నిర్ణయం వల్ల మర్సిడెస్-బెంజ్, ఫార్చ్యూనర్, బీఎమ్‌డబ్ల్యూ వంటి లగ్జరీ కార్ల ధరలు కొంత మేర తగ్గుతాయని అంచనా.
లగ్జరీ కార్లు ఎందుకు చౌకగా మారతాయి?
గతంలో ఉన్న పన్ను విధానం ప్రకారం.. ఐసీఈ (ICE) కార్లపై 28% జీఎస్టీతో పాటు అదనంగా 17% నుండి 22% వరకు సెస్ విధించేవారు. దీనితో వాహనంపై మొత్తం పన్ను భారం 45% నుంచి 50% వరకు ఉండేది. కానీ కొత్త విధానంలో 40% జీఎస్టీ మాత్రమే ఉంటుంది. సెస్ ఉండదు. దీనివల్ల మొత్తం పన్ను భారం తగ్గి, కార్ల ధరలు తగ్గుతాయి. ఈ కొత్త పన్ను విధానం సెప్టెంబర్ 22, 2025 నుంచి అమల్లోకి రానుంది. ఈ సమయం పండుగ సీజన్‌కు ముందు కావడం వల్ల అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది.
ఇతర వాహనాలపై కూడా ప్రభావం
కొత్త జీఎస్టీ విధానం లగ్జరీ కార్లకే పరిమితం కాదు. ఇతర వాహనాలపైనా సానుకూల ప్రభావం చూపనుంది. ఇకపై బస్సులు, ట్రక్కులు, అంబులెన్స్‌లపై జీఎస్టీ 28% నుంచి 18%కి తగ్గింది. ఆటో విడిభాగాలపై కూడా హెచ్‌ఎస్ కోడ్ (HS Code)తో సంబంధం లేకుండా 18% జీఎస్టీ వర్తిస్తుంది. మూడు చక్రాల వాహనాలు కూడా ఇదే పన్ను స్లాబ్‌లోకి వస్తాయి. ఈ నిర్ణయం ప్రైవేటు వాహనాలతో పాటు కమర్షియల్ వాహన రంగాలకు కూడా ఊరటనిస్తుంది.
Also Read: Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జరిగిందా?
ఆటోమొబైల్ కంపెనీల స్పందన
ఈ నిర్ణయంపై మర్సిడెస్-బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో సంతోష్ అయ్యర్ స్పందిస్తూ ఇది ఒక పురోగమన నిర్ణయం అని అభివర్ణించారు. దీనివల్ల వినియోగం పెరిగి, పరిశ్రమకు ప్రోత్సాహం లభిస్తుందని ఆయన అన్నారు. ఆడి ఇండియా అధిపతి బల్బీర్ సింగ్ ధిల్లాన్ కూడా దీనిని స్వాగతించారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలపై తక్కువ పన్ను రేటును కొనసాగించడం వల్ల ఈవీ పోర్ట్‌ఫోలియో మరింత మంది కస్టమర్లకు చేరువవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ మార్పుల వల్ల పర్యావరణ అనుకూల వాహనాలను ప్రోత్సహించినట్లవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.