BJP : వైసీపీ నుంచి బీజేపీలో చేరిన జకియా ఖానం
పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కండువా కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ.. "జకియా ఖానం లాంటి అనుభవజ్ఞురాలు, సేవాభావంతో ముందుకు సాగే నాయకురాలు మా పార్టీలో చేరడం హర్షకరం" అన్నారు.
- By Latha Suma Published Date - 11:57 AM, Wed - 14 May 25

BJP : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇస్తూ, ఆ పార్టీకి చెందిన శాసనమండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియా ఖానం బీజేపీలో చేరారు. ఈ ఉదయం ఆమె ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి, అనంతరం విజయవాడలోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ ఆమెకు పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కండువా కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ.. “జకియా ఖానం లాంటి అనుభవజ్ఞురాలు, సేవాభావంతో ముందుకు సాగే నాయకురాలు మా పార్టీలో చేరడం హర్షకరం” అన్నారు. బీజేపీ పాలనలో మహిళలకు, ముఖ్యంగా మైనారిటీ మహిళలకు న్యాయం జరుగుతోందని ఆమె వివరించారు.
Read Also: YCP : జగన్ బంపర్ ఆఫర్ ఇచ్చిన ఎవ్వరు ముందుకు రావడం లేదు !
జకియా ఖానం కూడా ఈ సందర్భంగా స్పందిస్తూ.. “భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అందరికీ సమానహక్కులు కల్పిస్తూ, మతపరంగా, లింగపరంగా ఎలాంటి వివక్ష లేకుండా పాలన నిర్వహిస్తున్నారు. ముస్లిం మహిళలకు రక్షణ కల్పించిన ఏకైక నాయకుడు మోడీగారే. ఆయన నాయకత్వంలో దేశం అభివృద్ధి దిశగా ముందుకెళ్తోంది. అలాంటి నేతకు సహకరించడం నా బాధ్యతగా భావిస్తున్నాను” అని తెలిపారు. ఈ ఉదయం జకియా ఖానం ఎమ్మెల్సీ పదవికి అధికారికంగా రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను వ్యక్తిగత సిబ్బందిమూలంగా మండలి చైర్మన్‌కు పంపించారు. ఆమె రాజీనామా వెనుక ఉన్న రాజకీయ పరిణామాలు వైసీపీలో చర్చనీయాంశంగా మారాయి. 2020 జూలైలో గవర్నర్ నామినేషన్ ద్వారా ఎమ్మెల్సీగా ఆమె నియమితులయ్యారు. అప్పటి నుంచి మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్‌గా సేవలందిస్తున్నారు.
జకియా ఖానం రాజకీయ జీవితం ఇప్పుడు కొత్త దిశలోకి మళ్లింది. బీజేపీ ఆమె చేరికతో మైనారిటీలలో తన పాదముద్రను బలంగా వేయాలని ప్రయత్నిస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఆమె రాజకీయ అనుభవం, ప్రజల్లో ఉన్న గుర్తింపు బీజేపీకి మద్దతు పెంచేలా పనిచేస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త మలుపుగా మారనున్నాయనే అంచనాలు వినిపిస్తున్నాయి.