Vijay Shah : కల్నల్ సోఫియా ఖురేషీపై మధ్యప్రదేశ్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
ఇందౌర్ సమీపంలోని ఒక గ్రామంలో మాట్లాడిన ఆయన, ‘‘ఉగ్రవాదులు మన సోదరీమణుల సిందూరాన్ని తుడిచేసి, వారిని వితంతువులను చేశారు. అలాంటి వారిని బుద్ధి చెప్పేందుకు మోడీజీ సైనిక విమానంలో ఉగ్రవాదుల మతానికి చెందిన మహిళను పాక్‌కు పంపారు’’ అంటూ వ్యాఖ్యానించారు.
- By Latha Suma Published Date - 11:23 AM, Wed - 14 May 25

Vijay Shah : పాకిస్థాన్‌తో జరిగిన కాల్పులపై వివరాలు వెల్లడించేందుకు వచ్చిన భారత సైనికాధికారిణి కర్నల్ సోఫియా ఖురేషీపై మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి విజయ్ షా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇందౌర్ సమీపంలోని ఒక గ్రామంలో మాట్లాడిన ఆయన, ‘‘ఉగ్రవాదులు మన సోదరీమణుల సిందూరాన్ని తుడిచేసి, వారిని వితంతువులను చేశారు. అలాంటి వారిని బుద్ధి చెప్పేందుకు మోడీజీ సైనిక విమానంలో ఉగ్రవాదుల మతానికి చెందిన మహిళను పాక్‌కు పంపారు’’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి. కాంగ్రెస్ నేతలు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కేంద్రమంత్రిగా వ్యవహరిస్తున్న వ్యక్తి నుంచి ఇలాంటి మతపరమైన విమర్శలు వెలువడటం శోచనీయమని పేర్కొన్నారు. ఆయనను వెంటనే మంత్రి పదవికి తొలగించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ వ్యాఖ్యలను ‘సిగ్గుచేటు, లజ్జాకరమైనవి’ అని అభివర్ణించారు.
Read Also: Jammu and Kashmir : సరిహద్దు వాసులను రక్షించేందుకు 9,500 బంకర్లు ఏర్పాటు..!
ఈ వ్యవహారంపై మధ్యప్రదేశ్ బీజేపీ అధిష్ఠానం స్పందించింది. మంత్రిని పిలిపించి తగినంగా మందలించిందని సమాచారం. స్పందించిన మంత్రి విజయ్ షా మీడియాతో మాట్లాడుతూ, ఉగ్రవాదుల దుశ్చర్యలతో తన మనసు కలచివేసిన నేపథ్యంలో అటువంటి వ్యాఖ్యలు వచ్చాయని చెప్పారు. ‘‘ఖురేషీ చేసిన సేవలు కులమతాలకు అతీతం. ఆమె సేవలకు నేను సెల్యూట్ చేస్తున్నాను. ఆమెను కించపరిచే ఉద్దేశ్యం నాకు లేదు. నా మాటల వల్ల ఎవరు బాధపడినా పదిసార్లు క్షమాపణలు చెబుతాను’’ అని స్పష్టం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలందుకున్న కర్నల్ సోఫియా ఖురేషీ మతపరమైన కోణంలో విమర్శలు ఎదుర్కొనడం తీవ్ర ఆవేదన కలిగిస్తోంది. మహిళా అధికారులను ప్రోత్సహించాల్సిన సమయంలో, ఈ తరహా వ్యాఖ్యలు భారత సైన్యంలో లింగ సమానత్వానికి మచ్చతెచ్చేలా ఉన్నాయి. ప్రజా ప్రతినిధుల నుంచి బాధ్యతాయుతమైన మాటలు రావాల్సిన అవసరం ఉన్నప్పటికీ, రాజకీయ ప్రేరణలతో చేసిన వ్యాఖ్యలు సమాజాన్ని ద్వేషం వైపు నడిపే ప్రమాదం ఉంది.
Read Also: BR Gavai : సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రమాణస్వీకారం