YCP 3rd List : వైసీపీ థర్డ్ లిస్ట్ లో ఉండేది ఎవరో..ఊడేది ఎవరో..?
వైసీపీ థర్డ్ లిస్ట్ (YCP 3rd List) లో ఉండేది ఎవరో..ఊడేది ఎవరు..సీటు ఎవరికీ...షాక్ ఎవరికీ...ఇప్పుడు వైసీపీ శ్రేణుల్లో ఇదే టెన్షన్.
- By Sudheer Published Date - 10:41 AM, Tue - 9 January 24

వైసీపీ థర్డ్ లిస్ట్ (YCP 3rd List) లో ఉండేది ఎవరో..ఊడేది ఎవరు..సీటు ఎవరికీ…షాక్ ఎవరికీ…ఇప్పుడు వైసీపీ (YCP) శ్రేణుల్లో ఇదే టెన్షన్. మొదటి రెండు లిస్ట్ లో దాదాపు 40 మందిని మార్చిన జగన్..మూడో లిస్ట్ లో ఎంతమందికి అవకాశం ఇచ్చారు..ఎంతమందికి షాక్ ఇచ్చారనేది ఆసక్తి గా మారింది. మరికాసేపట్లో వైసీపీ (YCP) అధిష్టానం మూడో లిస్ట్ ను విడుదల చేయబోతుంది.
ఇప్పటికే కొన్ని స్థానాలపై ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలను పిలిచి చర్చించారు. వారికి ఏ పరిస్థితుల్లో తాము టిక్కెట్ ఇవ్వలేకపోతుందీ తెలియజెప్పారు. మూడో జాబితాలోనూ మార్పులు, చేర్పులు భారీగానే ఉంటాయని తెలుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చి వారి స్థానంలో కొత్త వారిని ఇన్‌ఛార్జులుగా నియమించాలని జగన్ భావిస్తున్న నేపథ్యంలో మూడో జాబితాలో ఎవరి పేర్లు ఉంటాయన్నది టెన్షన్ గా మారింది.
We’re now on WhatsApp. Click to Join.
ఇటీవల తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న అభ్యర్ధుల్ని మార్చకుండా కేసీఆర్ దెబ్బతినడంతో వెంటనే అప్రమత్తమైన జగన్ ఇన్ ఛార్జ్ ల మార్పుకు తెరదీశారు. ఇప్పటికే తొలి జాబితాలో 11 మందినీ, రెండో జాబితాలో 27 మందినీ మార్చేశారు. ఇప్పుడు మూడో జాబితా విడుదలకు రంగం సిద్ధం చేశారు. మొదటి రెండు జాబితాల్లో కొందరు సిట్టింగ్‌ల సీట్లు గల్లంతు కాగా… మరికొందరికి స్థానచలనలం కలిగింది. ఈరోజు మరో 29 స్థానాలకు ఇన్‌ఛార్జ్‌లను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.
గత పది రోజులుగా మూడో లిస్ట్ ఫై విస్తృతంగా కసరత్తు చేసింది అధిష్టానం. సీఎంవో (CMO) నుంచి పిలుపు వచ్చిన నేతలంతా… మూడు, నాలుగు రోజులుగా తాడేపల్లి క్యాంప్ ఆఫీసుకు క్యూకట్టారు. సీఎం జగన్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో భేటీ అయ్యారు. నియోజకవర్గాల్లో పరిస్థితులను ఆరా తీస్తూ… మార్పులు-చేర్పుల గురించి వివరించారు. స్థానికంగా వ్యతిరేకత ఉన్న నాయకులను పక్కనపెడుతున్నారు. అసంతృప్తులను బుజ్జగిస్తున్నారు. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేకపోయినా… గెలిచిన తర్వాత తగిన ప్రాధాన్యత ఇస్తామంటూ వారిని బుజ్జగిస్తున్నారు.
Also Read: IndiGo: ప్రయాణికులకు షాక్ ఇచ్చిన ఇండిగో.. కొన్ని సీట్లపై ఛార్జీల పెంపు..!
నిన్న క్యాంపు ఆఫీస్ లో పార్థసారధిని బుజ్జగించి… పెనమలూరు పంచాయితీకి తెరదించారు. అలాగే నరసరావుపేట ఎమ్మెల్యే టికెట్‌ను గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికే ఫైనల్ చేస్తున్నట్లు ప్రకటించారు. గోపిరెడ్డి, ఆయన వ్యతిరేకవర్గం నేతలతో సమావేశమైన విజయసాయిరెడ్డి… నరసరావుపేట టికెట్‌ను గోపిరెడ్డికే కేటాయిస్తున్నట్టు స్పష్టం చేశారు. అధిష్టానం నిర్ణయం మేరకు అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. మరోవైపు… విజయనగరం జిల్లా ఎస్ కోట పంచాయితీపై ఫోకస్ పెట్టిన మంత్రి బొత్స సత్యనారాయణ. ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు మంత్రి బొత్సను కలిసి మాట్లాడారు. రెండు వర్గాలకు నచ్చచెప్పడం చేసారు. ఇక మూడో లిస్ట్ లో పెద్ద ఎత్తున ఎంపీ స్థానాలు మారబోతున్నట్లు తెలుస్తుంది. విశాఖ లోక్ సభకు బొత్స ఝాన్సీ వంటి వారిని రంగంలోకి దించబోతున్నారు. ఈమె పేరు మూడో జాబితాలో ఉండబోతున్నట్లు తెలుస్తుంది. నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తున్నట్టు వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. బాపట్ల నుండి నందిగం సురేష్, తిరుపతి నుండి గురుమూర్తి, కడప నుండి అవినాష్ రెడ్డి, రాజంపేట నుండి మిథున్‌రెడ్డి పేర్లు ఫైనల్ అయినట్టే. ఇక అనంతపురం ఎంపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా శంకర్‌నారాయణ, హిందూపురం ఇన్‌ఛార్జ్‌గా శాంత, అరకు ఇన్‌ఛార్జ్‌గా భాగ్యలక్ష్మిని ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది.
నరసరావుపేట నుంచి మోదుగుల వేణుగోపాలరెడ్డి, కర్నూల్ ఎంపీ బరిలో గుమ్మనూరి జయరాం, నరసాపురం నుంచి గోకరాజు రంగరాజు, రాజమండ్రి బరిలో అనుసూరి పద్మలత, ఒంగోలు నుంచి మడ్డిసెట్టి వేణుగోపాల్, విక్రాంత్‌రెడ్డి పేర్లను పరిశీలిస్తున్నారు. విజయనగరం నుండి చిన్న శీను, అనకాపల్లి నుండి కరణం ధర్మశ్రీ పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. విజయవాడ టికెట్‌ను బీసీకి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నా.. అభ్యర్థిని ఇంకా ఫైనల్ చేయాల్సి ఉంది. గుంటూరు నుంచి పోటీకి శ్రీకృష్ణ దేవరాయలు ఒప్పుకునే పరిస్థితి కనిపించడంలేదు. ఎంపీ స్థానాల్లో పోటీకి సినిమా రంగం నుంచి కూడా పలువురికి అవకాశం కల్పించే యోచనలో వైసీపీ అధిష్టానం ఉంది. మరి ఇన్ని మార్పులు వైసీపీ కి కలిసొస్తాయా..లేదా అనేది చూడాలి. మూడో లిస్ట్ తర్వాత ఎంత మంది పార్టీ లో ఉంటారో..ఎంతమంది గుడ్ బై చెపుతారో కూడా చూడాల్సి ఉంది.
Read Also : IT Raids : హైదరాబాద్‌లో ఐటీ రైడ్స్.. ఫార్మా, రియల్ ఎస్టేట్ కంపెనీల్లో సోదాలు