TDP vs YSRCP: అసెంబ్లీలో రగడ.. టీడీపీ తమ్ముళ్ళపై.. వైసీపీ నేతలు షాకింగ్ కామెంట్స్..!
- By HashtagU Desk Published Date - 02:20 PM, Wed - 23 March 22

అసెంబ్లీలో టీడీపీ నేతల తీరు ఏమాత్రం మారలేదు. ఈరోజు అసెంబ్లీ సెషన్ ప్రారంభమవగానే, టీడీపీ నేతలు సభలో ఈలలు వేస్తూ, చిడతలు వాయించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్ తమ్మినేని సీతారాం ఐదుగురు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్, ఆదిరెడ్డి భవానీ, నిమ్మకాయల చినరాజప్ప, జోగేశ్వరరావు, గణబాబును స్పీకర్ రెండు రోజుల పాటు సస్పెండ్ చేశారు.
సభా కార్యక్రమాలకు పదే పదే ఆటంకం కలిగిస్తున్నారని, సభలో ఈలలు వేయడం, చిడతలు వాయించడం వంటివి సభ గౌరవ మర్యాదలను కించపర్చే విధంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్ తమ్మినేని, టీడీపీ సభ్యులను పలుసార్లు హెచ్చరించినా వినకపోవడంతో, టీడీపీ సభ్యులను రెండు రోజుల పాటు సస్పెండ్ చేశారు. అంతే కాకుండా టీడీపీ సభ్యుల అనుచిత ప్రవర్తనపై ఎథిక్స్ కమిటీ విచారించాలని స్పీకర్ తమ్మినేని సీతారాం ఆదేశాలు జారీ చేశారు.
ఈ నేపధ్యంలో ఎథిక్స్ కమిటీ విచారించి తగిన చర్యలను సూచించాలని స్పీకర్ కోరారు. స్పీకర్ పైనే కాగితాలు చించి విసిరేయడం, ఈలలు వేయడం, చిడతలు వాయించడం వంటివి స్పీకర్ సీరియస్‌గా తీసుకున్నారు. దీంతో ఎథిక్స్ కమిటీ సూచనల మేరకు చర్యలు ఉంటాయని స్పీకర్ వెల్లడించారు. ఇక టీడీపీ నేతలు రోజుకో రీతిలో నిరసన తెలుపుతున్న సంగతి తెలిసిందే. మంగళవారం సభలో ఈలలు వేస్తూ నిరసన తెలిపిన టీడీపీ సభ్యులు, ఈరోజు సభలో స్పీకర్ పోడియం దగ్గరకు వెళ్ళిన కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు భజన చేయగా, ఇంకొందరు చిడతలు వాయించారు. దీంతో అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక సభలో టీడీపీ ఎమ్మెల్యేలు చిడతలు వాయించడంపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పందించారు. 2024 ఎన్నికల తర్వాత చంద్రబాబుతో సహా టీడీపీ తమ్ముళ్ళు అందరూ చిడతలు వాయించుకోవాల్సిందేని సెటైర్ వేశారు. సభలో నిన్న విజిల్స్ వేశారని, ఈరోజు చిడతలు వాయించారని, ఇక రేపు సభలో ఏం చేస్తారో అంటూ అంబటి రాంబాబు వ్యాఖ్యలు చేశారు. ఇక మరోవైపు ఈ వ్యవహారం పై స్పందించిన వెల్లంపల్లి శ్రీనివాస్ చంద్రబాబుకు చిడతలు కొట్టించుకోవడం బాగా అలవాటని ఎద్దేవా చేశారు. ఆ అలవాటే టీడీపీ ఎమ్మెల్యేలకు వచ్చిందని, చిడతలతో సభలో అమర్యాదగా వ్యవహరించారని, ఇలానే చేస్తే తండ్రి చంద్రబాబు కొడుకు లోకేష్‌లు 2024 తర్వాత చిడతలు కొట్టుకోవాల్సిందే అని వెల్లంపల్లి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు.
టీడీపీ సభ్యులు సభలో చిడతలు వాయించడంపై స్పందించిన ఫైర్ మినిస్టర్ కొడాలి నాని మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం బ్రాండ్స్‌కి పర్మిషన్ ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వమే అని మంత్రి కొడాలి నాని గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం చంద్రబాబు అల్జీమర్స్‌తో బాధపడుతున్నారని, రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు, మొత్తం 240 కొత్త మద్యం బ్రాండ్స్‌కు పర్మిషన్ ఇచ్చింది చంద్రబాబే అని కొడాలి నాని తెలిపారు. ఈ క్రమంలో కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ని చంద్రబాబు లాంటి వారు పరిపాలించడం, రాష్ట్ర ప్రజల దురదృష్టం అంటూ కొడాలి నాని మండిపడ్డారు. 2024 ఎన్నికల తర్వాత చంద్రబాబుతో పాటు పుత్రరత్నం లోకేష్ అండ్ టీడీపీ నేతలు, టీడీపీ కార్యాలయాల్లో భజనలు చేసుకుంటూ చిడతలు వాయించుకుంటూ ఉంటారని కొడాలి నాని జ్యోస్యం చెప్పారు. తెలంగాణలో టీడీపీకి ఏ గతి పట్టిందో అందరికీ తెలిసిందేగా, త్వరలో ఏపీలో కూడా టీడీపీకి అదే గతి పడుతుందని వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.