YS Sharmila: మరోసారి జగన్‌ను కెలికిన షర్మిల.. ఆసక్తికర ట్వీట్ వైరల్!
"పునర్‌నిర్మాణం పేరుతో సంవత్సరం కాలయాపన చేశారు. సూపర్ సిక్స్ హామీలను గాలికొదిలేశారు. అప్పుల సాకుతో అభివృద్ధిని అటకెక్కించారు. కరెంటు బిల్లులతో ప్రజల జేబులకు చిల్లులు పెట్టారు" అని షర్మిల ఆరోపించారు.
- By Gopichand Published Date - 07:03 PM, Wed - 4 June 25

YS Sharmila: ఏడాది క్రితం జూన్ 4న కూటమి పార్టీలకు ప్రజలు అధికారం అప్పగించిన రోజును “ఆంధ్రప్రదేశ్ ప్రజా వంచన దినం”గా అభివర్ణిస్తూ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి పాలనను “ఉన్మాదం, అవినీతి, అరాచకం”కు గురైన పాలనగా ఆమె విమర్శించారు.
జూన్ 4: ఉన్మాద,అవినీతి,అరాచక పాలనకు గుణపాఠం చెప్పి, ఏడాది క్రితం ఇదే రోజు కూటమి పార్టీలకు పట్టం కడితే, ప్రజా విప్లవానికి, ఇచ్చిన తీర్పునకు వక్రభాష్యం చెప్పేలా ఉంది చంద్రబాబు @ncbn గారి ఏడాది పాలన. పునర్ నిర్మాణం పేరుతో సంవత్సరం పాటు కాలయాపన చేశారు. గాడిన పెడుతున్నాం అని చెవుల్లో…
— YS Sharmila (@realyssharmila) June 4, 2025
“పునర్‌నిర్మాణం పేరుతో సంవత్సరం కాలయాపన చేశారు. సూపర్ సిక్స్ హామీలను గాలికొదిలేశారు. అప్పుల సాకుతో అభివృద్ధిని అటకెక్కించారు. కరెంటు బిల్లులతో ప్రజల జేబులకు చిల్లులు పెట్టారు” అని షర్మిల ఆరోపించారు. పోలవరం ఎత్తు తగ్గించడం, విశాఖ స్టీల్ ప్లాంట్‌లో 4,000 మంది కార్మికుల ఉద్యోగాలు తొలగించడం, వక్ఫ్ బిల్లుకు మద్దతు ఇవ్వడం వంటి చర్యలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా చంద్రబాబు నిశ్శబ్దంగా ఉండటాన్ని ఆమె తప్పుబట్టారు. “ప్రత్యేక హోదా కోసం నోరు విప్పలేదు. ఇది ప్రజలకు చేసిన వంచన కాదా?” అని ఆమె ప్రశ్నించారు.
అటు వైఎస్ఆర్‌సీపీ నిర్వహించే “వెన్నుపోటు దినం”పైనా షర్మిల విమర్శలు గుప్పించారు. “వెన్నుపోటు అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరో ప్రజలకు తెలుసు. అసెంబ్లీకి వెళ్లకుండా, కూటమి హామీలపై గళం విప్పకుండా, ఇంట్లో ప్రెస్ మీట్‌లు పెట్టి జగన్ ప్రజలను మోసం చేస్తున్నారు” అని ఆమె ఆరోపించారు. లిక్కర్ స్కాం ఆరోపణలపై అసెంబ్లీలో విచారణకు సిద్ధం కాకుండా నిరసనలు చేయడం “దొంగే దొంగ అని అరిచినట్లు ఉంది” అని షర్మిల వ్యాఖ్యానించారు. చంద్రబాబు, మోడీ, పవన్ కళ్యాణ్‌లు నమ్మకం పేరుతో ప్రజలను వంచించారు. ఇది ప్రజా తీర్పు దినం కాదు ప్రజా వంచన దినం అని షర్మిల తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.