YCP Leaders Comments: జనసేనానిపై విమర్శలు.. పవన్ ఓ రాజకీయ అజ్ఞాని..!
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీపై పవన్‌కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు విమర్శలు కురిపించారు.
- Author : Gopichand
Date : 27-11-2022 - 5:15 IST
Published By : Hashtagu Telugu Desk
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీపై పవన్‌కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు విమర్శలు కురిపించారు. జనసేనాని పవన్‌కల్యాణ్ ఒక రాజకీయ అజ్ఞాని అని మంత్రి జోగి రమేశ్ విమర్శించారు. వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు తాను రెఢీ అని.. పవన్ సిద్ధమా అని సవాల్ విసిరారు. రాష్ట్రంలోని అన్నిపార్టీలు కలిసి వచ్చినా వైసీపీని ఏం చేయలేరన్నారు. పవన్‌ది జనసేన కాదని.. సైకో సేన అని దుయ్యబట్టారు. ఈ సైకోగాళ్లు నెలకోసారి వచ్చి ప్రజలను రెచ్చగొడుతుంటారని ఆగ్రహించారు.
మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. 2019 ఎన్నికల్లోనే పవన్ సత్తా ఏంటో తమకు అర్థమైందన్నారు. 2009లో అన్న స్థాపించిన ప్రజారాజ్యంలో ఏం చేశారో కూడా చూశామని.. ఇప్పుడు కొత్తగా పవన్ ఏం చేయగలరని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇప్పటం గ్రామంలో రోడ్లను విస్తరిస్తుంటే పవన్‌కు అభ్యంతరమేంటని ఆయన ప్రశ్నించారు.
జనసేనాని పవన్.. ఓ వారాంతపు నాయకుడు అని ఎమ్మెల్యే పేర్ని నాని విమర్శించారు. పవన్ ఈరోజు తన నటనా కౌశలంతో ప్రజలను ఆకట్టుకున్నారని అన్నారు. చంద్రబాబు కళ్లల్లో ఆనందం చూసేందుకే.. జగన్ పట్ల అక్కసుని పవన్ ప్రదర్శించారని మండిపడ్డారు. ఎవరో సినిమా రైటర్ ఇచ్చిన స్క్రిప్ట్‌ను చదివాడని.. ఆయన చేసిన ప్రసంగంలో ప్రజలకు పనికొచ్చే విషయం ఒక్కటీ లేదని విమర్శించాడు. ‘పంటలు తగులబెట్టినపుడు, పొలాల్లో రోడ్లు వేసినపుడు పవన్‌కు గుండెల్లో ఏం గుచ్చుకోలేదా..? అప్పుడు తోలు మందమైందా. పవన్ వచ్చాడని ఇప్పటంలో ఏమైనా ఆగిందా. మోదీ కాళ్లు పట్టుకునేది, పారిపోయేది పవనే. వైసీపీ నేతలందరూ సేవాభావంతో పనిచేస్తున్నారని నాని అన్నాడు.
మరోవైపు.. అధికార వైసీపీపై పవన్‌కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పవన్‌కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నట్టుగా చెప్పారు. పథకాల పేర్లను సొంత డబ్బా కోసం ‘‘జగనన్న’’ పేరుతో ప్రచారం చేసుకోవటం తప్పని జీవీఎల్ వైసీపీని విమర్శించారు.