TTD : ‘వక్ఫ్ బోర్డు’ రియల్ ఎస్టేట్ కంపెనీ.. ఒవైసీ వ్యాఖ్యలకు టీటీడీ చీఫ్ కౌంటర్
తిరుమల అనేది ఒక ఆలయం అని బి.ఆర్.నాయుడు(TTD) పేర్కొన్నారు.
- By Pasha Published Date - 04:02 PM, Mon - 4 November 24

TTD : ‘‘టీటీడీ పాలక మండలిలో ముస్లింలు సభ్యులు కాలేరు. అలాంటప్పుడు వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను సభ్యులుగా ఎలా చేరుస్తారు ?’’ అని ఇటీవలే మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. దీనిపై టీటీడీ బోర్డు ఛైర్మన్ బి.ఆర్.నాయుడు సోమవారం ఘాటుగా స్పందించారు. టీటీడీ పాలక మండలిని వక్ఫ్ బోర్డుతో ఒవైసీ పోల్చడాన్ని ఆయన తప్పుపట్టారు. ‘‘వక్ఫ్ బోర్డు, టీటీడీ పాలక మండలి.. ఇవి రెండూ వేర్వేరు రకాల సంస్థలు. ఆ రెండింటిని ఒకేగాటన కట్టి మాట్లాడటం సరికాదు. వక్ఫ్ బోర్డు ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ. తిరుమల అనేది ఒక ఆలయం’’ అని బి.ఆర్.నాయుడు(TTD) పేర్కొన్నారు. ‘‘తిరుమల ప్రాంతంలో హిందూయేతరులు నివసించరాదు అనే డిమాండ్ చాలా ఏళ్లుగా ఉంది. అది నా వ్యక్తిగత అభిప్రాయం కాదు. అక్కడ కేవలం హిందువులే ఉండాలని సనాతన ధర్మం చెబుతోంది. మేం దానిపై కూడా ఫోకస్ పెట్టబోతున్నాం. టీటీడీ మొదటి బోర్డు సమావేశంలో దానిపై నిర్ణయం తీసుకుంటాం’’ అని బి.ఆర్.నాయుడు వెల్లడించారు.
Also Read :Hindu IAS Officers : ‘హిందూ ఐఏఎస్ వాట్సాప్ గ్రూప్’.. ఐఏఎస్ ఆఫీసర్ ఫిర్యాదుతో వ్యవహారం వెలుగులోకి
వక్ఫ్ బోర్డులో నాన్ ముస్లింలను సభ్యులుగా చేర్చే ప్రతిపాదనతో వక్ఫ్ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం రెడీ చేసింది. దీనిపై ప్రస్తుతం జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) చర్చిస్తోంది. అన్ని పార్టీలు, అన్ని వర్గాల అభిప్రాయాల సేకరణ జరుగుతోంది. ఇటీవలే ఒవైసీ దీనిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. వక్ఫ్ భూములను లూటీ చేసే దురుద్దేశంతో వక్ఫ్ సవరణ బిల్లును ప్రధాని మోడీ తీసుకొచ్చారని ఆయన ఆరోపించారు. ‘‘వక్ఫ్ భూమికి యజమాని అల్లా.. అయితే, ఆ భూమికి యజమాని నేను, కలెక్టర్ అని మోడీ అంటున్నారు. ఇది సరికాదు ’’ అని ఒవైసీ మండిపడ్డారు. టీటీడీ లాంటి హిందూ మత సంస్థలలో కేవలం హిందువులకే చోటు ఇచ్చినప్పుడు.. వక్ఫ్ లాంటి ముస్లిం సంస్థలలో ముస్లిమేతరులకు చోటు ఇవ్వాలనే ఆలోచన కూడా అన్యాయమైందని ఆయన ఫైర్ అయ్యారు.