Notices : వివేకా హత్య కేసు.. భాస్కర్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు
దాదాపు హత్య జరిగి ఐదేళ్లు గడిచినా ఈ దారుణానికి ఒడిగట్టింది ఎవరనే దానిపై అధికారికంగా స్పష్టత రాలేదు.
- By Latha Suma Published Date - 02:45 PM, Fri - 29 November 24

YS Vivekananda Reddy murder case : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న సీబీఐ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఈరోజు విచారించింది. సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో మిగిలిన నిందితుల బెయిల్ రద్దు పిటిషన్లతోపాటు దీన్ని జతచేయాలని సునీత తరఫు లాయర్ కోరారు. దీంతో ఆ మేరకు సుప్రీంకోర్టు ఆదేశాలిస్తూ..తదుపరి విచారణ మార్చికి వాయిదా వేసింది.
కాగా, సీబీఐ సుదీర్ఘకాలంగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును విచారిస్తోంది. దాదాపు హత్య జరిగి ఐదేళ్లు గడిచినా ఈ దారుణానికి ఒడిగట్టింది ఎవరనే దానిపై అధికారికంగా స్పష్టత రాలేదు. ఈ హత్య చేసిందేవరో కోర్టు తుది తీర్పు తర్వాతనే తేలనుంది. ఈ హత్యలో ఎవరు పాత్రదారులు.. ఎవరు సూత్రదారులు అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. చట్టప్రకారం దర్యాప్తు సంస్థలు విచారణ పూర్తి చేసి సాక్ష్యాధారాలను కోర్టులో సమర్పించిన తర్వాత.. న్యాయస్థానం తీర్పు తర్వాత ఈ హత్యలో దోషులు ఎవరో అధికారికంగా తేలుతుంది.
ఇకపోతే..ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ముందు సీబీఐ విచారణ మందగించింది. ఓవైపు ఎన్నికల సమయం కావడంతో కొంత గ్యాప్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గత ఐదేళ్లుగా సీబీఐ ఈ కేసులో అసలు నిందితులను అరెస్ట్ చేసే ప్రయత్నం చేసినా.. గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ఏదో విధంగా వారి విధులకు ఆటంకం కలిగిస్తూనే ఉందనే ఆరోపణలు ఉన్నాయి. నిందితులను కాపాడేందుకు వైఎస్ జగన్ తీవ్రంగా ప్రయత్నించారనే ఆరోపణలు ఉన్నాయి. దర్యాప్తు సక్రమంగా జరగకుండా జగన్ కుట్రలు చేసినట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలసిందే.