Kanaka Durga Temple : దుర్గగుడిలో మరోసారి బయటపడ్డ చైర్మన్, ఈవో మధ్య విభేదాలు.. ఈవోపై చైర్మన్ ఆగ్రహం
విజయవాడ కనకదుర్గ దేవాలయంలో శాకంబరీ ఉత్సవాళ వేళ చైర్మన్, ఈవో మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. దుర్గగుడి అంతర్గత బదిలీల విషయంలో చైర్మన్ కర్నాటి రాంబాబు ఈవో బ్రమరాంబ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
- Author : News Desk
Date : 01-07-2023 - 5:50 IST
Published By : Hashtagu Telugu Desk
విజయవాడ దుర్గగుడిలో శాకంబరీ ఉత్సవాల వేళ చైర్మన్, ఈవో మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. చైర్మన్ కర్నాటి రాంబాబు (Chairman Karnati Rambabu) ఈవో బ్రమరాంబ (Eo Bramaramba) తీరుపై అసహనం వ్యక్తం చేశారు. దుర్గ గుడి(Durga Temple) అంతర్గత బదిలీల్లో భాగంగా చైర్మన్ పేషీలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులనూ ఈవో బ్రమరాంబ ఇతర విభాగాల్లోకి బదిలీ చేశారు. చైర్మన్ పేషీలో సీపీ, అటెండర్లు, సిబ్బంది కూడా బదిలీల్లో ఉన్నారు. ఈ క్రమంలో.. శాకంబరి ఉత్సవాల వేళ చైర్మన్ పేషీలో సీపీ చార్జి తీసుకోలేదు. ఇద్దరు అటెండర్లకుగాను ఒక్క అటెండర్‌ను మాత్రమే వేయడంపై ఈవో పై చైర్మన్, పాలకమండలి సభ్యుల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవో తీరుతో ఒక్క అటెండర్‌నుకూడా చైర్మన్ పేషీ నుంచి వెనక్కి పంపించి వేశారు.
శాకంబరీ ఉత్సవాల వేళ దేవస్ధానం సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో చైర్మన్, పాలకమండలి సభ్యుల ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఈవో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ చైర్మన్ కర్నాటి రాంబాబు సీఎంకుసైతం ఫిర్యాదు చేశారు. బదిలీల విషయంపై ఈవోను మీడియా ప్రతినిధులు సంప్రదించగా.. కమిషనర్ ఆర్డర్‌తోనే బదిలీలు చేశామని చెప్పారు. దుర్గగుడిలో అంతర్గత బదిలీలు నిబంధనలకు లోబడే చేశామని అన్నారు. నా పేషీలో సిబ్బందినికూడా మార్చామని, మరికొన్ని విభాగాల్లో బదిలీలు చేశామని తెలిపారు.
లీగల్, ల్యాండ్స్‌తో పాటు ఇతర విభాగాల్లోనూ మార్పులు చేశామని, త్వరలోనే మెయిన్ డిపార్ట్మెంట్ లలో బదిలీలు చేపడతామని ఈవో తెలిపారు. మూడు నెలలు పూర్తైన వారివి మాత్రమే బదిలీలు చేశామని, మూడు నెలలు నిండని వారిని బదిలీలు చేశామన్నది అవాస్తవం అని ఈవో అన్నారు. దుర్గగుడితో పాటు ఇతర ఆలయాల్లో బదిలీలు సహజమేనని, ఉద్యోగికి బదిలీలు అన్నది సహజమని, ఈ బదిలీలు దుర్గగుడిలో అంతర్గతంగా జరిగినవి మాత్రమేనని, మరలా మార్పునకు అవకాశం ఉందని చెప్పారు.