YS Jagan: జగన్ దిగిరాకపోతే.. టాలీవుడ్ ఈ మూడూ ట్రై చేయాల్సిందే!
- By Hashtag U Published Date - 09:41 AM, Sun - 27 February 22

సినీపరిశ్రమపై జగన్ సర్కార్ వరాలు కురిపిస్తుందా, వర్రీనే మిగుల్చుతుందా? టాప్ హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు వెళ్లి అడిగినా ఇంకా దయతలచదేమి? జగన్‌కు ఏం కావాలి? సినీ పరిశ్రమ కోరుకున్నట్టు టికెట్ల రేట్లు పెంచకపోతే పరిస్థితి ఏంటి? భీమ్లా నాయక్ రిలీజ్ తరువాత సినీ పెద్దలకు, అభిమానులకు ఇవే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
తాము హీరోలమనే భావన పక్కన పెట్టి, దండం పెట్టి మరీ అడిగారు. ఇలా ఎందుకు అనాల్సి వచ్చిందంటే.. బాలకృష్ణ, పవన్ కల్యాణ్ ఇద్దరూ ప్రభుత్వాన్ని దేహీ అనాల్సిన అగత్యం తమకు లేదని చెప్పుకొచ్చారు. చిరంజీవి లాంటి వ్యక్తే ఒకటికి రెండుసార్లు జగన్ గడప తొక్కారు. అయినా సరే, తమ్ముడి సినిమా పట్ల జగన్ దయ చూపించలేదన్నది అభిమానులు, సామాన్యుల నుంచి వినిపిస్తున్న మాట.
టికెట్ రేట్లు పెంచితే ప్రభుత్వానికి వచ్చేదేం లేదు. పెంచకపోయినా నష్టమేం లేదు. అందుకే, తీరిగ్గా వ్యవహరిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సినిమా పరిశ్రమలోనూ రెండు విభిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. టికెట్ రేట్లు పెంచడం వల్ల లాభం జరుగుతుందని ఒకరు, నష్టమేనని మరికొందరు చెబుతున్నారు. ఇదీ నిజమే.
టికెట్ ధర తక్కువగా ఉంటే చిన్న సినిమాలు బాగా ఆడతాయి. కాని, పెద్ద సినిమాలకు చాలా పెద్ద నష్టం వస్తుంది. ఒకవేళ నిజంగానే సినీ పరిశ్రమ కోరుకున్నట్టు ఏపీలో టికెట్ ధరలు పెంచకపోతే.. భారీ బడ్జెట్ సినిమాలు చాలా నష్టపోవాల్సి వస్తుంది. ప్రభుత్వాన్ని మళ్లీ మళ్లీ అడగలేరు, అలాగని ఎదురు తిరగలేరు. వచ్చిందే ప్రాప్తం అనుకుని సర్దుకుపోవాల్సిందే. ఒకవేళ అలా సర్దుకుపోవాల్సి వస్తే.. సినీ పరిశ్రమ ముందున్న అవకాశాలేంటి? భారీ బడ్జెట్ సినిమాలు నిలదొక్కుకోవాలంటే ఎలాంటి వ్యూహంతో వెళ్లాల్సి ఉంటుంది.
తక్కువ టికెట్ ధరల కారణంగా చిన్న సినిమాలకు వచ్చే నష్టం ఉండదు. ఎటొచ్చీ భారీ బడ్జెట్ సినిమాలకే కష్టమంతా. ఇప్పటి వరకు తెలుగు మార్కెట్ నే నమ్ముకున్న వాళ్లు ఇకపై ఇతర భాషల్లోనూ డబ్ చేయాల్సి ఉంటుంది. లేదా ఒకేసారి పలు భాషల్లో సినిమా నిర్మించాల్సి ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే పాన్ ఇండియా సినిమా స్టైల్‌లో తీయాల్సిందే. అప్పుడు గాని పెట్టిన ఖర్చుకు లాభాలు రావు.
కొంత మంది సినిమా బడ్జెట్ తగ్గించుకుంటే సరిపోతుంది కదా అంటున్నారు. నిజానికి ఇప్పుడు పెద్ద సినిమాలు తీసేవాళ్లు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వడం లేదు. బాలీవుడ్ కాదు ఏకంగా హాలీవుడ్ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే మన సినిమాకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వస్తోంది. అలాంటి సమయంలో బడ్జెట్ తగ్గించుకుని సర్దుకుపోమనడం కరెక్ట్ కాదు. గ్రాఫిక్స్, కెమెరా పనితనంలో తెలుగు సినిమా ఎక్కాల్సిన మెట్లు చాలా ఉన్నాయి. బడ్జెట్ పేరుతో కోత పెట్టుకుంటే అది మనకే నష్టం.
ఇక సినిమా హీరోల రెమ్యునరేషన్ తగ్గించుకోవడం గురించి చూద్దాం. నిజానికి ఇది వ్యాలిడ్ పాయింటే అయినా.. సినిమా బడ్జెట్ అంటేనే హీరోల రెమ్యునరేషన్ కలుపుకొని చెబుతారు. హీరోకు తగ్గ కలెక్షన్లు కూడా వస్తున్నప్పుడు.. సదరు హీరోకు రెమ్యునరేషన్ తగ్గించాల్సిన అవసరమే లేదన్నది మరో వాదన.
ఇక సినిమా బడ్జెట్ తగ్గించుకునే విషయంలో కొంతమంది చెబుతున్నదేంటంటే. అనవసరపు ఆర్భాటాలు. ఒకప్పుడు ఫారెన్ లొకేషన్స్ లో షూటింగ్ అంటే మహా అయితే పది, ఇరవై మంది వెళ్లే వాళ్లు.. ఇప్పుడు గుంపులుగా వెళ్తున్నారని అంటున్నారు. నిజంగానే ఈ విషయంలో కాస్త తగ్గితే సినిమా ఇండస్ట్రీకే మంచిది.
ఇప్పుడు సినిమా అనేది ప్రపంచం మొత్తం ఉంది. ఎక్కడికక్కడ ఇండస్ట్రీలు ఉన్నాయి, క్రూ కూడా అందుబాటులో ఉంది. సో, ఈ విషయంలో ఖర్చు తగ్గించుకోవచ్చు. మొత్తంగా జగన్ సర్కార్ దిగిరాకపోతే గనక ఇండస్ట్రీ వేరే మార్గాలు చూసుకోవడమే మంచిదన్న అభిప్రాయం వినిపిస్తోంది.