లోకేష్ కనగరాజ్‌తో AA23.. సంక్రాంతికి భారీ అనౌన్స్మెంట్!
పుష్ప-2 తర్వాత అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆయన లైనప్‌లో అట్లీ సినిమాతో పాటు, త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఒక భారీ సోషియో ఫాంటసీ చిత్రం, సందీప్ రెడ్డి వంగాతో ఒక ప్రాజెక్ట్ చర్చల దశలో ఉన్నాయి.
- Author : Gopichand
Date : 08-01-2026 - 10:15 IST
Published By : Hashtagu Telugu Desk
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో సినిమా రాబోతుందంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు ఎట్టకేలకు ఒక స్పష్టత వచ్చింది. గురువారం నాడు అల్లు అర్జున్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన ఒక అప్డేట్ ఈ ప్రాజెక్ట్‌పై ఉన్న ఉత్కంఠను మరింత పెంచింది. పుష్ప-2 ఘనవిజయం తర్వాత అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాలను వరుసగా లైన్లో పెడుతున్నారు. ఇప్పటికే అట్లీ దర్శకత్వంలో ఒక సినిమా (AA22) పట్టాలెక్కనుండగా, ఇప్పుడు తన 23వ చిత్రాన్ని (AA23) లోకేష్ కనగరాజ్‌తో చేయబోతున్నట్లు దాదాపు ఖరారైంది.
అల్లు అర్జున్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక షూటింగ్ స్పాట్ ఫోటోను షేర్ చేస్తూ.. “Wait for it!” (వేచి చూడండి) అని క్యాప్షన్ ఇచ్చారు. మొదట ఇది అట్లీ ప్రాజెక్ట్‌కు సంబంధించినదని అందరూ భావించినప్పటికీ తాజా సమాచారం ప్రకారం ఇది లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రాబోయే సినిమా అనౌన్స్మెంట్ టీజర్ షూటింగ్ అని తెలుస్తోంది. ఈ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది.
Also Read: కొత్త ఆలోచనతో టాటా నానో పునరాగమనం?
ఈ క్రేజీ కాంబినేషన్ గురించి అధికారిక ప్రకటనను సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. లోకేష్ కనగరాజ్ తన సినిమాలను ‘లోకేష్ సినిమాటిక్ యూనివర్స్’లో భాగంగా తెరకెక్కిస్తుండటంతో బన్నీ సినిమా కూడా అందులో భాగం అవుతుందా? లేక ఇదొక స్వతంత్ర చిత్రమా? అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.
పుష్ప-2 తర్వాత అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆయన లైనప్‌లో అట్లీ సినిమాతో పాటు, త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఒక భారీ సోషియో ఫాంటసీ చిత్రం, సందీప్ రెడ్డి వంగాతో ఒక ప్రాజెక్ట్ చర్చల దశలో ఉన్నాయి. తాజాగా లోకేష్ కనగరాజ్ సినిమా కూడా తోడవడంతో మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. లోకేష్ కనగరాజ్ మార్క్ యాక్షన్, అల్లు అర్జున్ ఎనర్జీ తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. సంక్రాంతికి రాబోయే ఆ అధికారిక వీడియో కోసం ఇప్పుడు యావత్ సినీ ప్రపంచం ఎదురుచూస్తోంది.