మరోసారి వైసీపీకి స్ట్రాంగ్ వార్నింగ్ .. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
- Author : Vamsi Chowdary Korata
Date : 09-01-2026 - 3:31 IST
Published By : Hashtagu Telugu Desk
Pawan Kalyan Warning ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పర్యటించారు. పీఠికాపుర సంక్రాంతి మహాత్సవాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో ఏ చిన్న ఘటన జరిగినా పెద్ద వార్త అవుతోందని ఆరోపించారు. స్కూలు పిల్లలు కొట్లాడుకుంటే కూడా పెద్ద గొడవగా చేయాలని చూశారని.. అలాంటి వాటిని ఉపేక్షించేది లేదన్నారు. తన మాటలు మెత్తగానే ఉంటాయని.. చేతలు చాలా గట్టిగా ఉంటాయని.. పిఠాపురంలో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే కూర్చుని ఏరివేస్తానంటూ హెచ్చరించారు.
AP Deputy CM Pawan Kalyan Strong Warning to YSRCP
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. సొంత నియోజకవర్గం పిఠాపురంలో జరుగుతున్న పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాలకు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్.. పిఠాపురంలో కాకి ఈక రాలినా కూడా పెద్ద వార్త అవుతోందని.. దానిని వైరల్ చేస్తున్నారని మండిపడ్డారు. తాటాకు చప్పుడు కూడా వైరల్ చేస్తున్నారని.. పిఠాపురం ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. ఏ నాయకుడి నియోజకవర్గంలోనూ పిఠాపురంలో మాదిరిగా జరగడం లేదని.. ప్రజలు ఈ విషయాలను గమనించాలని పవన్ కళ్యాణ్ కోరారు.
సంక్రాంతి ఉత్సవాలకు పిఠాపురం చిరునామాగా మారాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. సంక్రాంతి పండుగకు తెలంగాణవారిని ఆహ్వానించాలని.. గోదారి ఆతిథ్యాన్ని రుచిచూపించాలన్నారు. శ్రీపాధ వల్లభుడు వెలసిన నేల నుంచి తాను పోటీచేయడం.. అంతా భగవత్ సంకల్పంగా పవన్ కళ్యాణ్ అన్నారు.ఎమ్మెల్యేగా ఏడాది కాలంలోనే పిఠాపురం అభివృద్ధికి రూ.308 కోట్లు కేటాయించిన విషయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. ఈ పనులను మార్చి నాటికి పూర్తి చేస్తామని వెల్లడించారు. అధికారంలో ఉన్నా లేకపోయినా పిఠాపురం అభివృద్ధికి ఆఖరి శ్వాస వరకూ పనిచేస్తానని పవన్ కళ్యాణ్ అన్నారు.
మరోవైపు పిఠాపురం పర్యటనలో వైసీపీపై పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రజల మధ్య వైషమ్యాలు పెంచేందుకు ప్రయత్నిస్తోందని.. ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ వారిలో మార్పులు రాలేదని పవన్ కళ్యాణ్ అన్నారు. వారి కుట్రల్లో చిక్కుకోవద్దని ప్రజలకు సూచించారు. మరోవైపు పిఠాపురంలో ఓ స్కూల్‌లో ఇద్దరు పిల్లలు కొట్టుకున్న ఘటనను కూడా పెద్ద వార్త చేశారని.. అది కూడా తన బాధ్యత అన్నారని పవన్ కళ్యాణ్ విమర్శించారు. పులివెందులలో ఏం జరిగినా వార్త అవదని.. పిఠాపురంలో స్కూలు పిల్లలు కొట్టుకుంటే కూడా పెద్ద వార్త చేస్తున్నారని అన్నారు. చిన్న పిల్లల తగాదాలోకి కులాలను లాగి పెద్ద గొడవలా మార్చేందుకు ప్రయత్నించారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.
పిఠాపురంలో తగాదాలు పెట్టి గొడవలు చేద్దామని ప్రయత్నిస్తే.. ఇక్కడే కూర్చుని ఏరివేస్తానంటూ పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. తన మాటలు మెత్తగానే ఉంటాయని.. కానీ చేతలు చాలా గట్టిగా ఉంటాయని, వ్యక్తిగతంగా తీసుకుంటానని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. శాంతి భద్రతల పర్యవేక్షణ విషయంలో పోలీసులు కఠినచర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. మరోవైపు కూటమి పార్టీల మధ్య పొత్తును బలహీనం చేసేందుకు ప్రయత్నం చేయవద్దని పవన్ కళ్యాణ్ సూచించారు. చంద్రబాబు అనుభవం, నాయకత్వం రాష్ట్రానికి అవసరమన్నారు.