Tiruvuru TDP : తిరువూరు టీడీపీలో రోజుకో అభ్యర్థి పేరు.. కన్ఫ్యూజన్‌లో క్యాడర్..!
- Author : Prasad
Date : 22-02-2024 - 8:23 IST
Published By : Hashtagu Telugu Desk
2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు తలనొప్పిగా మారాయి. అభ్యర్థుల ఎంపికలోనే తర్జన భర్జన పడుతున్నాయి. ముఖ్యంగా టీడీపీలో అశావాహులు ఎక్కువగా ఉండటంతో ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై కసరత్తు చేస్తున్నప్పటికి కొలిక్కిరాకపోవడంతో క్యాడర్‌లో నిరుత్సాహం మొదలైంది. ఇటు జనసేనతో పొత్తు క్లారిటీ వచ్చిన.. బీజేపీతో పొత్తు విషయంలో క్లారిటీ రాకపోవడంతో టికెట్ల ప్రకటన ఆలస్యం అవుతుంది. దీంతో చాలామంది నేతలు పక్క పార్టీలవైపు చూస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు వైసీపీలో చేరిపోతున్నారు. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన నేతలు సైతం మళ్లీ వైసీపీలోకి వెళ్లేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఇటు ఉమ్మడి కృష్ణాజిల్లా టీడీపీలో గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మైలవరం, తిరువూరు నియోజకవర్గాల్లో రోజుకో అభ్యర్థుల పేర్లు బయటికివస్తున్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
తిరువూరు నియోజకవర్గంలో తొలుత నల్లగట్ల స్వామిదాస్ ఇంఛార్జ్‌గా ఉన్నా..ఆయన స్థానంలో శావల దేవదత్‌ని తీసుకువచ్చి పెట్టారు.దీంతో చాలాకాలం వేచి చూసిన స్వామిదాస్.. ఎంపీ కేశినేని నానితో పాటు వైసీపీలోకి వెళ్లిపోయారు. అయితే స్వామిదాస్ వెళ్లిపోవడంతో తనకు లైన్ క్లియర్ అయిందనుకున్న శావల దేవదత్‌కు అధిష్టానం మళ్లీ మెండిచేయి చూపిస్తుంది. శావల దేవదత్‌ని కాదని.. అమరావతి ఉద్యమనేత కొలికపూడి శ్రీనివాస్‌ను తెరమీదకు తెచ్చారు స్థానిక నేతలు.. స్వామిదాస్‌పై దేవదత్ సరైన అభ్యర్థి కాదని.. వేరే అభ్యర్థిని పెట్టాలని శావల దేవదత్ వర్గంవారే అధిష్టానానికి ఫిర్యాదు చేశారని సమాచారం. దీంతో ఇప్పుడు కొలికపూడి పేరు ఐవీఆర్ఎస్ కాల్స్‌లో వినిపిస్తుంది. ఇప్పటికే రెండు సార్లు సర్వే పూర్తయినప్పటికీ కొలికపూడి శ్రీనివాస్ పేరుని కూడా ఖరారు చేయలేదు. కొలికపూడి శ్రీనివాసరావు కేశినేని చిన్నికి సన్నిహితుడు కావడం ఆయనే కొలికపూడికి మద్దతు ఇస్తున్నారని.. ఇన్నాళ్లు కేశినేని నానిని కాదని..చిన్నికి మద్దుతు ఇచ్చిన దత్‌ని చిన్నినే పక్కన పెట్టారనే చర్చ క్యాడర్‌లో జరుగుతుంది.
Also Read: Vijayawada : విజయవాడ వెస్ట్‌లో టీడీపీకి బిగ్ షాక్.. వైసీపీలోకి మాజీ ఎమ్మెల్యే..!
వీరేకాక ఇంకా చాలామంది అభ్యర్థులు తెరమీదకు వస్తున్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి వాసం మునియ్య, తాడికొండకు చెందిన తోకల రాజవర్థన్ కూడా తిరువూరు టికెట్ ఆశిస్తున్నారు. ఇటు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే రక్షణనిధి కూడా తిరువూరు టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు. ఇప్పటికే చాలామంది ముఖ్యనేతలతో ఆయన మంతనాలు సాగిస్తున్నారు. ఇప్పటి వరకు టికెట్ పై ఎవరికి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో అధిష్టానం మరిన్ని పేర్లను పరిశీలించే అవకాశం కూడా ఉంది. దీంతో నామినేషన్ వరకు అభ్యర్థి ఎవరు అవుతారో అన్నకన్ఫ్యూజన్‌లో తిరువూరు టీడీపీ కార్యకర్తలు ఉన్నారు.