Vijayawada : విజయవాడ వెస్ట్‌లో టీడీపీకి బిగ్ షాక్.. వైసీపీలోకి మాజీ ఎమ్మెల్యే..!
- By Prasad Published Date - 08:04 AM, Thu - 22 February 24

ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అసంతృప్తి నేతలంతా పార్టీలు మారుతూ రోజుకో ట్విస్ట్ ఇస్తున్నారు. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన షర్మిల గూటికి చేరిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామృకృష్ణారెడ్డి మళ్లీ వైసీపీలోకి తిరిగి చేరిపోయారు. దీంతో ఏపీలో రాజకీయాలు ఎవరికి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాయి. తాజాగా టీడీపీ నుంచి కూడా అధికార వైసీపీలోకి వలసలు జోరందుకున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణాజిల్లాలో టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలు పెరిగిపోయాయి. టీడీపీ ఎంపీ కేశినేని నాని వైసీపీలో చేరిన తరువాత చాపకింద నీరులా టీడీపీ క్యాడర్ అంతా వైసీపీ వైపు మళ్లుతుంది. ఎంపీ కేశినేని నానితో పాటు క్యాడర్ వెళ్లనప్పటికి మారుతున్న రాజకీయ పరిణామాలతో ఇప్పుడు క్యాడర్ అంతా ఎంపీ కేశినేని నాని వైపే వెళ్తున్నారు. ఇటు విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో ఎంపీ కేశినేని నానికి బలమైన పట్టు ఉంది. ఇక్కడ సీనియర్ నేతలంతా ఆయన వెంట రాకపోయినప్పటికి ఆయనతో టచ్‌లో ఉన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
తాజాగా విజయవాడ వెస్ట్ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కూడా వైసీపీలో చేరేందుకు సిద్ధం అయ్యారు. టీడీపీలో ఆయన చాలా కాలం నుంచి అసంతృప్తిగా ఉన్నారు. టీడీపీలో ఆయనకు సీటు వచ్చే అవకాశం లేకపోవడంతో వైసీపీలో చేరాలని నిర్ణయించారు. విజయవాడ వెస్ట్ సీటు టీడీపీ పోటీ చేస్తుందా పొత్తులో జనసేనకు వెళ్తుందా అనేది ఇంకా తేలకపోవడంతో చాలా మంది టీడీపీ నేతలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఇటు వైసీపీ ఈ సీటు ఇప్పటికే ప్రకటించింది. షేక్ ఆసీఫ్‌ని అభ్యర్థిగా వైసీపీ అధిష్టానం ప్రకటించడంతో ఆయన ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ సైతం వైసీపీ నుంచి టికెట్ ఆశించినా అభ్యర్థిని ప్రకటిచడంతో అవకాశం లేకుండా పోయింది. నిన్న జలీల్‌ఖాన్ వైసీపీ ముఖ్యనేత ఆళ్ల అయోధ్యరామిరెడ్డిని కలిసి పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి మద్దతు ఇచ్చి గెలిపించాలని అయోధ్యరామిరెడ్డి జలీల్‌ఖాన్‌ని కోరారు. పార్టీలో సముచితస్థానం కల్పిస్తామని హమీఇచ్చారు. దీంతో రెండు మూడు రోజుల్లో జలీల్‌ఖాన్ వైసీపీలో చేరే అవకాశం ఉంది.
Also Read: TDP : టీడీపీ మేనిఫెస్టోలో మహిళలకు పెద్దపీట వేయాలి : మహిళా సంఘాల ఐక్యవేదిక సభ్యుల వినతి