Tirumala Laddu Controversy: తిరుమల లడ్డూ వివాదం.. సీబీఐ అదుపులో నలుగురు!
రూర్కీలోని భోలే బాబా దగ్గర నుంచి నెయ్యి తెప్పించినట్లు వైష్ణవి డైరీ దొంగ రికార్డులు సృష్టించారు. భోలే బాబా డైరీకి ఇంత మొత్తంలో నెయ్యి సరఫరా సామర్థ్యం లేదని అధికారుల విచారణలో తేలడంతో అసలు విషయం బయటకు వచ్చింది.
- By Gopichand Published Date - 11:25 PM, Sun - 9 February 25

Tirumala Laddu Controversy: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో (Tirumala Laddu Controversy) కీలక పరిణామం చోటుచేసుకుంది. లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు బృందం నలుగురిని అరెస్ట్ చేసింది. భోలే బాబా డైరీకి (రూర్కీ, ఉత్తరాఖండ్) నాడు డైరెక్టర్లుగా పనిచేసిన విపిన్ జైన్, పోమిల్ జైన్, వైష్ణవి డైరీ (పూనంబాక) సీఈవో అపూర్వ వినయ్ కాంత్ చావ్డా, ఎఆర్ డైరీ (దుండిగల్) ఎండి రాజు రాజశేఖరన్ లను సీబీఐ అదుపులోకి తీసుకుంది.
క్రైమ్ నెంబర్ 470/24లో అరెస్టు చేసి తిరుపతి కోర్టులో దర్యాప్తు అధికారులు హాజరుపర్చారు. దర్యాప్తులో అక్రమాలు బట్టబయలయ్యాయి. నెయ్యి సరఫరాలో అడుగడుగునా ఉల్లంఘనలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఎఆర్ డైరీ పేరుతో నెయ్యి సరఫరా టెండర్లను వైష్ణవి డైరీ ప్రతినిధులు దక్కించుకోవటం గమనార్హం. ఎఆర్ డైరీ పేరు ముందు పెట్టి తప్పుడు డాక్యుమెంట్లు, సీళ్లు ఉపయోగించి టెండర్ కథను వైష్ణవి డైరీ నడిపించినట్లు అధికారులు తేల్చారు.
రూర్కీలోని భోలే బాబా దగ్గర నుంచి నెయ్యి తెప్పించినట్లు వైష్ణవి డైరీ దొంగ రికార్డులు సృష్టించారు. భోలే బాబా డైరీకి ఇంత మొత్తంలో నెయ్యి సరఫరా సామర్థ్యం లేదని అధికారుల విచారణలో తేలడంతో అసలు విషయం బయటకు వచ్చింది. సమగ్ర విచారణతో అక్రమాలను దర్యాప్తు బృందం గుర్తించింది. మూడు డైరీలకు చెందిన నలుగురిని సీబీఐ బృందం అదుపులోకి తీసుకుంది.
Also Read: India Claim Series: భారత్ ఘనవిజయం.. 2-0తో సిరీస్ కైవసం
ఇదీ కేసు నేపథ్యం
- గత ప్రభుత్వ హాయంలో తిరుమల లడ్డూలో అపవిత్ర పదార్థాలు
- లడ్డూ కల్తీ వ్యవహారం బయటపడడంతో దేశ వ్యాప్తంగా సంచలనం
- వివాదంపై కేంద్ర, రాష్ట్ర అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన సుప్రీం కోర్టు
- ఐదుగురు సభ్యులతో కూడిన విచారణ బృందంలో సీబీఐ నుంచి ఇద్దరు, ఏపీ ప్రభుత్వం తరఫున ఇద్దరు, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒకరు
- దర్యాప్తు బృందంలో ఏపీ ప్రభుత్వం తరఫున గుంటూరు రేంజి ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, విశాఖ రేంజి డీఐజీ గోపీనాథ్ జెట్టీ, సీబీఐ తరఫున హైదరాబాద్ జోన్ జాయింట్ డైరెక్టర్ వీరేశ్ ప్రభు, విశాఖ ఎస్పీ మురళి తో పాటు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సలహాదారు డాక్టర్ సత్యేన్‌కుమార్ పాండా
- సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసిన సుప్రీం కోర్టు
- గత ఏడాది విచారణ ప్రారంభించిన సిబిఐ అధికారులతో కూడిన దర్యాప్తు బృందం
- తిరుమల లడ్డూల తయారీకి టీటీడీ రోజుకు 15 వేల కిలోల ఆవు నెయ్యి వినియోగం
- తమిళనాడుకు చెందిన AR ఫుడ్స్ కిలో నెయ్యి రూ.320 చొప్పున సరఫరా చేసేలా టెండర్లు ఖరారు
- జూలై 8న 8 ట్యాంకర్లు రాగా అందులో 4 ట్యాంకర్ల నెయ్యిని పరీక్షల కోసం ల్యాబ్ కు పంపిన అధికారులు
- అపవిత్ర పదార్థులు నెయ్యిలో కలిసినట్లు జులై 17వ తేదీన NDDB ల్యాబ్ నివేదిక
- కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత వెలుగు చూసిన కల్తీ వ్యవహారం, దర్యాప్తు, అరెస్టులు