Bird Flu : బర్డ్ ఫ్లూ వల్లే కోళ్ల మరణాలు.. మాంసం, గుడ్లు తినొచ్చా ?
ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా(Bird Flu) లేదా హెచ్5ఎన్1 వైరస్ వల్ల బర్డ్ ఫ్లూ వస్తుంది.
- By Pasha Published Date - 07:43 AM, Tue - 11 February 25

Bird Flu : ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఇటీవలే చోటుచేసుకున్న కోళ్ల మరణాలకు కారణం ఏమిటి? అనేది తెలిసిపోయింది. బర్డ్ ఫ్లూ వ్యాధి వల్లే ఆ కోళ్లు చనిపోయినట్లు వెల్లడైంది. ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా(Bird Flu) లేదా హెచ్5ఎన్1 వైరస్ వల్ల బర్డ్ ఫ్లూ వస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరు, తూర్పు గోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు అగ్రహారంలోని పౌల్ట్రీ ఫామ్‌లలో చనిపోయిన కోళ్ల శాంపిల్స్‌ను మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఉన్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైసెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ (ఐసీఏఆర్-ఎన్‌ఐహెచ్‌ఎస్‌ఏడీ)కు పంపారు. అక్కడ వాటికి టెస్ట్ చేయగా బర్డ్ ఫ్లూ పాజిటివ్ వచ్చింది.
Also Read :IDBI Bank : ప్రైవేటీకరణకు సిద్దమైన ఐడీబీఐ బ్యాంక్
ఇక్కడ బర్డ్ ఫ్లూ ఎలా వ్యాపించింది ?
విదేశీ వలస పక్షులు ప్రతి సంవత్సరం వివిధ సీజన్లలో ఆంధ్రప్రదేశ్‌లోని ఉభయ గోదావరి జిల్లాలకు వస్తుంటాయి. ఆ వలస పక్షుల్లోనే కొన్నింటిలో బర్డ్ ఫ్లూ వైరస్ ఉండే అవకాశాలు ఉంటాయి. ఆ పక్షుల రెట్టల ద్వారా ఈ జిల్లాల పరిధిలో ఉన్న జలాశయాల్లోని నీటిలోకి బర్డ్ ఫ్లూ వైరస్ చేరుతుంటుంది. అక్కడి నుంచి నీరు, ఇతరత్రా మార్గాల ద్వారా కోళ్లకు బర్డ్ ఫ్లూ వైరస్ సంక్రమిస్తుంది. నవంబరు, డిసెంబరు, జనవరి నెలల్లో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. ఈ సమయంలోనే వైరస్‌లు వేగంగా వ్యాపిస్తుంటాయి. ఉష్ణోగ్రతలు 32 నుంచి 34 డిగ్రీల మధ్య ఉంటే బర్డ్ ఫ్లూ వైరస్ జీవించలేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికశాతం ప్రాంతాల్లో టెంపరేచర్స్ సగటున 34 డిగ్రీలకుపైనే ఉన్నాయి.
Also Read :Beer Prices Hike : తెలంగాణ మందుబాబులకు షాక్ ఇచ్చిన రేవంత్ ప్రభుత్వం
కోడి మాంసం, కోడి గుడ్లు తినొచ్చా ?
- కోడి మాంసం, కోడి గుడ్లు తినొచ్చని వైద్య నిపుణులు అంటున్నారు.
- అధిక ఉష్ణోగ్రతలో ఈ వైరస్ బతకలేదని వారు గుర్తు చేస్తున్నారు.
- కోడిమాంసాన్ని, కోడి గుడ్లను మనం 100 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉడికిస్తాం. అందువల్ల దానిపై వైరస్ ప్రభావం ఉండదని చెబుతున్నారు.