kashibugga venkateswara swamy temple : తిరుమల దర్శనం దక్కలేదనే ఆలయ నిర్మాణం, ఎవరీ హరిముకుంద పండా!
- Author : Vamsi Chowdary Korata
Date : 01-11-2025 - 2:27 IST
Published By : Hashtagu Telugu Desk
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో శ్రీ విజయ వేంకటేశ్వరస్వామి ఆలయం తొక్కిసలాట ఘటనలో 10మంది చనిపోయారు. దీంతో ఆ ఆలయం గురించి చర్చ జరుగుతోంది. ఈ ఆలయాన్ని హరిముకుంద పండా సొంత నిధులతో నిర్మించారు. ఆయన తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళితే ఎదురైన అనుభవంతో తన సొంత డబ్బులతో ఆలయం నిర్మించాలని నిర్ణయించారు. వెంటనే రూ.10 కోట్లతో ఈ ఆలయాన్ని నిర్మించారు.
శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కాశీబుగ్గలోని శ్రీ విజయ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో పది మంది భక్తులు మృతి చెందినట్లు తెలుస్తోంది. పలువురికి తీవ్రగాయాలైనట్లు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మృతుల్లో మహిళలు, పిల్లలు ఉన్నారు. ఏకాదశి సందర్భంగా వేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా పోటెత్తారు. ఈ నేపథ్యంలోనే తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఆలయాన్ని 2023 ఆగస్టులో ప్రారంభించి భక్తులకు అందుబాటులోకి తెచ్చారు. అప్పటి నుంచీ ఈ ఆలయాన్ని జంట పట్టణాల్లోని భక్తులు తరలివస్తున్నారు. అయితే, ఈరోజు ఏకాదశి కావడం.. అందులోనూ శ్రీవారికి ప్రీతిపాత్రమైన శనివారం కావడంతో భక్తులు పోటెత్తారు. ఆలయ సామర్థ్యం దాదాపు 3 వేల మంది అయితే.. 25 వేల వరకు భక్తులు వచ్చినట్టు సమాచారం. క్యూలైన్‌లో భక్తులు విపరీతంగా ఉండడంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది. దీనికి తోడు మెట్ల మార్గంలో ఉన్న రెయిలింగ్ ఊడిపడింది. దీంతో భక్తులు మెట్లపై ఒకరిపై ఒకరు పడ్డారు.
ఇది ఒక ప్రైవేటు వ్యక్తి నిర్మించిన దేవస్థానం. పలాసలో స్థిరపడిన ఒడిశా రాజకుటుంబానికి చెందిన హరిముకుంద పండా ఈ ఆలయాన్ని నిర్మించారు. పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల్లో కాశీబుగ్గ పెట్రోలు బంకు వెనుక ఉన్న పండా తోటల్లో సువిశాలమైన శ్రీ విజయ వేంకటేశ్వర స్వామి ఆలయం రూపుదిద్దుకుంది. హరిముకుంద పండా కుటుంబానికి కాశీబుగ్గలో సుమారు వందెకరాల భూమి ఉంది. ఈ 100 ఎకరాల్లో ఉండే పండాగారి కొబ్బరి తోటలకు సుదీర్ఘ చరిత్ర ఉంది. అయితే, 12 ఎకరాల 40 సెంట్ల విస్తీర్ణంలో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని పండా నిర్మించారు.
హరిముకుంద పండా పదేళ్ల క్రితం తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారట. గోవింద నామాన్ని జపిస్తూ గంటల తరబడి స్వామి దర్శనం కోసం క్యూ లైన్‌లో నిలబడి ఎదురు చూశారట. ఆనంద నిలయంలో కొలువైన ఆ దేవదేవుడిని కాసేపు అక్కడే నిలబడి కనులారా చూడొచ్చని ఆయన ఎంతో ఆశపడ్డారట. అయితే ఆ భాగ్యం దక్కనే లేదట.. అక్కడ విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది ఆయన్ను పక్కకు నెట్టేశారట. తాను ఎనిమిది పదుల వృద్ధుడినని, అనారోగ్యంతో బాధపడుతున్నానని చెప్పినా వినిపించుకోలేదట. చివరకు నిరాశతో వెనుదిరిగి వెళ్లిపోయారట. తల్లితో తన అనుభవం పంచుకున్న సమయంలో ఒక ఆలయం నిర్మాణం ఆలోచన వచ్చిందట.
వెంటనే శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల్లో కాశీబుగ్గ పెట్రోలు బంకు వెనుక ఉన్న పండా తోటల్లో సువిశాలమైన శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాడు. తిరుమలలోని శ్రీవారి ఆలయం ఆనంద నిలయానికి ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని తీర్చిదిద్దాడు. ఈ ఆలయంలో శ్రీవారితో పాటు శ్రీదేవి, భూదేవి అమ్మవారి విగ్రహాలను ఏకశిలతో రూపొందించారు. నవగ్రహ దేవతలతో పాటు సకల దేవతామూర్తుల విగ్రహాలు ఇక్కడ కొలువుదీరాయి. లయం బయట ఆంజనేయుడు, గరుత్మంతుడి భారీ విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. తిరుమల ఆలయం తరహాలో నిర్మాణాలు చేశారు.
ఈ ఆలయానికి దాతలు ఎవరూ లేరు.. హరిముకుంద పండానే తమ సొంత డబ్బులతో ఆలయాన్ని కట్టించారు. పూర్తిసేవా విధానంలో ఆలయం నిర్మించాడు. పేద కుటుంబాల వివాహాల కోసం ప్రత్యేక కల్యాణమండపం కూడా నిర్మించాడట. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు స్నానాలు చేయడానికి వీలుగా కోనేరు తవ్వించారట. అభిషేకాలు, ప్రత్యేక పూజల కోసం యాగస్థలి, భక్తులు వేచి ఉండేందుకు విశ్రాంతి మండపాలు నిర్మించారట. అయితే ఈ ఆలయంలో ఇంతటి విషాదం జరుగుతుందని ఎవరూ ఊహించలేదు.
బ్రేకింగ్ న్యూస్ ఏపీలో తీవ్ర విషాదం శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట తొక్కిసలాటలో 9 మంది మృతి, పలువురికి గాయాలు#AndhraPradesh #HarimukundaPanda #KashibuggaTemple #venkateswaraswamytemple #srikakulamStampade #HashtagU pic.twitter.com/UOAEuHzXFF
— Hashtag U (@HashtaguIn) November 1, 2025