CM Chandrababu : సముద్రంలో కలిసే నీటిని తెలుగు రాష్ట్రాలు వాడుకోవాలి.. రైతాంగానికి మేలు: సీఎం చంద్రబాబు
శ్రీశైల మల్లన్నకు ప్రత్యేక పూజలు చేశాను. రాయలసీమ రతనాల సీమగా మారాలని ప్రార్థించాను. మల్లన్న ఆశీస్సులతో ఈ ప్రాంతం సుభిక్షంగా మారుతుంది. జలాలే మన అసలైన సంపద. సాగునీటి ప్రాజెక్టులే ఆధునిక దేవాలయాలు. రైతన్నల బాధలు తీరేందుకు ఇవే మార్గం అని చెప్పారు.
- By Latha Suma Published Date - 06:03 PM, Tue - 8 July 25

CM Chandrababu : నా జీవితంలో ఈరోజు అనిర్వచనీయమైన ఆనందకరమైన రోజు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. జులై మొదటి వారంలోనే శ్రీశైలం జలాశయం పూర్తిగా నిండడాన్ని ఆయన శుభసూచకంగా అభివర్ణించారు. కృష్ణానదికి జలహారతి ఇచ్చిన అనంతరం ముఖ్యమంత్రి స్వయంగా ప్రాజెక్టు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. అనంతరం జరిగిన నీటి వినియోగదారుల సమావేశంలో ఆయన భావోద్వేగంతో మాట్లాడారు. శ్రీశైల మల్లన్నకు ప్రత్యేక పూజలు చేశాను. రాయలసీమ రతనాల సీమగా మారాలని ప్రార్థించాను. మల్లన్న ఆశీస్సులతో ఈ ప్రాంతం సుభిక్షంగా మారుతుంది. జలాలే మన అసలైన సంపద. సాగునీటి ప్రాజెక్టులే ఆధునిక దేవాలయాలు. రైతన్నల బాధలు తీరేందుకు ఇవే మార్గం అని చెప్పారు.
Read Also: Umpire Bismillah: క్రికెట్ ప్రపంచంలో విషాదం.. 41 ఏళ్లకే అంపైర్ కన్నుమూత!
శ్రీశైలం జలాశయంలో ప్రస్తుతం 200 టీఎంసీల నీరు ఉన్నట్లు తెలియజేసిన సీఎం, ఇది రాష్ట్రానికి, ముఖ్యంగా రాయలసీమకు ఎంతో ఊరటనిచ్చే అంశమని చెప్పారు. గతంలో రాయలసీమ అభివృద్ధికి ఎంతో మంది శ్రద్ధ చూపలేదని పేర్కొంటూ, స్వర్గీయ ఎన్టీఆర్ ప్రారంభించిన మార్గాన్ని తాను కొనసాగిస్తున్నానని చెప్పారు. రాయలసీమను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో రూ. 68 వేల కోట్లు సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు చేశాం అని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన చంద్రబాబు వారు అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమను పట్టించుకోలేదు. ఇప్పుడైనా ఆ ప్రాంత ప్రజలకు మేలు జరగాలన్నదే మా ప్రభుత్వ ధ్యేయం. జీడిపల్లికి నీరు తరలించేందుకు అధికారులకు జూలై 15వ తేదీని టార్గెట్‌గా పెట్టాం. నెలాఖరులోగా కుప్పం, మదనపల్లెలకు కూడా నీరు చేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం అని వెల్లడించారు. పోతిరెడ్డిపాడు, గాలేరు-నగరి, గండికోట వంటి ప్రధాన ప్రాజెక్టులను తెచ్చిన ఘనత తమదేనని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు వల్లే రాయలసీమకు నీటి ప్రవాహం జరుగుతోందని చెప్పారు.
రాయలసీమ అభివృద్ధికి నా వద్ద స్పష్టమైన బ్లూప్రింట్ ఉంది. ఇది కేవలం నీటిపరిమితికి మాత్రమే కాదు, పారిశ్రామిక, వ్యవసాయ, ఆరోగ్య పరంగానూ సాగుతుంది అని వివరించారు. ప్రాంతీయ అభివృద్ధి విషయానికొస్తే దేశంలో ఎక్కడా లేని సుశృంఖల రోడ్డు వ్యవస్థ రాయలసీమలో ఉంది. కొప్పర్తి, ఓర్వకల్లు లాంటి ప్రాంతాలు పారిశ్రామిక కేంద్రాలుగా అభివృద్ధి చెందుతున్నాయి అని పేర్కొన్నారు. ఆహారంలో మార్పును కూడా ఆయన ప్రస్తావించారు. గతంలో మేము రాగులు, జొన్నలు, కొర్రలు, సజ్జలు తినేవాళ్లం. ఇప్పుడు పాలిష్డ్ రైస్ తినడం వల్ల ప్రజల్లో ఆరోగ్య సమస్యలు పెరిగాయి. ఇప్పుడు మళ్లీ చిరుధాన్యాలవైపు ప్రజలు తిరుగుతున్నారు. ఆరోగ్యంపై అవగాహన పెరుగుతోంది. కూరగాయలు, పండ్ల వినియోగం పెరుగుతోంది. అన్ని రకాల పండ్లను పండించగల సామర్థ్యం రాయలసీమకు ఉంది అని పేర్కొన్నారు. చివరిగా తెలుగుజాతి ప్రపంచంలోనే నంబర్‌వన్‌గా ఎదగాలన్నదే నా కల. హైదరాబాద్‌లో కొనసాగుతున్న అభివృద్ధికి కూడా మేమే పునాది వేశాం. సముద్రంలో కలిసే నీటిని తెలుగురాష్ట్రాలు వినియోగించుకుంటే రెండు రాష్ట్రాలకూ మేలు జరుగుతుంది అని చంద్రబాబు స్పష్టం చేశారు.