CM Chandrababu : శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసిన సీఎం చంద్రబాబు
ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుతున్నది. జలాశయంలోకి ప్రతి క్షణం 1,71,550 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నది. గరిష్ఠ నీటి మట్టం 885 అడుగులుగా ఉండగా, ప్రస్తుతం నీటి మట్టం 880.80 అడుగులకు చేరింది. 215 టీఎంసీల సామర్థ్యం గల ఈ ప్రాజెక్టులో ఇప్పటికే 192 టీఎంసీలు నీరు చేరిన నేపథ్యంలో గేట్లను ఎత్తక తప్పలేదు.
- By Latha Suma Published Date - 04:50 PM, Tue - 8 July 25

CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం న్ని సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు వద్ద కృష్ణా నదికి జలహారతి అర్పించి అనంతరం జలాశయ గేట్లను ఎత్తి వరదనీటిని విడుదల చేశారు. భారీగా వచ్చిన వరద నీటిని నియంత్రించేందుకు శ్రీశైలం ప్రాజెక్టులోని కొన్ని గేట్లను ఎత్తాలని అధికారులు నిర్ణయించగా, ముఖ్యమంత్రి స్వయంగా ఈ ప్రక్రియను ప్రారంభించారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుతున్నది. జలాశయంలోకి ప్రతి క్షణం 1,71,550 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నది. గరిష్ఠ నీటి మట్టం 885 అడుగులుగా ఉండగా, ప్రస్తుతం నీటి మట్టం 880.80 అడుగులకు చేరింది. 215 టీఎంసీల సామర్థ్యం గల ఈ ప్రాజెక్టులో ఇప్పటికే 192 టీఎంసీలు నీరు చేరిన నేపథ్యంలో గేట్లను ఎత్తక తప్పలేదు.
Read Also: Bhadrachalam : భద్రాచలం ఆలయ ఈవో రమాదేవిపై దాడి
ఈ సందర్భంలో చంద్రబాబు మాట్లాడుతూ..శ్రీశైలం ప్రాజెక్టు తెలుగు ప్రజల ఆత్మ. ఇది నదుల పాలనలో ఎంతో కీలకమైనది. కృష్ణమ్మకు జలహారతి ఇవ్వడం ఎంతో పవిత్రమైన పని అని అన్నారు. అన్నీ రంగాలలో పునర్నిర్మాణంతో పాటు జలవనరుల ప్రాధాన్యతను పెంచడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను. ప్రజలందరికి భద్రత కల్పించడంలో ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది అని తెలిపారు. ఆయన వెంట మంత్రులు నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యేలు భూమా అఖిలప్రియ, బుడ్డా రాజశేఖర్ రెడ్డి తదితరులు ఉన్నారు. 6, 7, 8, 11 నంబర్ గేట్లను అధికారులు ఎత్తడంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ముందుగా ముఖ్యమంత్రి శ్రీశైలం ప్రాజెక్టు చరిత్రను, నిర్మాణ దశలను వివరించే ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. అనంతరం కృష్ణమ్మ తీరంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, జలహారతి ఇచ్చారు. జలాశయ గేట్లను ఎత్తిన అనంతరం గాలిలోకి ఎగిసిపడుతున్న నీటి ప్రవాహం అందరినీ ఆకట్టుకుంది.
ఇదిలా ఉండగా, జురాల ప్రాజెక్టులో కూడా వరద నీరు చేరడంతో అక్కడి నుంచి కూడా శ్రీశైలం జలాశయానికి ప్రవాహం పెరిగింది. వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో శ్రీశైలం గేట్లు ఓపెన్ చేసి, నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేశారు. కృష్ణమ్మ ఉగ్రరూపాన్ని చూస్తూ వందలాది పర్యాటకులు డ్యామ్ వద్దకు తరలివచ్చారు. వరద నీటి ఉధృతిని ఆస్వాదించేందుకు ప్రజలు భారీగా హాజరయ్యారు. ఇక డ్యామ్ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు అధికారులు ముందుగానే హెచ్చరికలు జారీ చేశారు. అప్రమత్తంగా ఉండాలని, ఆ ప్రాంతాల నుంచి దూరంగా ఉండాలని కోరారు. అవసరమైతే పునరావాస కేంద్రాలను సిద్ధం చేసే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం అన్ని విధాలుగా తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అధికారులు వరద ముప్పు ఉన్న గ్రామాలపై దృష్టి సారించారు. ఈ సందర్భంగా శ్రీశైలం డ్యామ్ ప్రాంతం పండుగవాతావరణాన్ని తలపించింది. ప్రకృతి అందాల మధ్య నీటి ఉధృతి చూసేందుకు వచ్చిన పర్యాటకులకు ఇది ఒక అద్భుత అనుభవంగా మిగిలింది. కృష్ణమ్మ కలకలలతో దూసుకొస్తూ కట్టడి గలదా అనే ఉత్సాహాన్ని అందరిలో నింపింది.