AP Teachers : సమ్మె దిశగా ఏపీ టీచర్లు
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి తడఖా చూపడానికి ఉపాధ్యాయులు మళ్లీ సిద్ధం అయ్యారు. సాధారణంగా పరీక్షలు, పశ్నాపత్రాలు దిద్దే సమయంలోనే వాళ్లు ధర్నాలు, ఆందోళనలు, నిరసనలు చేపడతారు.
- Author : CS Rao
Date : 17-05-2022 - 4:03 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీ సీఎం జగన్ మొహన్ రెడ్డికి తడాఖా చూపడానికి ఉపాధ్యాయులు మళ్లీ సిద్ధం అయ్యారు. సాధారణంగా పరీక్షలు, పశ్నాపత్రాలు దిద్దే సమయంలోనే వాళ్లు ధర్నాలు, ఆందోళనలు, నిరసనలు చేపడతారు. ఇంతకాలం సీపీఎస్ మీద రకరకాల మలుపు తిరిగిన జగన్ సర్కార్ అంతు చూడడానికి ప్రశ్నాపత్రాలు దిద్దే సమయాన్ని ఎంచుకున్నారు. వాల్యుయేషన్ చేయడానికి 50 ప్రశ్నలున్న పశ్నాపత్రానికి, 100 మార్కులున్న దానికి ఒకేలా జగన్ సర్కార్ ఫిక్స్ చేసింది. దీనిపై అనూహ్యంగా పెద్ద సంఖ్యలో విశాఖ కేంద్రంగా టీచర్లు రోడ్డెక్కారు.
సీపీఎస్ రద్దు, పది పరీక్షా పత్రాల వాల్యుయేషన్ తదితర సమస్యలపై ఉపాధ్యాయ సంఘాలు విశాఖపట్నంలో భారీ నిరసన చేపట్టాయి. క్వీన్ మేరీ స్కూల్ వద్ద పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు తరలి వచ్చారు. తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ నినాదాలు చేశారు. టీచర్ల సమస్యలను ఉన్నతాధికారులు, ప్రభుత్వం దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా ఫలితం లేదని, అందుకే సమ్మెకు దిగాల్సి వచ్చిందని వెల్లడించారు. పదో తరగతి పరీక్షా పత్రాల వాల్యుయేషన్‌కు సంబంధించి రూ. 50 మార్కుల జవాబు పత్రం దిద్దుబాటు కోసం రూ. 6లు ఇవ్వబడింది. అలాగే, 100 మార్కుల జవాబు పత్రం వాల్యుయేషన్‌కు కూడా రూ. 6లు ధరను ఇవ్వడాన్ని టీచర్లు తప్పుగా గుర్తించారు. పీఆర్సీ, డీఏ తదితర బకాయిల అమలుపై ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శించిందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.
జగన్ మొహన్ రెడ్డి ప్రభుత్వంపై రగిలిపోతోన్న టీచర్లు, సమయం చూసుకుని రోడ్డు మీదకు వచ్చారు. ప్రశ్నాపత్రాల ధరనే కాదు, సీపీఎస్, పీఆర్సీ, డీఏ బకాయిలు తదితరాలను పరిష్కరించిన తరువాత మాత్రమే వాల్యూషన్ కు వస్తామని తెగేసి చెబుతున్నారు. పీఆర్సీ కోసం టీచర్లు విజయవాడ కేంద్రంగా చేసిన బలప్రదర్శన అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ తరహా ఉద్యమాన్ని మళ్లీ తీసుకురావడానికి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ప్రయత్నం చేస్తున్నాయి. అందు కోసం ఇప్పడే సరైన సమయంగా టీచర్లు భావిస్తున్నారు. ఇలాంటి గడ్డుపరిస్థితి నుంచి జగన్ సర్కార్ ఎలా భయటపడుతుందో చూడాలి.