TDP Reacts: మా కార్యకర్తలు రోడ్డెక్కితే సీఎం తోక ముడవాల్సిందే
రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోని టీడీపీ కార్యకర్తలు రోడ్డెక్కితే సీఎం జగన్మోహన్ రెడ్డి తోక ముడవాల్సిందేనని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు అన్నారు.
- By HashtagU Desk Published Date - 09:41 PM, Sun - 28 August 22

రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోని టీడీపీ కార్యకర్తలు రోడ్డెక్కితే సీఎం జగన్మోహన్ రెడ్డి తోక ముడవాల్సిందేనని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు అన్నారు. ఈ రోజు ఆయన మాట్లాడిన ఒక వీడియోను మీడియాకు విడుదల చేశారు. చంద్రబాబునాయుడు తన సొంత నియోజకవర్గమైన కుప్పం పర్యటనకు వెళితే వైసీపీ నాయకులు అనేక అరాచకాలు సృష్టించారని మండిపడ్డారు. ఇది చాలా బాధాకరమన్నారు. అన్నా క్యాంటిన్ ఒక మంచి కార్యక్రమమని, అన్నా క్యాంటిన్లను పెడితే పోలీసుల మద్దతుతో ధ్వంసం చేయడం అన్యాయమన్నారు.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏది చెబితే అది కుప్పంలో అమలవుతోందని ఆరోపించారు. ఐపీఎస్ ఆఫీసర్ కూడా వారికి సలాం కొట్టాల్సిందేనన్నారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక అరాచక పాలనలో ఉన్నామా అని ప్రశ్నించారు. మూడు సంవత్సరాల నుంచి రాష్ట్రంలో అనేక దౌర్జన్యాలు జరిగాయని, అనేక మందిపై దాడులు జరిగాయని చెప్పారు. ఘర్షణ చానల్ లో వెంగళరావు అనే అతను ప్రభుత్వం చేసే తప్పుడు కార్యక్రమాలను ఎత్తి చూపితే అతనిపై దాడి చేస్తారా అని అడిగారు. అతనిని స్టేషన్ కు తీసుకెళ్లి బట్టలు ఊడదీసి కొట్టడం అన్యాయమన్నారు. వైసీపీ నాయకులు చానళ్లు పెట్టుకోలేదా అని ప్రశ్నించారు. కోర్టులో మేం కొట్టామని చెబితే నీ రెండు సంవత్సరాల కొడుకును చంపేస్తామని బెదిరించడం ఫ్యాక్షనిజాన్ని తలపిస్తోందని, ఇదేనా సీఐడీ వ్యవస్థ అంటే అని అడిగారు.
రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో టీడీపీకి బలమైన కార్యకర్తలున్నారని తెలిపారు. వైసీపీలో ఉన్న కార్యకర్తలందరూ గూండాలు, రౌడీలు, పెయిడ్ ఆర్టిస్టులని ఆరోపించారు. టీడీపీకి ఉన్న లక్షాలాది మంది కార్యకర్తలు రోడ్డెక్కితే పోలీసులు,సీఐడీ శాఖ కంట్రోల్ చేయగలరా అని ప్రశ్నించారు. జగన్ దౌర్జన్యాలను అడ్డుకోవడానికి అన్ని పార్టీలవారు ముందుకు రావాలని అయ్యన్నపాత్రుడు కోరారు.