TDP : సభ్యత్వ నమోదులో టీడీపీ సరికొత్త రికార్డు: సీఎం చంద్రబాబు
నేటికి దాదాపు 73 లక్షల మంది సభ్యత్వం తీసుకోగా ఇందులో 85 వేల మంది తెలంగాణ నుంచి పొందారని తెలిపారు.
- Author : Latha Suma
Date : 14-12-2024 - 4:09 IST
Published By : Hashtagu Telugu Desk
TDP Membership Registration : ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ సభ్యత్వాల నమోదుపై పార్టీ కేంద్ర కార్యాలయంలో నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా సీఎం మాట్లాడుతూ..సభ్యత్వ నమోదులో టీడీపీ సరికొత్త రికార్డు సృష్టించిందన్నారు. అక్టోబర్ 26న సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కాగా నేటికి ఆ సంఖ్య 73 లక్షలకు చేరిందన్నారు. నేటికి దాదాపు 73 లక్షల మంది సభ్యత్వం తీసుకోగా ఇందులో 85 వేల మంది తెలంగాణ నుంచి పొందారని తెలిపారు. సభ్యత్వ నమోదులో టాప్ 5లో రాజంపేట, నెల్లూరు, కుప్పం, పాలకొల్లు, మంగళగిరి నియోజకవర్గాలు ఉన్నాయని నేతలు సీఎంకు చెప్పారు.
భారీగా కొత్త సభ్యత్వాలకు తోడుగా పెద్ద సంఖ్యలో యువత, మహిళల సభ్యత్వాలు నమోదైనట్లు చంద్రబాబు తెలిపారు. పనితీరు ఆధారంగానే గుర్తింపు, పదవులు తప్ప ఊరికే పార్టీలో ఉన్నామంటే కుదరదని టీడీపీ నేతలకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజలకు, పార్టీకి సేవ చేయకుండా 30-40 ఏళ్ల నుంచి పార్టీలో ఉన్నామని పదవులు ఇమ్మనటం సరికాదని అన్నారు. పార్టీ వల్లే ఏ పదవైనా అని గ్రహించి ప్రవర్తించాలి. కష్టపడనిదే ఏదీ రాదనే విషయం ప్రతిఒక్కరూ గ్రహించాలి అన్నారు.
సభ్యత్వ కార్యక్రమంతో పార్టీకి బలమైన కార్యకర్తల ఆర్మీని తయారు చేస్తామని సీఎం అన్నారు. ప్రతి నలుగురిలో ఒకరు టీడీపీ సభ్యత్వం పొందే పరిస్థితి రావాలని అన్నారు. టీడీపీ కార్యకర్తలకు సంక్షేమం అందించడంతో పాటు రాజకీయంగా, ఆర్థికంగా ఎంపవర్ చేసే కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తామన్నారు. స్కిల్ డెవలప్మెంట్, అవకాశాలు కల్పించడం, ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలకు ప్రాధాన్యత క్రమంలో అందించడం ద్వారా ఆర్థికంగా వాళ్లు నిలదొక్కుకునే కార్యక్రమాలు చేపట్టాల్సి ఉందని సీఎం చంద్రబాబు అన్నారు.