YS Jagan: త్వరలో జగన్ డ్రెస్ మారుతుందా.. నెంబర్ కూడా వస్తుందా..?
పోలీసులపై జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
- By News Desk Published Date - 08:28 PM, Wed - 9 April 25

YS Jagan: వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మంగళవారం శ్రీ సత్యసాయి జిల్లా వెళ్లారు. రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో ఇటీవల హత్యకు గురైన వైసీపీ కార్యకర్త లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ పోలీసులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు పోలీసులు టోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు వాచ్‌మెన్లుగా పనిచేస్తున్నారు.. చంద్రబాబు కోసం పనిచేస్తున్న ప్రతి పోలీసుకూ చెబుతున్నా.. ఎల్లకాలం ఆయన పాలన సాగదు.. చంద్రబాబు పాలన లేని రోజు త్వరలోనే వస్తుంది.. ప్రతి పోలీసు అధికారికి చెబుతున్నా.. మీ బట్టలూడదీస్తాం. యూనిఫాం తీసి, షర్టు లేకుండా నిలబెడతాం. మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తాం అంటూ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. జగన్ వ్యాఖ్యలపై కూటమి నేతలతోపాటు పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Mark Shankar Health : పవన్ కళ్యాణ్ కుమారుడి కోసం అఘోరి ప్రత్యేక పూజలు
జగన్ వ్యాఖ్యలను ఏపీ పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు ఖండించారు. ప్రెస్ మీట్ లో శ్రీనివాసరావు మాట్లాడుతూ.. పోలీసుల బట్టలూడదీసి నిలబెడతామని చెప్పడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. గుడ్డలు ఊడదీయడానికి ఇదేమైనా ఫ్యాషన్ షోనా..? అంటూ ప్రశ్నించారు. జగన్ వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రజలు ఆలోచించాలని కోరారు. జగన్ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని.. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ వ్యాఖ్యలపై శ్రీసత్యసాయి జిల్లా రామగిరి ఎస్సై సుధాకర్ యాదవ్ తీవ్రంగా స్పందిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. జగన్ అధికారంలోకి వచ్చి ఊడదీస్తానంటే ఊడిపోవడానికి పోలీసు యూనిఫాం అరటితొక్క కాదన్నారు. పోలీసుల బట్టలు ఊడదీసి కొడతారా..? అని ప్రశ్నించారు. మీరిస్తే పోలీసులు బట్టలు వేసుకోలేదని పేర్కొన్నారు. కష్టపడి చదివి, పరుగు పందెంలో పాసై, వేలమంది పాల్గొన్న పరీక్షలో నెగ్గి వేసుకున్న యూనిఫాం ఇదని చెప్పారు. జాగ్రత్తగా మాట్లాడాలంటూ జగన్‌ను హెచ్చరించారు.
Also Read: Jitan Ram Manjhi: కేంద్రమంత్రి జితన్‌రామ్ మాంఝీ మనవరాలి దారుణ మర్డర్
మహిళా పోలీసు అధికారిణి భవాని జగన్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులందరి బట్టలు ఊడదీస్తానని మాజీ ముఖ్యమంత్రి జగన్ అన్న మాటలు మహిళా పోలీసుల బట్టలు కూడా ఊడదీస్తామనే విధంగా ఉన్నాయి. మహిళల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి. పోలీసుల్లో మహిళలు కూడా ఉన్నారనే విషయం జగన్ కు తెలియదా..? ముఖ్యమంత్రిగా పని చేసిన మీరే ఇలా మాట్లాడితే… పబ్లిక్ లో అందరూ ఏమనుకుంటారనే దాన్ని మీరే ఆలోచించాలి. తన వ్యాఖ్యలను జగన్ వెనక్కి తీసుకోవాలని పోలీసు అధికారుల సంఘం తరపున డిమాండ్ చేస్తున్నాం అని చెప్పారు.
రాప్తాడు పర్యటనలో టీడీపీపై, పోలీసులపై జగన్ వ్యాఖ్యలను హోం మంత్రి అనిత ఖండించారు. నిన్నటి జగన్ పర్యటన డ్రామాను తలపించిందని అన్నారు. జగన్ పర్యటన సందర్భంగా 1,100 మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశామని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు కూడా ఇంతటి భద్రతను కల్పించలేదని చెప్పారు. జగన్ వెళుతున్న ప్రాంతం చాలా సెన్సిటివ్ అని, అందుకే భారీ భద్రతను కల్పించామని అన్నారు. కానీ, కావాలనే సీన్ క్రియేట్ చేశారని మండిపడ్డారు. పోలీసు అధికారుల బట్టలు ఊడదీస్తానని మాజీ సీఎం అనొచ్చా..? అని అనిత ప్రశ్నించారు. ఇలాంటి ప్రవర్తన వల్లే 151 నుంచి 11కి దిగిపోయావని ఎద్దేవా చేశారు. నువ్వు మారకపోతే వచ్చే ఎన్నికల్లో 11 కూడా రావని అన్నారు. జగన్ వెళ్లిన వెంటనే హెలికాప్టర్ వెళ్లిపోవడంపై దర్యాప్తు చేస్తామని చెప్పారు.
జగన్ పోలీసులపై చేసిన వ్యాఖ్యల పట్ల బీజేపీ నేత భాను ప్రకాశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో ప్రజాస్వామ్యంను ఖూనీ చేశారు. నిన్ను నమ్మి ఇష్టారీతిలో వ్యవహరించిన కొందరు అధికారులు జైళ్లకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. సీఎంగా ఐదేళ్లు పనిచేసిన వ్యక్తి పోలీసులపై ఇంత నీచంగా మాట్లాడటం సరికాదని, ఆయన తీరు మార్చుకోవాలని హితవు పలికారు. ఆయన డ్రెస్సే మారుతుంది.. ఆయనకు ప్రత్యేక నెంబర్ కూడా వస్తుంది.. ఆయనేంది పోలీసులను విమర్శించేది అంటూ ప్రజలు అంటున్నారని భాను ప్రకాశ్ అన్నారు.