TDP vs YSRCP : సామాజిక సాధికార బస్సు యాత్ర దళితవాడల్లో చేసే దమ్ము వైసీపీకి ఉందా..?
వై ఏపీ నీడ్స్ జగన్ అని వైసీపీ నాయకులు అంటుంటే.. ఏపీ దళితులు మాత్రం ఉయ్ హేట్ జగన్ అని నినదిస్తున్నారని టీడీపీ
- By Prasad Published Date - 05:57 PM, Tue - 14 November 23

వై ఏపీ నీడ్స్ జగన్ అని వైసీపీ నాయకులు అంటుంటే.. ఏపీ దళితులు మాత్రం ఉయ్ హేట్ జగన్ అని నినదిస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య పేర్కొన్నారు. దళితులకు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అన్యాయంపై వర్ల రామయ్య ధ్వజమెత్తారు. నంద్యాలజిల్లా, కొలిమిగుండ్లలో దళిత న్యాయవాది మంద విజయ్ కుమార్, తన తల్లిపై వైసీపీ గూండాలు, రౌడీలు చేసిన దాడిని రామయ్య తీవ్రంగా ఖండించారు. దళితులు నా మేనమామలు అంటున్న జగన్ దళితులపై గత నాలుగున్నరేళ్లుగా జరుగుతున్న అఘాయిత్యాల్లో ఒక్క ఘటనపై కూడా స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. దళితులపై జగన్మోహన్ రెడ్డి కపటప్రేమ చూపుతున్నారని దళితులందరికీ అర్ధమైందని, జగన్ ను దళితుంలతా అసహ్యించుకుంటున్నారని అన్నారు. ఇలాంటి జగన్మోహన్ రెడ్డిని దళితులు మరోసారి కావాలని ఎలా అనుకుంటారో ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. తమ ఓట్లతో సీఎం అయ్యాక తమపై యథేచ్ఛగా దాడులు జరుగుతున్నా పట్టనట్టు జగన్ వ్యవహరిస్తున్నారని దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డికి దళితుల్లో స్థానం లేదని, దళితులు తమతో ఉన్నారని పగటి కలలు కనడం హాస్యాస్పదమేనని అన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
వైసీపీ చేస్తున్న సామాజిక సాధికార బస్సుయాత్ర దళితవాడల్లో కాకుండా మిగిలిన ప్రాంతాల్లో మాత్రమే చేస్తున్నారని వర్ల రామయ్య ఆరోపించారు. దళితులకు తామేమి చేశామో చెప్పే దమ్ములేకే దళితులకు ముఖం చూపించలేక మంత్రులు తప్పించుకుని బస్సుల్లో తిరుగుతున్నారని స్పష్టం చేశారు. దళితులకు వైసీపీ ప్రభుత్వం న్యాయం చేస్తే దళితవాడల్లో బస్సుయాత్ర చేయాలని వర్ల రామయ్య సవాల్ విసిరారు. దళితవాడల్లో బస్సుయాత్ర చేస్తే వైసీపీ మంత్రులను దళితులు తరిమికొట్టడం ఖాయం అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో దళిత ఉపముఖ్యమంత్రికి, మంత్రులకు గౌరవం ఉందా? అని రామయ్య నిలదీశారు. రెడ్డి సామాజికవర్గానికి చెందిన మంత్రులు కుర్చీల్లో కూర్చుంటే దళిత ఉపముఖ్యమంత్రి మాత్రం చేతులు కట్టుకుని నిలబడాల్సిన దుస్థితి, కుల దురహంకారం వైసీపీలో ఉందని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుర్చీలో కూర్చుని దళిత మంత్రి విశ్వరూప్ ను మోకాళ్లపై కూర్చోబెట్టి అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత ఎమ్మెల్యేలు, మంత్రులు, ఉపముఖ్యమంత్రి సైతం దళితుల ఆత్మగౌరవాన్ని జగన్ కాళ్ల వద్ద తాకట్టు పెట్టి అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: Hyderabad : సదర్ ఉత్సవ్ మేళా దృష్ట్యా హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు